న్యూఢిల్లీ: భారతదేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం లేదని అమెరికా పేర్కొంది. భారత్​కు జీఎస్​పీ హోదా తొలగించడానికి గల కారణాలు ఇంకా అలాగే ఉన్నాయని, వాటితో తమకు ఇబ్బందులున్నాయని ఓ వైట్ హౌస్ సీనియర్​ అధికారి తెలిపారు. 

ట్రంప్​ పర్యటనకు రెండు రోజులే సమయం ఉన్నా, ఇంకా ఎలాంటి వాణిజ్య ఒప్పందం ఖరారు కాలేదని స్పష్టం చేశారు. వివిధ రంగాల్లోని మార్కెట్లను అమెరికా వినియోగించుకునేందుకు సమానమైన అవకాశం ఇవ్వడంలో భారత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మార్కెట్ల అవకాశాలకు ఉన్న అడ్డుగోడలను తొలగించేందుకు భారత అధికారులతో చర్చలు కొనసాగుతున్నాయన్నారు.

aslo read బాలీవుడ్ సినిమాపై ట్రంప్ కామెంట్...సోషల్ మీడియాలో వైరల్.... 

ఈ నెల 24, 25న అధ్యక్షుడు ట్రంప్​ నేతృత్వంలోని ఉన్నత స్థాయి అధికారుల బృందం భారత్​లో పర్యటించనున్నది. ఇరుదేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యలపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో డొనాల్డ్ ట్రంప్​ చర్చిస్తారని వైట్ హౌస్  సీనియర్​ అధికారి ఒకరు పేర్కొన్నారు.

మేక్​ ఇన్​ ఇండియాపై భారత్​ వైఖరి కూడా ఆందోళన కలిగిస్తోందన్నారు. ఇటీవలి భారత బడ్జెట్​లో సుంకాల పెంపు ప్రకటన సహా ఇతర సమస్యలపైనా చర్చిస్తామన్నారు.

aslo read మార్చిలో వరుసగా 6 రోజుల పాటు మూతపడనున్న బ్యాంకులు ....?

‘భారతదేశంతో వాణిజ్య, ఆర్థిక సంబంధాలు అమెరికాకు చాలా ముఖ్యం. అదే సమయంలో అమెరికా మార్కెట్లను పొందడమూ భారత్​కు ముఖ్యమే. ఇరు దేశాల మధ్య సమతుల్యతను తేవాలనుకుంటున్నాం. ఆందోళనలను పరిష్కరించాలనుకుంటున్నాం.

వాణిజ్య ప్యాకేజీపై ప్రకటన ఉంటుందా లేదా అనేది పూర్తిగా భారత్​ ప్రభుత్వం తీసుకునే చర్యలపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైతే ఒప్పందం కుదిరే అవకాశం లేదు’ అని వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు కుండబద్ధలు కొట్టారు.