Asianet News TeluguAsianet News Telugu

రైల్వే టికెట్‌ బుకింగులపై సంచలన నిర్ణయం...రానున్న రోజుల్లో ఇక పూర్తిగా....

రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకున్నది. రోజువారీ టిక్కెట్లు విక్రయించే బుకింగ్ కౌంటర్లకు మంగళం పాడనున్నది. ఇకపై రైల్వే ప్రయాణికులంతా ఆన్ లైన్ లోనే టిక్కెట్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. త్వరలోనే రైల్వేశాఖ పరిధిలోని రైళ్లన్నింటికీ వర్తింపజేయాలని తలపోస్తున్నది.
 

Railway Ministry mull to close ticket booking counters.. tickets would be booking only online
Author
Hyderabad, First Published Feb 14, 2020, 12:22 PM IST

న్యూఢిల్లీ: సాధారణంగా రైలు ప్రయాణం చేయాలంటే.. సంబంధిత స్టేషన్‌కు వెళ్లి టికెట్‌ కొనుక్కుంటాం.. ఈ మధ్య టెక్నాలజీ పెరిగి పోయి ఐఆర్‌సీటీసీ ఆన్‌లైన్‌ బుకింగ్‌తో కొందరు రైలు టికెట్లు, రిజర్వేషన్లను ఖరారు చేసుకుంటున్నారు. అయితే రానున్న రోజుల్లో ఇక పూర్తిగా రైలు టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే విక్రయించాలని రైల్వే శాఖ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రయివేటు రైళ్ల నిర్వహణను పరిశీలించనున్నట్లు సమాచారం. 

ప్రయివేటు రైళ్ల టికెట్లను పూర్తిగా ఆన్‌లైన్‌లోనే విక్రయించనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో రైల్వేశాఖ ఈ దిశగా సమాయాత్తం అవుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రయివేటు రైళ్లను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు రైళ్లు ప్రారంభం అయ్యాయి. మరో మూడో ప్రైవేట్ రైలు ఆ దిశగా అడుగులేస్తున్నది. 

also read బ్రిటన్ ఆర్థిక మంత్రిగా ఇన్ఫోసిస్ మూర్తి అల్లుడు రిషి సునక్

ఈ మేరకు దేశవ్యాప్తంగా తొలి దశలో సుమారు వందమార్గాల్లో 150 ప్రయివేటు రైళ్లు నడుస్తాయి. ఈ రైళ్లు ఏడాదిలోపే అందుబాటులోకి  రానున్నాయి. దక్షిణ మధ్య  రైల్వే పరిధిలో 11 మార్గాల్లో 17 ప్రయివేటు రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. అయితే ఈ రైళ్లలో ప్రయాణించే వారికి టికెట్లు ఆన్‌లైన్‌లో విక్రయించనున్నారు. రైల్వే స్టేషన్లలో ప్రత్యేకంగా ప్రయివేటు రైళ్లకు టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేయడం లేదు.

కాగా, పూర్తిగా ఆన్ లైన్‌లోనే టిక్కెట్ల విక్రయ ఫార్ములాపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఆన్‌లైన్‌లో ప్రయివేటు రైళ్ల టికెట్‌ విక్రయాలు విజయవంతమైతే.. రైల్వేశాఖ పరిధిలోని అన్నీ రైళ్ల టికెట్‌లు, రిజర్వేషన్‌లన్నీ ఆన్‌లైన్‌లో అమ్మకాలు జరిపేందుకు ఆలోచన చేస్తున్నట్లు ఓ రైల్వే ఉన్నతాధికారి తెలిపారు. 

 

అందుకే ఇప్పటినుంచే ఆన్‌లైన్‌లో రైలు టికెట్‌ కొనుగోలు అలవాటు చేసుకోవాల్సిందేనని రైల్వే ఉన్నతాధికారులు చెబుతున్నారు. మున్ముందు రైల్వేస్టేషన్‌కు వెళ్లి టిక్కెట్‌ కొనుక్కుని రిజర్వేషన్‌ చేసుకోవడమనేది ఇక ఉండకపోవచ్చు. ఫలితంగా రైల్వేస్టేషన్‌లలో 24 గంటలు అందుబాటులో ఉండే బుకింగ్‌ కౌంటర్లు త్వరలోనే కనుమరుగవడం ఖాయమనే సంకేతాలు వినిపిస్తున్నాయి.

ప్రయివేటు రైళ్ల టికెట్‌ కొనుగోలు కూడా విమానం టికెట్‌ మాదిరిగా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రయివేటు రైళ్లలో బెర్త్‌ ఉంటేనే ఆన్‌లైన్‌లో టికెట్‌ లభిస్తుంది. సాధారణంగా ఐఆర్‌సీటీసీలోనైతే బెర్త్‌ లేకపోయినా ‘వెయిటింగ్‌’ లిస్ట్‌లో టికెట్‌ లభిస్తుంది. కానీ ప్రయివేటు రైలులో అలా కాదు. రైలులో బెర్త్‌ ఖాళీగా ఉంటేనే టికెట్‌ చూపిస్తుంది. 

also read చుక్కలు చూపిస్తున్నా నిత్యావసర ధరలు... 6ఏళ్ల గరిష్టానికి...

ప్రైవేట్ రైళ్లలో చివరి నిమిషంలో కనుక టిక్కెట్‌ రద్దు చేసుకుంటే కట్టిన సొమ్ము పెద్దఎత్తున నష్టపోయే ప్రమాదముంది. ఇదే కాక ఎన్ని రోజులు ముందస్తుగా టికెట్‌ బుక్‌ చేసుకుంటే అంత తక్కువ ధరకు టికెట్‌ దొరికే అవకాశం ఉంది. అంటే.. విమానం టికెట్‌ మాదిరి టికెట్‌ కొనుగోలు అన్నమాట. ప్రయాణం తేదీ దగ్గర పడుతున్నకొద్దీ.. అదే ప్రయాణానికి ఎక్కువ మెత్తంలో డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది.

కంప్యూటర్‌ పరిజ్జానం ఉన్నవారు ఇప్పటికే రైల్వే టికెట్‌ల కొనుగోలు, రిజర్వేషన్‌ల కేటాయింపులు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ద్వారా కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో అన్ని రైళ్లకు టికెట్లు ఆన్‌లైనో విక్రయిస్తున్న తరుణంలో టిక్కెట్‌లు ఆన్‌లైన్‌లోనే కొనుక్కోవడం అలవాటుపడితే రైల్వే ప్రయాణికులకు ప్రయాణం సులభతరం అవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios