మీ పాత బంగారు ఆభరణాలకు హాల్ మార్క్ లేదా.. అయితే కష్టమే, నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం పాత బంగారు నగలకు హాల్ మార్క్ గుర్తు లేకుంటే వినియోగదారులు వాటిని విక్రయించలేరు, ఎక్స్‌ఛేంజ్ కూడా చేసుకోలేరు. దీనికి సంబంధించి నిబంధనలు ఏం చెబుతున్నాయో ఒకసారి చూస్తే:
 

You cannot sell, exchange your old un-hallmarked gold jewellery now without doing this

బంగారు ఆభరణాలు, కళాఖండాలు, ఇతర బంగారు వస్తువుల విక్రయానికి సంబంధించి వున్న మార్గదర్శకాల్లో భారత ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దీని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అన్ని బంగారు ఆభరణాలు, కళాఖండాలు తప్పనిసరిగా హాల్‌మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ (హెచ్‌యూఐడీ) నెంబర్‌ను కలిగి వుండాలని స్పష్టం చేసింది. హెచ్‌యూఐడీ నెంబర్ ప్రతి బంగారు వస్తువుకు ప్రత్యేక గుర్తింపును నిర్ధారిస్తుంది. అంతేకాకుండా బంగారు వస్తువులు తప్పనిసరిగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) లోగో, స్వచ్ఛత గుర్తును కలిగి వుండాలి.

ప్రస్తుతం ఇన్వెస్టర్లంతా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడి సాధనంగా చూస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలు తీసుకొచ్చింది. ఈ కొత్త మార్గదర్శకాల వల్ల బంగారు ఆభరణాలు, కళాఖండాల కొనుగోలు విషయంలో మరింత పారదర్శకత, విశ్వసనీయత, వినియోగదారులకు నమ్మకాన్ని కలిగిస్తాయని భావిస్తున్నారు. అంతేకాదు కొత్తగా బంగారు ఆభరణాల కొనుగోలు ఇప్పుడు మరింత పారదర్శకంగా, సురక్షితంగా మారుతుంది.  ప్రభుత్వ నిర్ణయంతో వినియోగదారుల వద్ద వున్న పాత, హాల్‌మార్క్ లేని బంగారు ఆభరణాలకు ఖచ్చితంగా హాల్ మార్క్ వేయించాలి. లేనిపక్షంలో వాటిని విక్రయించలేరు. 

బీఐఎస్ ప్రకారం.. తమ వద్ద వున్న బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్ లేని పక్షంలో వాటిని విక్రయించాల్సి వస్తే ఖచ్చితంగా హాల్‌మార్క్ పొందాలి. దీనికి సంబంధించి వినియోగదారులకు రెండు మార్గాలు వున్నాయి. బీఐఎస్ నమోదిత వ్యాపారి ద్వారా పాత ఆభరణాలకు హాల్‌మార్క్ చేయించుకోవచ్చు. సదరు ఆభరణాల వ్యాపారి హాల్‌మార్క్ చేయని బంగారు ఆభరణాలను బీఐఎస్ పరీక్ష, హాల్ మార్కింగ్ కేంద్రానికి తీసుకెళతారు. బంగారు ఆభరణాలను హాల్ మార్క్ చేయడానికి వినియోగదారులు ఒక్కో ఆర్టికల్‌కు రూ.45 నామమాత్రపు రుసుమును చెల్లించాల్సి వుంటుంది. వినియోగదారులకు అందుబాటులో వున్న రెండో మార్గం.. ఏదైనా బీఐఎస్ గుర్తింపు పొందిన అస్సేయింగ్ అండ్ హాల్ మార్కింగ్ కేంద్రం నుంచి ఆభరణాలను పరీక్షించుకోవడం. ఆర్టికల్‌ల సంఖ్య ఐదు లేదా అంతకంటే ఎక్కువ వుంటే కనీసం రూ.200 నామమాత్రపు రుసుమును చెల్లించాల్సి వుంటుంది. 

అలాగే పాత, హాల్‌మార్క్ లేని ఆభరణాలను పరీక్షించడానికి బీఐఎష్ ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. బీఐఎస్ గుర్తింపు పొందిన టెస్టింగ్ అండ్ హాల్ మార్కింగ్ కేంద్రం జారీ చేసిన టెస్ట్ రిపోర్ట్ వల్ల మీ ఆభరణాల స్వచ్ఛత తెలుస్తుంది. వినియోగదారులు తమ పాత , హాల్ మార్క్ లేని బంగారు ఆభరణాలను విక్రయించడానికి వ్యాపారి వద్దకు వెళ్లినప్పుడు దానిని తీసుకెళ్లొచ్చు. 

అలాగే వినియోగదారులు తమ ఆభరణాలపై గతంలో అమల్లో వున్న పాత హాల్ మార్క్ గుర్తులు కలిగి వున్నట్లయితే అవి ఇప్పటికీ హాల్ మార్క్ చేయబడిన ఆభరణాలుగానే పరిగణిస్తామని తెలిపింది. పాత గుర్తులతో ఇప్పటికే హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాలకు హెచ్‌యూఐడీ నెంబర్‌తో మళ్లీ హాల్‌మార్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాంటి హాల్‌మార్క్ వున్న ఆభరణాలను సులభంగా విక్రయించుకోవచ్చు లేదా కొత్త డిజైన్ కోసం మార్చుకోవచ్చు. 

హాల్‌ మార్కింగ్ నిబంధనల నుంచి మినహాయింపులు:

జూన్ 16, 2021 నుంచి భారతదేశంలో గోల్డ్ హాల్ మార్కింగ్ తప్పనిసరి అయినప్పటికీ, ప్రభుత్వం కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. 

అవేంటంటే :

  • రూ.40 లక్షల వరకు వార్షిక టర్నోవర్ వున్న ఆభరణాల సంస్థలు
  • 2 గ్రాముల కంటే తక్కువ బరువున్న బంగారు వస్తువులు
  • ఎగుమతుల కోసం తయారు చేసిన వస్తువు (ఎందుకంటే ఇది విదేశీ కొనుగోలుదారు అవసరాన్ని నిర్దారిస్తుంది)
  • ఆభరణాలు అంతర్జాతీయ ప్రదర్శనల కోసం , ప్రభుత్వం ఆమోదించిన దేశీయ వ్యాపార ప్రదర్శనల కోసం ఉద్దేశించినవైతే
  • వైద్య, దంత వైద్యం, పశువైద్యం, శాస్త్రీయ లేదా పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉపయోగించేందుకు ఉద్దేశించినదైతే
  • గోల్డ్ వాచ్‌లు, ఫౌంటెన్ పెన్నులు, కుందన్, పోల్కీ అండ్ జడౌ వంటి ప్రత్యేక ఆభరణాలు
  • బార్, ప్లేట్, షీట్, రేకు, రాడ్, వైర్, స్ట్రిప్, ట్యూబ్ , నాణెం ఆకారంలో వున్న బంగారు కడ్డీలు

ఈ నియమాలు కొత్తగా బంగారం కొనుగోలు చేసేవారికి ఎలా సహాయపడతాయంటే:

ఆభరణాలు హెచ్‌యూఐడీకి అనుగుణంగా లేనట్లయితే గోల్డ్ హాల్ మార్కింగ్ నియమాలు వినయోగదారులకు రక్షణ అందిస్తాయి. బీఐఎస్ రూల్స్ 2018లోని రూల్ 49 ప్రకారం.. ఒక కస్టమర్ స్వచ్ఛతను 22k అని సూచించిన ఆభరణాలను వ్యాపారి నుండి కొనుగోలు చేయగా.. అది 20 గ్రాముల బరువుండి, HUID స్వచ్ఛతను 18kగా పేర్కొన్నట్లయితే, వినియోగదారుడు కింది విధంగా పరిహారం పొందేందుకు అర్హులు:

  • 1 గ్రాము 18k: రూ.5,000
  • 20 గ్రాముల 18k: రూ.1,00,000
  • 1 గ్రాము 22k: రూ.6,000
  • 22k ప్రకారం 20 గ్రాముల ధర: రూ.120,000

పరిహారం మొత్తం = 2 X (120,000 - 100,000) + టెస్టింగ్ ఛార్జీలు = రూ.40,000 + టెస్టింగ్ ఛార్జీలు.

ఇది కాక, HUID లేకుండా (మినహాయింపు పొందిన కేటగిరీలు మినహా) బంగారు ఆభరణాలను విక్రయించే నగల వ్యాపారులు ఆభరణాల ధర కంటే ఐదు రెట్లు ఎక్కువ జరిమానా లేదా ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా BIS చట్టం, 2016లోని సెక్షన్ 29 నిబంధనల ప్రకారం రెండింటినీ ఎదుర్కోవచ్చు.

జూన్ 16, 2021 నుండి గోల్డ్ హాల్‌మార్కింగ్ దేశంలో తప్పనిసరి అయింది. కొత్త నిబంధనల ప్రకారం హాల్‌మార్కింగ్ ప్రాక్టీస్.. దశలవారీగా దేశవ్యాప్తంగా తప్పనిసరి చేయబడింది. అయితే ఏప్రిల్ 1, 2023 నిర్ధారిత గడువు కంటే ముందే కొంతమంది రిటైలర్లు ప్రభుత్వం ముందు ప్రత్యేక వాదనలను వుంచుతున్నారు. దాదాపు 2 సంవత్సరాల సమయం అందించినప్పటికీ (జూన్ 2021 ప్రకటన నుండి), వారు తమ పాత స్టాక్‌ను పూర్తి చేయలేకపోయినట్లు తెలిపారు. ఈ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం HUID లేకుండా పాత స్టాక్‌ను క్లియర్ చేయడానికి జూన్ 30, 2023 వరకు గడువును పొడిగించింది. అయితే తమ పాత స్టాక్‌ను ప్రకటించి, ఈ విషయంలో నిర్దిష్ట ప్రకటన చేసిన ఆభరణాలు , రిటైలర్లకు మాత్రమే గడువు పొడిగించబడింది. 

మిగిలిన దేశాలతో పోల్చితే భారతదేశంలో గోల్డ్ హాల్‌మార్కింగ్ నియమాలు ఎలా ఉన్నాయి:

గోల్డ్ హాల్‌మార్కింగ్ నిబంధనలు ప్రతి దేశానికి వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు.. దుబాయ్, యూకే, హంగరీ, స్వీడన్, ఫిన్లాండ్ , రష్యా వంటి కొన్ని దేశాలకు హాల్‌మార్క్ అవసరం. ఈ దేశాల్లోని బంగారు ఆభరణాల స్వచ్ఛతను స్వతంత్ర సంస్థలు ధృవీకరిస్తాయి.

ఉదాహరణకు.. దుబాయ్‌లో బరీక్ సర్టిఫికేషన్ ద్వారా దుబాయ్ సెంట్రల్ లాబొరేటరీస్ డిపార్ట్‌మెంట్ (DCLD) బంగారం స్వచ్ఛతను ధృవీకరిస్తుంది. ఇటలీ , జర్మనీ వంటి దేశాలలో తయారీదారు గుర్తు ఆభరణాలపై నమోదు చేయాలి. ఇవి స్వతంత్రంగా పర్యవేక్షించబడే హాల్‌మార్క్‌గా ఉపయోగించబడతాయి. అమెరికాలో బంగారు ఆభరణాల కోసం అధికారిక గోల్డ్ హాల్‌ మార్కింగ్ వ్యవస్థ లేదు. దీనికి బదులుగా రాష్ట్రాలు, నగరాల్లో స్వతంత్రంగా టెస్టింగ్ ఏజెన్సీలు ఉన్నాయి. చైనా , స్విట్జర్లాండ్‌లో గోల్డ్ హాల్ ‌మార్కింగ్ స్వచ్ఛందంగా అమల్లో ఉంది. HUID వ్యవస్థ మాత్రం భారతదేశానికి ప్రత్యేకమైనది. బంగారు ఆభరణాల విషయంలో మన దేశం ప్రపంచంలోని అత్యుత్తమ ప్రమాణాలను అనుసరిస్తుందని నిర్ధారించడానికి ఇది ప్రవేశపెట్టబడింది.

కొత్త హాల్‌మార్కింగ్ నిబంధనలు బంగారం కొనుగోలు, అమ్మకం విషయంలో ఎక్కువ పారదర్శకతను తీసుకురావడానికి భారతదేశ ప్రయత్నాలను పెంచుతుందని నిపుణులు అంటున్నారు. చట్టబద్ధతను అందించడం ద్వారా బంగారం ప్రామాణికతను థర్డ్-పార్టీ ధృవీకరణను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీర్ఘకాలంలో హాల్‌మార్కింగ్ వల్ల కొనుగోలుదారులు సరైన ఎంపికను చేసుకోవడానికి ,  వారు నాసిరకం బంగారు ఉత్పత్తులతో మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. 

(note : ఈ కథనం ఖైతాన్ & కో అసోసియేట్‌ సృష్టి సురేష్, దాని పార్ట్‌నర్ స్తుతి గలియాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు. ఇవి వారి వ్యక్తిగతం)

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios