ముంచుకొస్తున్న ముప్పు.. అంతటా స్తబ్దత

ఇది క్లియర్.. పారిశ్రామిక రంగం పడకేసింది. ఆర్థిక మందకోడి పరిస్థితులు దేశ పారిశ్రామిక రంగ ప్రగతిని నిలిపేశాయని ఎన్ఎస్ఓ విడుదల చేసిన ఆగస్టు ఐఐపీ సూచీ గణాంకాలు చెబుతున్నాయి. -1.1 శాతం వ్రుద్దిరేటు మాత్రమే నమోదు కావడం ఏడేళ్లలో అత్యంత పేలవం.

Seven-year hitch: IIP contracts 1.1% in August

న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగ గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోకి జారుకుందన్న వాదనను మరింత బలపరిచేలా ఉన్నాయి. ఆగస్టు నెల పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) -1.1 శాతానికి పతనమైంది. పారిశ్రామిక రంగానికి ఏడేళ్లలో ఇదే అత్యంత పేలవమైన పనితీరు. అంతేకాక రెండేళ్లకు పైగా కాలంలో ఐఐపీ రుణాత్మకంలోకి మళ్లడం ఇదే తొలిసారి. భారీ యంత్రాలు (క్యాపిటల్‌ గూడ్స్‌), దీర్ఘకాలం మన్నే ఉపకరణాల (కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌) ఉత్పత్తి భారీగా క్షీణించడం ఇందుకు కారణమైంది. పారిశ్రామికోత్పత్తికి సంబంధించి శుక్రవారం కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్ఓ) విడుదల చేసింది. అయితే గతేడాది ఆగస్టులో ఐఐపీ 4.8 శాతంగా నమోదైంది.
 
ఇంతకుముందు యూపీఏ ప్రభుత్వ హయాంలో 2012 నవంబర్ నెలలో సూచీ -1.7 శాతానికి పతనమైంది. ఆ తర్వాత మళ్లీ ఇదే కనిష్ఠ స్థాయి. మొత్తం పారిశ్రామికోత్పత్తిలో 77 శాతం వాటా కలిగిన తయారీ రంగం -1.2 శాతానికి పడిపోయింది. 

ఐదేళ్లలో తయారీ రంగానికిదే కనిష్ఠ ఉత్పత్తి. 2014 అక్టోబర్ నెలలో మాన్యుఫాక్చరింగ్‌ రంగ ఉత్పత్తి -1.8 శాతంగా నమోదైంది. విద్యుత్‌ ఉత్పత్తి వృద్ధి సైతం రుణాత్మకంలోకి మళ్లింది. ఆగస్టులో -0.9 శాతంగా నమోదైంది.

ఇక మైనింగ్‌ రంగం ఉత్పత్తి వృద్ధి 0.1 శాతం కాగా, క్యాపిటల్‌ గూడ్స్‌ రంగంలో ఉత్పత్తి 21 శాతం పైగా పతనమైంది. గత ఏడాది ఆగస్టులో ఈ రంగ వృద్ధి 10.3 శాతంగా నమోదైంది. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ రంగంలోనూ 9.1 శాతం క్షీణత నమోదైంది. 

గతేడాది ఆగస్టులో కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో 5.5 శాతం వృద్ధి నమోదైంది.మౌలిక వసతులు, నిర్మాణ రంగ వృద్ధి వార్షిక ప్రాతిపదికన 4.5 శాతం పడిపోయింది. పరిశ్రమల వారీగా చూస్తే.. మాన్యుఫాక్చరింగ్‌కు చెందిన 23 గ్రూపుల్లో 15 ప్రతికూల వృద్ధిని కనబర్చాయి.
 
దేశంలో మాన్యుఫాక్చరింగ్‌, పారిశ్రామిక కార్యకలాపాలు బలహీనపడ్డాయని తాజా గణాంకాలు సూచిస్తున్నాయని ఎంకే వెల్త్‌మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ జోసెఫ్‌ థామస్‌ అన్నారు. దీన్ని బట్టి చూస్తే రెండో త్రైమాసికంలోనూ జీడీపీ వృద్ధి పుంజుకునే అవకాశాలు కన్పించడం లేదని ఇక్రా ప్రధాన ఆర్థికవేత్త అదితీ నాయర్‌ స్పష్టం చేశారు. మొదటి త్రైమాసికం(ఏప్రిల్‌-జూన్‌)లోనూ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయి 5 శాతానికి జారుకున్న విషయం తెలిసిందే.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios