Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాల జోరు... చరిత్రలో ఇదే తొలిసారి

ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ మూడో త్రైమాసికంలో రికార్డు లాభాలు గడించింది. పెట్రో కెమికల్స్ నిరాశ పరిచినా రిటైల్, జియో దన్నుతో రెండో త్రైమాసికంలో సాధించిన లాభాల రికార్డును తానే మూడో త్రైమాసికంలో రిలయన్స్ అధిగమించింది.
 

Reliance Q3 results: Profit rises 13% to Rs 11,640 crore on good Jio & retail show
Author
Hyderabad, First Published Jan 18, 2020, 10:04 AM IST

ముంబై: దేశంలో అత్యంత విలువైన సంస్థగా కొనసాగుతున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లాభాల జోరు కొనసాగుతున్నది. మూడో త్రైమాసికంలో సంస్థ రూ.11,640 కోట్ల నికర లాభాన్ని ఆర్జించి రికార్డు సృష్టించింది. ఒక త్రైమాసికంలో ఇంతటి స్థాయి లాభాలను ఆర్జించడం రిలయన్స్ చరిత్రలో ఇదే తొలిసారి. 

పెట్రో కెమికల్‌ వ్యాపాలు నిరాశాపరిచినా, చమురు రిఫైనింగ్‌ వ్యాపారం తిరిగి కోలుకోవడం, కన్జ్యూమర్‌, రిటైల్‌, టెలికం రంగాలు కూడా దన్నుగా నిలిచాయి. చమురు నుంచి టెలికం వరకు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్ సేవలు అందిస్తున్నది. అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్యకాలంలో రిలయన్స్ రూ.11, 640 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో రూ.10,251 కోట్లుగా నమోదైంది. ఒక త్రైమాసికంలో ఇంతటి గరిష్ఠ స్థాయిలో లాభాలు గడించిన తొలి ప్రైవేట్‌ సంస్థగా రిలయన్స్ రికార్డు సృష్టించింది. 

also read నేను అప్పుడే ప్రోపోజ్ చేసి మంచి పని చేశాను....:ఆనంద్ మహీంద్ర

జూలై-సెప్టెంబర్‌లో సంస్థ నెలకొల్పిన రూ.11,262 కోట్ల నికర లాభం రికార్డును రిలయన్సే వెనక్కినెట్టింది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ ఇంధన విక్రయ సంస్థ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐవోసీ) రూ.14,512.81 కోట్ల లాభాన్ని గడించింది. ఇదే ఇప్పటి వరకు ఉన్న ప్రపంచ రికార్డు. 

లాభాల్లో రికార్డులు బద్దలు కొట్టిన రిలయన్స్ సంస్థకు ఆదాయంలో మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 1.4 శాతం తగ్గి రూ.1,68,858 కోట్లకు పడిపోయింది.డిసెంబర్‌ నెలతో ముగిసిన మూడు నెలల కాలానికి రిలయన్స్‌ రిటైల్‌ రూ.2,727 కోట్ల లాభాన్ని గడించింది. 2018-19లో ఇదే సమయంలో ఆర్జించిన రూ.1,680 కోట్లతో పోలిస్తే 62.32 శాతం అధికం.

గత త్రైమాసికంలో రిటైల్‌ విభాగం నుంచి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు రూ.45,327 కోట్ల ఆదాయం సమకూరింది. క్రితం ఏడాది వచ్చిన రూ.35,577 కోట్లతో పోలిస్తే 27.40 శాతం అధికం. సమీక్షకాలంలో కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌, ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌స్టైల్‌, గ్రాసరీ సెగ్మెంట్‌లు 35.7 శాతం వృద్ధిని కనబరిచాయి. 

Reliance Q3 results: Profit rises 13% to Rs 11,640 crore on good Jio & retail show

గత త్రైమాసికంలో రిలయన్స్ రిటైల్ 456 స్టోర్లను ప్రారంభించడంతో మొత్తం సంఖ్య 11,316కి చేరుకున్నాయి. వీటిలో రెండింట మూడోవంతు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనే ఏర్పాటు చేసింది.టెలికం రంగంలో రిలయన్స్ జియో లాభాల దూకుడు కొనసాగుతున్నది. అక్టోబర్‌-డిసెంబర్‌ మధ్యకాలానికి సంస్థ రూ.1,350 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదు చేసుకున్న రూ.831 కోట్లతో పోలిస్తే 62.5 శాతం అధికం. 

