Asianet News TeluguAsianet News Telugu

ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ: కరోనాపై సమరం.. రంగంలోకి ఆర్బీఐ ‘వార్ రూమ్‌’!

కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) రంగంలోకి దిగింది. తక్షణం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు ఈ నెల 19వ తేదీ నుంచే వ్యాపార విపత్తు ప్రణాళిక (బీసీపీ)ని అమల్లోకి తెచ్చింది. 

RBI set up war-room in just one day amid coronavirus
Author
New Delhi, First Published Mar 23, 2020, 10:56 AM IST

ముంబై: కరోనా వైరస్‌ మహమ్మారి వల్ల దేశీయ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) రంగంలోకి దిగింది. తక్షణం యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవడంతోపాటు ఈ నెల 19వ తేదీ నుంచే వ్యాపార విపత్తు ప్రణాళిక (బీసీపీ)ని అమల్లోకి తెచ్చింది. 

ఇందులో భాగంగా ముంబైలోని ఒక రహస్య ప్రదేశంలో ప్రత్యేకంగా వార్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. కేవలం 24 గంటల వ్యవధిలో వార్‌ రూమ్‌ అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్బీఐ అధికారి ఒకరు తెలిపారు. 

ఈ వార్ రూమ్‌లో ఆర్బీకి చెందిన 90 మంది కీలక సిబ్బందితో పాటు ఇతరత్రా విభాగాలకు చెందిన 60 మంది ముఖ్యమైన ఉద్యోగులు, ఫెసిలిటీ స్టాఫ్‌ 70 మంది విధులు నిర్వర్తిస్తుంటారని పేర్కొన్నారు. ప్రత్యేకంగా డెట్‌ నిర్వహణ, రిజర్వుల నిర్వహణ, ద్రవ్యపరమైన కార్యకలాపాలను ఈ వార్‌ రూమ్‌ పర్యవేక్షిస్తుందని అధికారి తెలిపారు. 

బీసీపీ కింద నగదు బదిలీ లావాదేవీ సేవలైన రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్‌ (ఆర్టీజీఎస్‌), నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌), స్ట్రక్చర్డ్‌ ఫైనాన్షియల్‌ మెసేజింగ్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎఫ్‌ఎంఎస్‌) తదితర లావాదేవీలను ఈ వార్‌ రూమ్‌ నుంచే పర్యవేక్షిస్తారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలకు సంబంధించిన ఈ–కుబేర్, ఇంటర్‌బ్యాంక్‌ లావాదేవీల్లాంటివి కూడా వీటిలో ఉంటాయని వివరించారు.  

‘ఒక కేంద్రీయ బ్యాంకు ఇలాంటి బీసీపీని అమలు చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. చరిత్రలో కూడా ఇదే తొలిసారి. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఇలాంటివి ఏర్పాటు కాలేదు‘ అని ఆ ఆర్బీఐ అధికారి వివరించారు.

‘సాధారణంగా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ సమస్యలు, అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తులు మొదలైన వాటికి మాత్రమే బీసీపీ లాంటిది ఉంటుంది. కానీ కరోనా వైరస్‌ మహమ్మారితో యుద్ధంలో ఆర్బీఐ ప్రకటించిన బీసీపీ లాంటిది మరెక్కడా లేదు‘ అని చెప్పారు.

దేశవ్యాప్తంగా 31 ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయంలో 14వేల మంది పైగా సిబ్బంది ఉన్నారు. అత్యంత కీలక కార్యకలాపాలను 1,500 మంది దాకా సిబ్బంది నిర్వహిస్తుంటారు. ప్రధాన కార్యాలయంలో 2,000 దాకా సిబ్బంది ఉండగా, గత వారం రోజులుకాగా కేవలం 10% మందే విధులకు హాజరవుతున్నారు.  

150 మంది ఆర్‌బీఐ సిబ్బంది, 60 మంది సర్వీస్‌ ప్రొవైడర్లు, 70 శాతం మంది ఫెసిలిటీ స్టాఫ్‌ (మెయింటెనెన్స్, సెక్యూరిటీ, కిచెన్, ఫ్రంట్‌ డెస్క్, అడ్మినిస్ట్రేషన్‌ వంటి విభాగాల వారు)కి సరిపడే ఒక భవంతిని ఆర్బీఐ తీసుకుంది. ఈ సిబ్బంది అందరూ నిరంతరం ఆ భవంతిలోనే ఉంటారు. 

తీవ్ర విపత్తు పరిస్థితులైతే తప్ప బైటికి రావడానికి ఉండదు. వారికి అవసరమైన వాటిని అత్యంత పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ, సరఫరా చేసేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారు. రెండు బ్యాచ్‌ల కింద వార్‌ రూమ్‌ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు.  

కరోనా మహమ్మారి నేపథ్యంలో కరెన్సీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(ఐబీఏ) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నోట్లను లెక్కపెట్టాక, ముట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలంటూ సూచించింది. 

సాధ్యమైనంత వరకూ బ్యాంకు శాఖలకు వెళ్లకుండా ఆన్‌లైన్, మొబైల్‌ బ్యాంకింగ్‌ను వినియోగించాలని ఐబీఏ కోరింది. ఇందుకు ‘కరోనా సే డరో న, డిజిటల్‌ కరో నా‘ (కరోనాతో భయం వద్దు.. డిజిటల్‌ సర్వీసులు ఉపయోగించుకోండి) అనే ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది.

also read:మారటోరియం ప్లీజ్.. లేదంటే...!! కేంద్రానికి సీఐఐ, అసోచామ్ డిమాండ్లు

మరోవైపు ఉద్యోగుల భద్రత కోసం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (క్విక్ రెస్సాన్స్ టీం- క్యూఆర్టీ)ని ఏర్పాటు చేసింది. ఈ టీం కరోనా వైరస్ వ్యాప్తిని ఎలా అరికట్టాలో తమ ఉద్యోగులకు మార్గ నిర్దేశం చేస్తుందని ఎస్బీఐ వెల్లడించింది.

ఖాతాదారుల భద్రత కోసం అన్ని బ్యాంకు శాఖల్లోనూ శానిటైజర్ సబ్బులు, పెద్ద కార్యాలయాల్లో థర్మల్ స్కానర్లను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇక వైద్యులతో ఓ హెల్ప్ లైన్ నంబర్ కూడా ఏర్పాటు చేసింది. కరోనా వైరస్ వ్యాప్తిపై ఆందోళన చెందుతున్న సిబ్బంది మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వైద్యులు ప్రయత్నిస్తారని ఎస్బీఐ వెల్లడించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios