ముంబై: దేశంలోని అతిపెద్ద వాణిజ్య బ్యాంక్ భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్బీఐ) ఆర్థిక అవకతవకలు వెలుగు చూశాయి. గత మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎస్బీఐ తన మొండి బకాయిలను (ఎన్పీఏ) తక్కువగా చూపినట్లు తాజాగా వెల్లడైంది. భారతీయ రిజర్వు బ్యాంక్‌ (ఆర్బీఐ) నిర్వహించిన ఎస్‌బీఐ -రిస్క్‌ అసెస్‌మెంట్‌ నివేదిక అసలు సంగతిని వెలుగులోకి తెచ్చింది. 

దాదాపు రూ.11,932 కోట్ల విలువైన మొండి బకాయిలు వెలుగులోకి రాకుండా ఎస్బీఐ తొక్కిపెట్టినట్లు ఆర్బీఐ విశ్లేషణ తేల్చింది. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన ఎస్బీఐ తమ తప్పిదాన్ని అంగీకరించింది. ఇదే విషయమై మార్కెట్‌ నియంత్రణ సంస్థకు కూడా ఎస్‌బీఐ వివరణనిచ్చింది. 

also read  డిసెంబర్ 31 నుండి ఆ డెబిట్ కార్డులు పని చేయవు...ఎందుకంటే

మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో తాము రూ.11,932 కోట్ల మేర మొండి బాకీలను తక్కువగా పుస్తకాల్లో లెక్కకు చూపినట్టు బ్యాంక్‌ తెలిపింది. ఆర్బీఐ రిస్క్‌ అసెస్‌మెంట్‌ నివేదిక కూడా ఇదే విషయాన్ని గుర్తించిందని తెలిపింది. ఎస్బీఐ వాస్తవంగా గత ఆర్థిక సంవత్సరంలో ఎన్‌పీఏల నిమిత్తం రూ.12,036 కోట్ల కేటాయింపులు జరపాల్సి ఉంది. 

ఎస్బీఐ అంతకంటే తక్కువగా ప్రొవిజన్స్‌ జరిపినట్టుగా ఆర్బీఐ పరిశీలనలో వెల్లడైంది. గత ఆర్థిక సంవత్సరంలో తమ బ్యాంక్‌ రూ.6,968 కోట్ల మేర నష్టాన్ని నమోదు చేసినందున.. మొండి బకాయిలకు తగినట్లు ప్రొవిజన్స్‌ ఏర్పాటు చేయలేకపోయామని ఎస్బీఐ తన వివరణలో పేర్కొంది. 

2018-19 ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్‌ రూ.1.72 లక్షల కోట్ల మేర నిరర్థక ఆస్తు (మొండి బాకీ)లు ప్రకటించిందని, ఆర్బీఐ లెక్కింపులో ఇది రూ.1.84 లక్షల కోట్లుగా నమోదైనట్లు ఎస్బీఐ వివరణనిచ్చింది. ఇదే సమయంలో బ్యాంక్‌ నికర మొండి బకాయిలను తాము రూ.65,895 కోట్లుగా లెక్కగట్టగా.. ఆర్బీఐ పరిశీలనలో ఇది రూ.77,827 కోట్లుగా లెక్క తేలిందని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ తెలిపింది. 

వీటికి బ్యాంక్‌ రూ.1.18 లక్షల కోట్లు కేటాయింపులు జరపాల్సి ఉండగా రూ.1.06 లక్షల కోట్లకు రిజర్వులను మాత్రమే ఏర్పాటు చేసిందని ఎస్బీఐ తెలిపింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంక్‌ మొండి బకాయిలపై మరో రూ.3,143 కోట్లు భారం, నికర ఎన్‌పీఏలపై రూ.687 కోట్ల మేర ప్రభావం పడే అవకాశం ఉందని భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ వెల్లడించింది. 

దీంతో ఈ ఏడాది మూడో త్రైమాసికానికి బ్యాంక్‌ రూ.4,654 కోట్ల మేర అదనంగా కేటాయింపులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడనుందని ఎస్బీఐ  వర్గాలు తెలిపాయి. మార్కెట్‌ నియంత్రణ సంస్థ ఇటీవల అమలులోకి తెచ్చిన కొత్త నిబంధనల మేరకు ఎన్‌పీఏల వెల్లడిలో ఏదైనా తేడాలు నమోదైతే వాటిని ఒక రోజులో ప్రకటించాల్సి ఉంది. ఈ మేరకు ఎస్బీఐ తమ సంస్థలో జరిగిన ఎన్‌పీఏ తప్పిదం గురించి వెంటనే ప్రకటించడం విశేషం.

also read  కార్వీ లైసెన్స్ పునరుద్ధణకు ఎన్ఎస్ఈ తిరస్కరణ...?

బ్యాంకింగ్‌ వ్యవస్థ భద్రమేనా..!
కేంద్రంలోని మోదీ సర్కార్ దేశంలోని బ్యాంకింగ్‌ వ్యవస్థను నిలబెట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించడంతోపాటు తాము అధికారంలోకి వచ్చిన తరువాత బ్యాంకుల్లో ఎన్‌పీలను తగ్గించి వాటిని ఆర్థికంగా నిలబెట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రకటనలు చేస్తోంది. అయినా ఈ రంగంలో ఆందోళకర రీతిలో మొండి బకాయిలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. 

దేశంలోనే అతిపెద్ద బ్యాంక్‌ ఎస్బీఐ గత ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిలను తక్కువ చేసి చూపడం చూస్తుంటే.. బ్యాంక్‌ కార్యకలాపాలపై ప్రభుత్వ నిఘా, నియంత్రణ ఎంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్బీఐ జోక్యం చేసుకొని విశ్లేషణ జరిపితే గానీ దాదాపు రూ.12000 కోట్ల మొండి బకాయిలు వెలుగులోకి రాని పరిస్థితి కనిపించడం శోచనీయమని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. 

ఇలాంటి ఘటనలతో దేశంలో బ్యాంకింగ్‌ రంగం భద్రంగానే ఉందా అనే సందేహాలు కలుగుతున్నట్లు సామాన్యులు తెలిపారు. ఎస్‌బీఐ చర్య వెనుక అధికారులపై సర్కారు ప్రభావం తప్పక ఉండి ఉంటుందని వారు అనుమానాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని పటిష్ట పాలన, నిఘా వ్యవస్థ కలిగిన ఎస్బీఐలోనే ఇలాంటి అంశాలు వెలుగులోకి వస్తుంటే.. మిగతా బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ఎంత గొప్పగా ఉందో అనే అనుమానాలు కూడా కలుగకమానదని విశ్లేషకులు చెబుతున్నారు.