Asianet News TeluguAsianet News Telugu

రెపోరేట్ తగ్గింపు.. ఈఎంఐ మారటోరియంతో బెనిఫిట్: మోదీ

ఒకవైపు వడ్డీరేట్ల తగ్గింపు, మరోవైపు రుణ వాయిదాల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పలువురు బ్యాంకర్లు స్వాగతించారు. సాహసోపేతమైన, ప్రయోజనకర నిర్ణయం అని శ్లాఘించారు. ఎవరేమన్నారో పరిశీలిద్దాం..
 

PM, FM, industry welcome RBI ''bazooka'' of interest rate cut, liquidity measures
Author
Hyderabad, First Published Mar 28, 2020, 10:04 AM IST

దేశ ఆర్థిక వ్యవస్థ, సామాన్యులపై కరోనా వైరస్‌ ప్రతికూల ప్రభావం పడకుండా ఆర్బీఐ తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలను పలువురు ప్రముఖులు స్వాగతించారు. మధ్య తరగతి, వ్యాపార వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 

సాహసోపేత నిర్ణయం: మోదీ
‘కరోనా వైరస్‌ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ఆర్బీఐ సాహసోపేత నిర్ణయాలు తీసుకుంది. దీంతో ద్రవ్య లభ్యత పెరుగుతుంది. రుణాలు చౌకగా లభిస్తాయి. ఇది మధ్యతరగతి, వ్యాపార వర్గాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని మోదీ ట్వీట్‌ చేశారు.

ఆర్బీఐ డిసిషన్ ఆహ్వానించదగిందే: నిర్మలా సీతారామన్
కీలక వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగ్గ నిర్ణయం అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఈ వడ్డీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు, ఖాతాదారులకు బ్యాంకులు సత్వరం వేగంగా బదిలి చేయాలని కోరారు.

ఆర్థికమూలాలపై ఆర్బీఐ గవర్నర్ ప్రకటనను స్వాగతిస్తున్నాం
భారత ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆర్థిక స్థిరత్వంపై ఆయన పునరుద్ఘాటన ప్రకటనను అభినందిస్తున్నట్లు చెప్పారు. నెల వారీ వాయిదాల (ఈఎంఐ)లపై, వర్కింగ్ క్యాపిటల్‌పై వడ్డీ చెల్లింపులకు మూడు నెలల పాటు మారటోరియం విధించడం ఇప్పుడు అత్యవసరమైన చర్య అని అభిప్రాయ పడ్డారు.

రెపోరేట్ తగ్గింపును స్వాగతించిన పీ చిదంబరం
రెపోరేటు తగ్గింపుతో పాటు ద్రవ్యలభ్యతను పెంచేలా ఆర్‌బీఐ తీసుకున్న చర్యల్ని మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు పీ. చిదంబరం స్వాగతించారు. అయితే ఈఎంఐల చెల్లింపు తేదీ పొడగింపునకు అనుమతిస్తూ బ్యాంకులకు ఆర్‌బీఐ మార్గదర్శకాలివ్వడమే సందిగ్ధంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈఎంఐ తేదీలు ఆటోమేటిగ్గా వాయిదా పడేలా చర్యలు తీసుకోవాలని చిదంబరం డిమాండ్‌ చేశారు.
    
ఆర్బీఐ పాలసీ నిర్ణయాలు నిర్ణయాత్మకమైనవని, సాహసోపేతమైనవని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ అభిప్రాయ పడ్డారు. కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న వేళ మానవత్వ కోణంలో దేశ ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నారు. 

మేలు చేసే నిర్ణయాలు తీసుకున్న ఆర్బీఐ
భారీగా వడ్డీరేట్ల తగ్గింపు, క్యాపిటల్ కన్జర్వేషన్ బఫర్ అడ్జస్ట్‌మెంట్, రుణ వాయిదాల చెల్లింపులపై మారటోరియం, కన్వెన్షనల్ సీఆర్ఆర్ కోత, బ్యాంకుల నుంచి క్యాపిటల్ మార్కెట్‌కు మద్దతు వంటి నిర్ణయాలు ఎంతో మేలు చేస్తాయని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ పేర్కొన్నారు. 

