Asianet News TeluguAsianet News Telugu

ఔదార్యానికి అజీం ప్రేమ్‌జీ మారుపేరు: కరోనాపై పోరుకు రూ.1125 కోట్లు

కరోనా వైరస్ మహమ్మారిపై పోరుకు విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్ జీ తన దాత్రుత్వ గుణాన్ని మరోసారి చాటుకున్నారు. అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్, విప్రో సంస్థల ఆధ్వర్యంలో రూ.1125 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ నిధులతో ప్రాణాలు పణంగా పెట్టి కరోనా రోగులకు చికిత్సనందిస్తున్న వైద్య సిబ్బంది రక్షణకు అవసరమైన పరికరాలను కొనుగోలు చేస్తామని వెల్లడించారు.

Wipro, Azim Premji Foundation commit Rs 1,125 crore to tackle Covid-19
Author
Hyderabad, First Published Apr 2, 2020, 11:48 AM IST

 

బెంగళూరు: మానవాళికి పెనుముప్పుగా పరిణమించిన ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరులో ప్రజలకు అండగా ఉండేందుకు అజీమ్‌ ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ముందుకు వచ్చింది. మహమ్మారిపై పోరాడేందుకు విప్రో లిమిటెట్‌, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌లతో కలిసి రూ. 1125 కోట్ల నిధులు వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు మూడు సంస్థలు కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు కేటాయించిన ఈ భారీ మొత్తం తాము చేపట్టే సామాజిక కార్యక్రమాల కోసం (కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ) ఖర్చుపెట్టే నిధులకు అదనం అని వెల్లడించింది. 

అంటువ్యాధి ప్రబలకుండా తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి అండగా ఉంటామని  పేర్కొంది. తాము అందించే నిధులతో కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటానికి మద్దతు లభిస్తుందని భావిస్తున్నట్లు విప్రో వెల్లడించింది. ఈ కష్టకాలంలో ముఖ్యంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తున్నామని విప్రో వ్యాఖ్యానించింది.

కాగా రూ. 1125 కోట్లలో ఎక్కువ మొత్తం అజీమ్‌ ఫౌండేషన్‌ నుంచే సమీకరించినట్లు తెలుస్తోంది. విప్రో లిమిటెడ్‌ రూ. 100 కోట్లు, విప్రో ఎంటర్‌ప్రైజెస్‌ రూ. 25 కోట్లు అందించగా.. అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ రూ. 1000 కోట్లు కరోనాపై పోరుకు కేటాయించారు. ఇక విప్రో కంపెనీల వ్యవస్థాపకుడు, ఐటీ దిగ్గజం అజీం ప్రేమ్‌జీ 2019 మార్చిలో సామాజిక సేవ నిమిత్తం తన సంపదలో రూ.52,750 కోట్లు(ఆయన షేర్లలో 34 శాతానికి సమానం) వెచ్చించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిధులను అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌ ద్వారా ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు.

పరిస్థితులు దయనీయంగా ఉన్న ప్రాంతాల్లో వైద్యారోగ్య పరిస్థితులను మెరుగు పరిచేందుకు సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించింది. దీనికోసం 1600 మందితో కూడిన అజీం ప్రేమ్ జీ ఫౌండేషన్ టీం ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పని చేయనున్నట్లు తెలిపారు. ఏటా తమ సంస్థ కేటాయించే సీఎస్ఆర్ నిధులు, ఇతర దాత్రుత్వ కార్యక్రమాలకు ఇవి అదనం అని విప్రో తెలిపింది.

కరోనా మహమ్మారిపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పోరులో భాగస్వాములు కావాలన్న ప్రధాని నరేంద్రమోదీ పిలుపు మేరకు పీఎం కేర్స్ నిధికి వ్యాపార వర్గాల నుంచి భారీ విరాళాలు అందుతున్నాయి. టాటా సన్స్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలతోపాటు పలు ప్రైవేట్, ప్రభుత్వ రంగ సంస్థలు భూరి విరాళాలు ప్రకటించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios