Asianet News TeluguAsianet News Telugu

భారత్‌ వృద్ధి అంతంతే: 6 శాతానికే పరిమితం అన్న ప్రపంచ బ్యాంక్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వ్రుద్ధిరేటు అంతంత మాత్రమేనని ప్రపంచ బ్యాంకు తేల్చేసింది. నరేంద్రమోదీ ప్రభుత్వం ఎన్ని ఉద్దీపన చర్యలు చేపట్టినా పెద్దగా పురోగతి ఉండక పోవచ్చునని, జీడీపీ వ్రుద్దిరేటు ఆరు శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. డిమాండ్ లేకపోవడమే దీనికి కారణమని.. అయితే వచ్చే ఏడాది నుంచి క్రమంగా పుంజుకోనున్నదని వెల్లడించింది.

World Bank Report Pegs Indias Growth Rate At 6
Author
Hyderabad, First Published Oct 14, 2019, 1:51 PM IST

న్యూఢిల్లీ: ప్రభుత్వం ఎన్ని ‘ఉద్దీపన’ చర్యలు ప్రకటించినా ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు కనిపించడం లేదు. దీంతో అంతర్జాతీయ సంస్థలు భారత వృద్ధి రేటును తగ్గించేస్తున్నాయి.

తాజాగా ప్రపంచ బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఏకంగా 1.5 శాతం కుదించి వేసింది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో భారత జీడీపీ వృద్ధి రేటు 2019-20లో 7.5 శాతం ఉంటుందన్న ప్రపంచ బ్యాంకు, ఇపుడు దాన్ని ఆరు శాతానికి పరిమితం చేసింది.

గత ఆర్థిక సంవత్సరం (2018-19) నమోదైన జీడీపీ వ్రుద్ధిరేటు 6.8 శాతంతో పోల్చి నా ఇది 0.8 శాతం తక్కువ. వృద్ధి రేటు మరింత నీరసించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. అదే జరిగితే ఇప్పటికే కష్టాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థకు మరిన్ని కష్టాలు తప్పవని స్పష్టం చేసింది.

భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనాన్ని ఎదుర్కొనుందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక స్పష్టం చేసింది. వినియోగదారుల్లో డిమాండ్‌ పడకేయడమే భారత జీడీపీ వృద్ధి రేటు నీరసించడానికి ప్రధాన కారణమని ప్రపంచ బ్యాంకు పేర్కొన్నది.

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో ప్రైవేట్‌ వినియోగం 7.3 శాతం నుంచి 3.1 శాతానికి, తయారీ రంగ వృద్ధి రేటు పది శాతం నుంచి ఒక శాతానికి పడిపోవడాన్ని గుర్తు చేసింది. గ్రామీణ ఆదాయ వృద్ధి రేటు అంతంత మాత్రమేనని తెలిపింది.

దీంతో డిమాండ్‌ తగ్గి, వస్తు-సేవల వినియోగమూ తగ్గిపోయిందని తెలిపింది. ప్రస్తుతం ఫైనాన్సియల్‌ మార్కెట్‌లో నెలకొన్న సంక్షోభాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే దక్షిణాసియా దేశాల్లో తీవ్రమైన ఆర్థిక మందగమనం పొంచి ఉందనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన చర్యలతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి వృద్ధి రేటు మళ్లీ పట్టాలెక్కే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా. ముఖ్యంగా కార్పొరేట్‌ టాక్స్‌ తగ్గింపుతో పెట్టుబడులు ఊపందుకుంటాయని తెలిపింది.

కొన్ని సవాళ్లు పొంచి ఉన్నా భారత ఆర్థిక వ్యవస్థ 2020-21లో 6.9 శాతం, 2021-22లో 7.2 శాతం వృద్ధి రేటు నమోదు చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. భారత్‌తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం బంగ్లాదేశ్‌, నేపాల్‌ దేశాల జీడీపీ వృద్ధి రేటు ఎక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది.

‘ఇటీవల మందగమనం చోటు చేసుకున్నా కానీ.. ఎంతో సామర్థ్యంతో భారత్‌ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉంది. ప్రపంచంలో ఎన్నో దేశాల కంటే భారత వృద్ధి రేటు అధికం.’ అని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంత ముఖ్య ఆర్థికవేత్త హన్స్‌ టిమ్మర్‌ తెలిపారు.

బంగ్లాదేశ్‌లో ఈ సంవత్సరం దక్షిణాసియాలోనే అత్యధికంగా 8.1 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని బ్యాంకు దక్షిణాసియా విభాగం ప్రధాన ఆర్థికవేత్త హాన్స్‌ టిమ్మర్‌ చెప్పారు. నేపాల్‌లోనూ ఈ సంవత్సరం 6.5 శాతం జీడీపీ వృద్ధి రేటు నమోదవుతుదన్నారు.

కానీ, దేశీయంగా ఆర్థిక వ్యవస్థ తిరోగమనం కారణంగా వృద్ధి రేటును ప్రపంచ బ్యాంక్‌ తగ్గించిందని ఆర్ధిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచ బ్యాంక్‌ నివేదిక ప్రకారం పారిశ్రామిక ఉత్పత్తి కూడా ఆశాజనకంగా లేదని తెలిపింది. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పారిశ్రామిక రాయితీలతో ఆర్థిక వ్యవస్థ ఏ మేరకు పుంజుకుంటుందో వేచి చూడాలని పేర్కొంది.

గత వారం రేటింగ్‌ ఏజెన్సీ ప్రకటించిన మూడీస్ ఇన్వెస్టర్స్ నివేదిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశ వృద్ధి రేటు అంచనాను 6.2 శాతం నుండి 5.8 శాతానికి తగ్గించింది. క్షీణించిన వృద్ధి రేటు వల్ల ప్రభుత్వం ఆర్థిక ప్రణాళికలను రూపొందించడానికి ఇబ్బందులను ఎదుర్కోనున్నదని నివేదిక తెలిపింది.

కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వల్ల ప్రభుత్వం రూ.1.5 లక్షల కోట్ల పన్ను ఆదాయాన్ని కోల్పోనుందని తెలిపింది. ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నా క్షీణించిన వృద్ధి రేటు ఆందోళన కలిగించే అంశమని నివేదిక స్పష్టం చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios