రూ.2000 నోటును ఇక నుంచి ఎటీఎం మిషన్లలో పెట్టరాదని ప్రభుత్వ రంగ ఇండియన్‌ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. రెండువేల నోటును రద్దు చేస్తారంటూ కొంతకాలంగా ఊహాగానాలు వెలువడిన నేపథ్యంలో బ్యాంకు నిర్ణయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. 

ఏటీఎంలలో రూ.2000 నోటు నింపడం ఆపివేయాలని ఇండియన్‌ బ్యాంకు శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక తన ఏటీఎమ్‌లలో రెండు వేల నోటు కనిపించదని, దానికి బదులుగా రూ.200 నోటును అందుబాటులో ఉంచుతామని వెల్లడించింది.

వినియోగదారుల సౌకర్యార్థమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండియన్ బ్యాంక్ పేర్కొంది. దీంతో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఇండియన్‌ బ్యాంకు ఏటీఎంలలో రూ.2 వేల నోటు అదృశ్యం కానున్నది.

కాగా ఇప్పటికే వినియోగదారులు సైతం ఏటీఎంలలో తీసుకుంటున్న పెద్ద నోట్లను బ్యాంకుకు వెళ్లి మార్చుకుంటున్నారు. మరోవైపు మిగతా బ్యాంకులూ అదే బాటలో వెళతాయేమోనని కొందరు వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

నోట్ట రద్దు తరువాత చలామణిలోకి వచ్చిన రూ.2000 నోటుపై తాజాగా ఓ విషయం బయట పడింది. నకిలీ నోట్లను చెక్‌ పెట్టేందుకంటూ  రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి నరేంద్ర మోదీ సర్కార్‌  ఆ తరువాత అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఫీచర‍్లతో రూ.2వేల నోటును తీసుకొచ్చింది. 

Also Read రిటైల్ బిజినెస్‌లో రిలయన్స్‌ హవా.. ఫస్ట్ వాల్‌మార్ట్...

ప్రధాని నరేంద్ర మోదీ డీమోనిటైజేషన్ ప్రకటన తర్వాత  దేశవ్యాప్తంగా పట్టుబడిన నకిలీ నోట్లలో ఎక్కువ శాతం  రూ.2వేల నోట్లు ఉన్నాయని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) వెల్లడించింది.  మొత్తంలో 56 శాతం రూ. 2000 నకిలీ నోట్లు మార్కెట్లోకి ప్రవేశించాయి. గుజరాత్‌  ఫేక్‌ కరెన్సీ అడ్డాగా మారిందని డేటా ద్వారా తెలుస్తోది. 

సంఖ్యాపరంగా 2016–17లో 354.2 కోట్ల రూ. 2,000 నోట్ల ముద్రణ జరగ్గా ఆ మరుసటి ఏడాది గణనీయంగా తగ్గి 111.5 కోట్లకు పరిమితమైంది. 2018–19లో ఆర్బీఐ 4.66 కోట్ల నోట్లు ప్రింట్‌ చేసింది. 2018 మార్చి నాటికి 336.3 కోట్ల మేర రూ. 2,000 నోట్లు చలామణీలో ఉండగా 2019 నాటికి 329.1 కోట్లకు తగ్గాయి. 

పెద్ద నోట్లను దాచిపెట్టుకోవడాన్ని నిరోధించే ఉద్దేశంతోనే రూ. 2,000 నోట్ల ముద్రణను ఆర్‌బీఐ తగ్గిస్తుండవచ్చని నిపుణులు తెలిపారు. 2019 జనవరిలో ఆంధ్ర– తమిళనాడు సరిహద్దుల్లో రూ.60 కోట్ల విలువ చేసే రూ. 2,000 నోట్లు పట్టుబడటం ఈ అభిప్రాయాలకు ఊతమిస్తోంది. బ్యాంకింగ్‌ వ్యవస్థలో నకిలీ రూ. 2,000 కరెన్సీ నోట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. 2016–17లో 678 నకిలీ నోట్లు దొరకగా, 2017–18లో 17,929 నోట్లు బైటపడ్డాయి.