రిలయన్స్ జియో సంస్థ గత త్రైమాసికంలో కంపెనీ నిర్వహణ ఆదాయం 28.3 శాతం అధికమై రూ.13,968 కోట్లకు ఎగిసింది. డిసెంబర్‌ 31 నాటికి వినియోగదారులు 32.1 శాతం పెరిగి 37 కోట్లకు చేరుకున్నారు. సరాసరిగా ఒక్కో కస్టమర్‌ నుంచి రూ.128.3 చొప్పున ఆదాయం సమకూరినట్లు సంస్థ పేర్కొంది. 

గత మూడు నెలల్లో జియో వినియోగదారులు 1,208 కోట్ల జీబీల డాటాను వినియోగించారు. 2018-19తో పోలిస్తే 40 శాతం అధికం. అలాగే 82,640 కోట్ల నిమిషాల పాటు మాట్లాడారు.చమురు రిఫైనింగ్‌ వ్యాపారం 12% పెరిగి 5,657 కోట్లకు ఎగబాకింది. ప్రతి బ్యారెల్‌ చమురును శుద్ది చేయడం ద్వారా సంస్థ 9.2 డాలర్ల ఆదాయం సమకూరింది. క్రితం ఏడాదిలో ఇది 8.8 డాలర్లుగా ఉన్నది. అయితే రెండో త్రైమాసికంలో నమోదైన 9.4 డాలర్లతో పోలిస్తే తగ్గుముఖం పట్టింది.

రిలయన్స్ సంస్థకు వచ్చిన లాభంలో రిటైల్‌, టెలికం రంగాల వాటా 40 శాతంగా ఉన్నది. డిసెంబర్‌ 31 నాటికి రిలయన్స్ కంపెనీకి రూ.3,06,851 కోట్ల అప్పు ఉన్నది. గతేడాది మార్చి చివరి నాటికి రూ. 1,87, 505 కోట్లుగా ఉండగా, సెప్టెంబర్‌ నాటికి ఇది రూ.2,91,982 కోట్లకు పెరిగింది.

ఇదే సమయంలో సంస్థ వద్ద రూ.1,53,719 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. సెప్టెంబర్‌ త్రైమాసికం నాటికి అది రూ.1,34,746 కోట్లుగా ఉంది. సౌదీకి చెందిన ఆరామ్కోతో కుదుర్చుకున్న వాటా విక్రయ ఒప్పందం వచ్చే ఏడాది పూర్తికానున్నట్లు అంచనా.కంపెనీ షేరు ధర 2.79 శాతం లాభపడి రూ.1,580.65 వద్ద ముగిసింది. దీంతో సంస్థ మార్కెట్‌ విలువ మరో .27,243.11 కోట్లు పెరిగి రూ. 10,02,009.11 కోట్లకు చేరుకున్నది.

also read మైక్రోసాఫ్ట్ సి‌ఈ‌ఓ పై ఆనంద్ మహీంద్ర ప్రశంసలు...

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రిలయన్స్‌ డిజిటల్‌ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. వెయ్యి రూపాయలు చెల్లించి ఈ నెల 18నుంచి 23 లోగా ముందస్తు బుకింగ్‌ చేసుకున్నవారికి రూ.1,000 అదనంగా రాయితీ పొందవచ్చును. ఈ నెల 24 నుంచి 26 లోపు కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ రాయితీ లభించనున్నది.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మాట్లాడుతూ అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు నిరుత్సాహకరంగా ఉన్నా, ఇంధన రంగం దన్నుతో మూడో త్రైమాసికంలో ఆశాజనక ఆర్థిక ఫలితాలు నమోదు చేసుకున్నాయన్నారు.పెట్రో కెమికల్‌ బిజినెస్‌ నిరాశాపరిచినా రిటైల్‌, టెలికం, ఇతర రంగాలు భారీ వృద్ధిని నమోదు చేసుకోవడంతో రికార్డు స్థాయి లాభాలు ఆర్జించగలిగామని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ తెలిపారు. కన్జ్యూమర్‌ బిజినెస్‌ మరో మైలురాయికి చేరుకున్నదన్నారు. 

కస్టమర్లకు గొప్ప షాపింగ్‌ అనుభవాన్ని కల్పించడంతో అమ్మకాల్లో భారీ వృద్ధిని సాధించాం అని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ ముకేశ్‌ అంబానీ మాట్లాడుతూ చెప్పారు. తక్కువకే ధరకే వినియోగదారులకు డిజిటల్‌ సేవలు అందించడం జియోతోనే సాధ్యమైందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios