పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? ఈ 5 ఛార్జీల గురించి కచ్చితంగా తెలుసుకొని తీసుకోండి!
మీరు పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? చాలా మంది ఏజెంట్లు, బ్యాంకులు కొన్ని ఛార్జీలను దాచే ప్రయత్నం చేస్తాయి. అలాంటి వాటిపై మీరే అవగాహన పెంచుకొని వారిని ప్రశ్నించాలి. లేకపోతే మీ నుంచి ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. పర్సనల్ లోన్‌లో తరచుగా విధించే ముఖ్యమైన ఛార్జీలు, మీకు తెలియకుండా విధించే ఛార్జీల గురించి కూడా తెలుసుకుందాం.
పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు చాలా మంది ఏజెంట్లు, బ్యాంకులు కొన్ని ఛార్జీలను దాచే ప్రయత్నం చేస్తారు. ఇది లోన్ మొత్తం ఖర్చును పెంచుతుంది. పర్సనల్ లోన్‌లో తరచుగా విధించే ముఖ్య ఛార్జీలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రాసెసింగ్ ఫీజు: లోన్ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి ఈ ఫీజు వసూలు చేస్తారు. ఇది సాధారణంగా లోన్ మొత్తంలో 1% నుండి 3% వరకు ఉంటుంది.
ముందస్తు చెల్లింపు ఛార్జీ: మీరు లోన్‌ను గడువుకు ముందే పూర్తిగా చెల్లించాలని నిర్ణయించుకుంటే బ్యాంక్ ముందస్తు చెల్లింపు ఛార్జీని 2% నుండి 5% వరకు విధించవచ్చు.
లేట్ పేమెంట్ ఛార్జీ: EMI చెల్లింపును మిస్ అయితే పెనాల్టీ పడుతుంది. ఈ పెనాల్టీ లోన్ మొత్తంలో రూ.500 నుండి 2% వరకు ఉంటుంది.
ఇన్సూరెన్స్ ప్రీమియం: చాలా బ్యాంకులు లోన్‌తో పాటు ఇన్సూరెన్స్ పాలసీని కలిపి ఇస్తాయి. దీనికి కూడా మీరు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఛార్జీ సాధారణంగా లోన్ మొత్తంలో కలిపే ఉంటుంది.
స్టాంప్ డ్యూటీ, డాక్యుమెంట్ ఛార్జీలు: లోన్ అగ్రిమెంట్ కోసం స్టాంప్ డ్యూటీ, డాక్యుమెంట్ ఛార్జీలు లోన్ ప్రాసెసింగ్‌లో ఉండే అదనపు ఖర్చులు.
మీరు లోన్ తీసుకొనేటప్పుడు వీటిల్లో కొన్ని ఛార్జీల గురించి మీకు ఏజెంట్లు, బ్యాంకులు చెప్పకపోవచ్చు. మీరే అవగాహన పెంచుకొని అడిగితే వడ్డీ రేట్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది.
సీక్రెట్ ఛార్జీలను తప్పించుకోండి: మీ లోన్ అగ్రిమెంట్‌లోని చిన్న అక్షరాలను తప్పకుండా చదవండి. సాధారణంగా ప్రాసెసింగ్ ఫీజు, GST వంటి కొన్ని ఛార్జీల గురించి ముందుగా మీకు చెప్పరు.
లోన్ తీసుకొనే ముందు ఈ జాగ్రత్తలు పాటించండి: పర్సనల్ లోన్ ఎంత కావాలంటే అంత ఇస్తున్నారు కదా అని తీసేసుకోకండి. మీరు తిరిగి సులభంగా చెల్లించగల మొత్తాన్ని మాత్రమే తీసుకోండి. ఎక్కువ లోన్ తీసుకొంటే అప్పుల్లో కూరుకుపోతారు. వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల వడ్డీ రేట్లు, ఛార్జీలు, రూల్స్ ని పోల్చి చూడండి.
తెలియని ఛార్జీల నుంచి ఇలా తప్పించుకోండి:
లోన్ తీసుకునే ముందు, మీరు అన్ని ఛార్జీలు, నిబంధనల గురించి తెలుసుకోండి. లోన్ అగ్రిమెంట్‌ను జాగ్రత్తగా చదివి, అర్థం కాని వాటి గురించి బ్యాంక్‌ను అడగండి. పర్సనల్ లోన్‌ల వడ్డీ రేట్లు సాధారణంగా 10% నుండి 24% వరకు ఉంటాయి. ఈ రేట్లు మీ క్రెడిట్ స్కోర్, ఆదాయం, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి ఉంటాయి. బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను ప్రకటిస్తాయి. కానీ ఇవి వ్యక్తిగత కారణాలతో మారడానికి ఛాన్స్ ఉంటుంది.
క్రెడిట్ స్కోర్ ముఖ్యం: మీ CIBIL స్కోర్ 750 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీరు తక్కువ వడ్డీ రేటుతో లోన్ పొందే అవకాశం ఉంటుంది. తక్కువ స్కోర్ ఉంటే ఎక్కువ వడ్డీ రేట్లు వేస్తారు. ఒక్కోసారి మీ లోన్ అప్లికేషన్ ను రిజక్ట్ కూడా చేస్తారు.
లోన్ కాలవ్యవధి: పర్సనల్ లోన్ టెన్యూర్ 1 నుండి 5 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఎక్కువ కాలం పెట్టుకుంటే తక్కువ EMI అమౌంట్ పడుతుంది. కానీ మీరు ఎక్కువ మొత్తం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని మర్చిపోకండి.
సెక్యూరిటీ లేని లోన్లు: పర్సనల్ లోన్లు సెక్యూరిటీ లేనివి. అంటే మీరు పూచీకత్తు ఇవ్వనవసరం లేదు. అయితే ఇది బ్యాంకులకు ప్రమాదకరం. అందుకే వారు ఎక్కువ వడ్డీ రేట్లు వసూలు చేస్తారు.
అందువల్ల మీకు మీ స్తోమతకు సరైన లోన్ మాత్రమే తీసుకోండి. ఏవైనా డౌంట్స్ ఉంటే వెంటనే సిబ్బంది అని క్లియర్ చేసుకోండి. మొహమాట పడితే మీరే ఎక్కువ వడ్డీలు కట్టాల్సి ఉంటుంది.