ఆర్థిక మార్కెట్ల స్థిరీకరణ, నిజమైన ఆర్థిక వ్యవస్తలో రుణ పరపతి అవసరాలను తీర్చేందుకు తక్షణం రుణాలపై వడ్డీరేట్ల తగ్గింపు అమలులోకి తేవాల్సిన అవసరం ఉందని ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ వెల్లడించారు. సవాళ్లతో కూడిన సమయంలో ఆర్థికవ్యవస్థ కోసం ఆర్బీఐ చాంపియన్ పాత్ర పోషించిందని వ్యాఖ్యానించారు. 

మారటోరియంతో సానుకూల నిర్ణయం: మూడీస్
బ్యాంకులు, బ్యాంకేతర ఆర్థిక సంస్థలు జారీ చేసిన రుణాల వాయిదా చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం రుణాల మంజూరుపై సానుకూల ప్రభావం చూపుతుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసు ప్రతినిధి అల్కా అంబరసు తెలిపారు. బ్యాంకుల అస్సెట్స్ క్వాలిటీ డౌన్ సైడ్ రిస్క్ పొంచి ఉందన్నారు. 

ఆర్థిక వ్యవస్థ అనిశ్చితి వేళ ఆర్బీఐ సానుకూల నిర్ణయం
ఆర్థిక వ్యవస్థ అనిశ్చితిని ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో ఆర్బీఐ సానుకూలంగా నిర్ణయాలు తీసుకున్నదని డన్ బ్రాడ్ స్ట్రీట్ చీఫ్ ఎకనమిస్ట్ అరుణ్ సింగ్ తెలిపారు. మార్కెట్లోని వివిధ వర్గాల్లో విశ్వాసం పునరుద్దరణకు, విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లకుండా నిలువరించేందుకు, రూపాయి విలువ పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్బీఐ సకాలంలో చర్యలు చేపట్టిందన్నారు. 

ఆర్బీఐ సానుకూల నిర్ణయం: కేపీఎంజీ
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకునేందుకు జోక్యం చేసుకుంటూ ఆర్బీఐ మంచి నిర్ణయం తీసుకున్నదని కేపీఎంజీ ప్రతినిధి గాయత్రి పార్థసారథి తెలిపారు. వర్కింగ్ క్యాపిటల్ సమస్య పరిష్కరించడానికి, లిక్విడిటీ వ్యయం తగ్గింపుతోపాటు రుణ వాయిదాల చెల్లింపుపై మారటోరియం విధించడాన్ని స్వాగతించారు. కేపీఎంజీ ప్రతినిధి సంజయ్ దోషి స్పందిస్తూ కార్పొరేట్లకు మెరుగైన రుణ మద్దతు లభించేలా ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. 

రుణాల కల్పనకు ఆర్బీఐ వెసులుబాటు: ముథూట్
దేశీయ ఆర్థిక వ్యవస్థలోకి నిధులను చొప్పించేందుకు, బ్యాంకులకు రుణాలు కల్పించేందుకు ఆర్బీఐ వెసులుబాటు కల్పించిందని ముథూట్ పప్పచన్ గ్రూప్ చైర్మన్ థామస్ జాన్ ముథూట్ చెప్పారు. ఇది నిజమైన రుణ గ్రహీతలకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. రేమండ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతం హరి సింఘానియా మాట్లాడుతూ ఆర్థిక మార్కెట్లకు సుస్థిరత్వం తేవడానికి ఆర్బీఐ నిర్ణయాత్మక, సమగ్ర ప్యాకేజీతో కూడిన నిర్ణయం తీసుకున్నదన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios