ఈ నెలలో 20 కోట్ల క్లోరోక్వీన్ మాత్రల ఉత్పత్తి.. అమెరికాకు వచ్చేవారం సప్లయి

వచ్చే వారం అమెరికాకు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీ క్లోరోక్వీన్ టాబ్లెట్లను పంపుతామని భారత ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అలయెన్స్ ప్రకటించింది. 

Shipment of hydroxychloroquine to US likely to start next week: IPA

న్యూఢిల్లీ: వచ్చే వారం అమెరికాకు యాంటీ మలేరియా డ్రగ్ హైడ్రాక్సీ క్లోరోక్వీన్ టాబ్లెట్లను పంపుతామని భారత ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అలయెన్స్ ప్రకటించింది. దేశీయ, విదేశీ అవసరాలకు అనుగుణంగా ఔషధాలు ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత ఫార్మాస్యూటికల్ రంగానికి ఉందని భారత ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అలయెన్స్ సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ వెల్లడించారు. 

మందు, వ్యాక్సిన్ లేని కరోనా మహమ్మారికి చికిత్స చేసేందుకు ప్రస్తుతం యాంటీ వైరల్ డ్రగ్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ గేమ్ చేంజర్‌గా మారడంతో దానిపైనే ప్రపంచ దేశాలన్నీ ఆధారపడ్డాయి. మలేరియాకు ఉపయోగించే ఔషధం ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ తొలి స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో చాలా దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి.

తొలుత ఈ మందు ఎగుమతులపై నిషేధం విధించినా.. మిత్ర దేశాల ఒత్తిడి నేపథ్యంలో మానవతా దృక్పథంతో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులు చేయడానికి భారత్  అంగీకరించింది. అయితే మన దేశంలోనూ కేసులు పెరుగుతున్న వేళ స్థానిక అవసరాలు, ఎగుమతులను దృష్టిలో పెట్టుకుని దేశీయ ఫార్మా సంస్థలు ఈ ఔషధాన్ని భారీగా ఉత్పత్తి చేస్తున్నాయి .

జైడస్ కాడిల్లా సీఈఓ పంకజ్ పటేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ’హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉత్పత్తిని ఫార్మా సంస్థలు గణనీయంగా పెంచాయి. ఈ నెలలో 20 కోట్ల ట్యాబ్లెట్లు ఉత్పత్తి చేశాయి. దేశీయ, విదేశీ అవసరాలకు సరిపడేలా 30 టన్నుల ఏపీఐను కాడిలా సిద్ధం చేయనుంది. ఫలితంగా వచ్చే నెలలో 15 కోట్ల ట్యాబ్లెట్లను ఉత్పత్తి చేస్తాం’ అని తెలిపారు. 

Also read:ఒక్కటైన యాపిల్, గూగుల్​.. కరోనాకు ఇక ‘స్మార్ట్’గా చెక్

అంతేకాకుండా.. తగినంత హైడ్రాక్సీ నిల్వలు ఉన్నట్లు పంకజ్ తెలిపారు. దేశీయ అవసరాలతో పాటు ప్రపంచానికి సరిపడా మొత్తంలో భారత్ ఉత్పత్తి చేయగలదని జైడస్ కాడిల్లా సీఈఓ పంకజ్ పటేల్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న అభ్యర్థనల దృష్ట్యా మొదటిగా 13 దేశాలకు ఎగుమతి చేసింది. 

ఇందులో అమెరికా, స్పెయిన్, జర్మనీ, బహ్రెయిన్, బ్రెజిల్, నేపాల్, భూటాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్ తదితర దేశాలు ఉన్నాయి. అమెరికా 48 లక్షల ట్యాబ్లెట్లు కావాలని కోరగా.. 35.82 లక్షల మాత్రలను విడుదల చేసింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios