చైనాను అధిగమించి అమెరికా భారత్‌కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఆవిర్భవించింది. భారత్‌-అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయన్న విషయాన్ని ఇది రుజువు చేస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2018-19)లో అమెరికా-భారత్‌ మధ్య 87.95 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది.

కాగా, చైనా-భారత్‌ మధ్య 87.07 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని, అదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు అమెరికా-భారత్‌ మధ్య 68 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం, చైనా-భారత్‌ మధ్య 64.96 బిలియన్‌ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగిందని కేంద్ర వాణిజ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకొనేందుకు భారత్‌, అమెరికా కసరత్తు చేస్తున్నందున ఈ ధోరణి మున్ముందు కొనసాగుతుందని వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు. భారత్‌-అమెరికా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదిరితే ద్వైపాక్షిక వాణిజ్యం సమున్నత శిఖరాలకు చేరుతుందని ఓ వాణిజ్య నిపుణుడు తెలిపారు.

దేశీయ వస్తు, సేవలకు అమెరికా అతిపెద్ద మార్కెట్‌గా ఉన్నందున అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్‌కు ఎంతో లబ్ధి చేకూరుస్తుందని భారత ఎగుమతి సంస్థల సమాఖ్య (ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌) డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ పేర్కొన్నారు.

భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతులతోపాటు దిగుమతులు పెరుగుతున్నాయని, చైనాతో ఇవి రెండూ తగ్గుతున్నాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ తెలిపారు. భారత్‌ మిగులు వాణిజ్యాన్ని కలిగివున్న అతికొద్ది దేశాల్లో అమెరికా ఒకటి. మరోవైపు చైనాతో భారత్‌కు వాణిజ్యలోటు (ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం) భారీగా ఉన్నది.

గత ఆర్థిక సంతవ్సరం అమెరికాతో 16.85 బిలియన్‌ డాలర్ల మిగులు వాణిజ్యాన్ని కలిగివున్న భారత్‌కు చైనాతో 53.56 బిలియన్‌ డాలర్ల వాణిజ్యలోటు ఉన్నది. 2013-14 నుంచి 2017-18 వరకు చైనా, అంతకుముందు యూఏఈ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌) మన దేశానికి అతిపెద్ద భాగస్వామిగా ఉన్నట్టు వాణిజ్యశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

భారత్‌-అమెరికా మధ్య వాణిజ్య వివాదాలను పరిష్కరించుకొనేందుకు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎంతో కీలకమని అగ్రరాజ్యంలోని అత్యున్నత బిజినెస్‌ సలహా సంస్థ పేర్కొన్నది. మొక్కజొన్న, సోయాబీన్‌ లాంటి కొన్ని సరుకుల విషయంలో అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా, ఎగుమతిదారుగా కొనసాగుతున్నందున వ్యవసాయ, ఆహార ఉత్పత్తులు సహా కొన్ని రంగాల్లో వాణిజ్య ఒప్పందం కోసం అగ్రరాజ్యంతో జరిపే చర్చల్లో భారత్‌ ఒకింత జాగ్రత్తతో వ్యవహరించాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ‌) ప్రొఫెసర్‌ రాకేశ్‌ మోహన్‌ జోషి సూచించారు.

 ‘అమెరికా-భారత్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే టారిఫ్‌ నిబంధనలు సరళతరమై ఇరు దేశాల మధ్య వాణిజ్యం మరింత పెరుగడంతోపాటు ఉత్పత్తులకు మరింత పెద్ద మార్కెట్‌లో ద్వారాలు తెరుచుకుంటాయి. ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తుల విషయంలో అతిపెద్ద ఎగుమతిదారుగా కొనసాగుతున్న భారత్‌ నుంచి గతేడాది 22.7 బిలియన్‌ డాలర్ల ఎగుమతులు జరిగాయి. 

2017-18లో భారత్‌ నుంచి అమెరికాకు 372 మిలియన్‌ డాలర్ల ఉక్కు ఎగుమతులు జరుగగా.. గత ఆర్థిక సంవత్సరంలో అవి 247 మిలియన్‌ డాలర్లకు తగ్గాయి. భారత్‌ నుంచి మొత్తం ప్రపంచానికి జరిగిన 9.74 బిలియన్‌ డాలర్ల ఉక్కు ఎగుమతుల్లో ఇది కేవలం 2.5 శాతమే’ అని ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రేడ్‌ ప్లాట్‌ఫామ్‌ ‘కనెక్ట్‌2ఇండియా’ వ్యవస్థాపక సీఈవో పవన్‌గుప్తా తెలిపారు. ఈ సారి ట్రంప్‌ పర్యటనలో పరిమిత ఒప్పందం మాత్రమే జరగవచ్చని కనెక్ట్‌2ఇండియా అబ్జర్వుడ్‌ అనే ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌  సీఈఈవో పవన్‌ గుప్తా అభిప్రాయపడ్డారు. 

భారత్‌కు వాణిజ్య మిగులు ఉన్న అతికొద్ది దేశాల్లో అమెరికా కూడా ఒకటి. 2013 నుంచి చైనాతో భారత్‌ అత్యధికంగా వాణిజ్యం నిర్వహిస్తోంది. అంతకు ముందు యూఏఈతో భారత్‌ అత్యధికంగా వాణిజ్యం నిర్వహించేంది. అమెరికాతో చేసుకోబోయే వాణిజ్య ఒప్పందం విషయంలో భారత్‌ అప్రమత్తంగా ఉండాలని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ ప్రతినిధి రాకేష్‌ మోహన్‌ జోషీ సూచించారు. అమెరికా కొన్ని వ్యవసాయ విభాగాల్లో ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేస్తోందని తెలిపారు. వీటిలో సోయాబీన్‌, మొక్కజొన్న ఉన్నాయని తెలిపారు.