దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు తమ విధులకు వెళ్లకుండా ఇళ్లకే పరిమితయ్యారు. ఫలితంగా వారి ఆదాయంపై అనిశ్చితి నెలకొన్నది. ఈ తరుణంలో కొంత మందికి ఇళ్లు గడవడమే కష్టంగా మారనుంది. 

ఈ పరిస్థితుల్లో బ్యాంక్‌ నుంచి తీసుకున్న రుణంపై నెలవారీ వాయిదాలు చెల్లించాల్సి ఉన్న వారి పరిస్థితి ఏంటి? ఒకవేళ డీఫాల్ట్‌ అయితే ఎలా? అని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి భయాలను దృష్టిలో ఉంచుకుని భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) చల్లని తీపి కబురు వినిపించింది. రుణాల నెలవారీ వాయిదాల చెల్లింపుల (ఈఎంఐ)పై మూడు నెలల మారటోరియానికి అనుమతివ్వాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. 

కారు, గృహ, వ్యక్తిగత రుణాలు, కార్పొరేట్‌ రుణాల నెలవారీ వాయిదాలకు ఆర్బీఐ ప్రకటించిన మారటోరియం వర్తిస్తుంది. మారటోరియం ప్రకటించిన కాలానికి రుణగ్రహీతలు ఈఎంఐ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇది ఈఎంఐల వాయిదా మాత్రమే. 

ఈఎంఐ రద్దు మాత్రం కాదు. వ్యాపార సంస్థలు తీసుకున్న వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలపై చెల్లించాల్సిన వడ్డీకి వెసులుబాటు లభిస్తుంది. ఈ కాలానికి పోగుపడే వడ్డీని మారటోరియం పూర్తయ్యాక కట్టాల్సి ఉంటుంది.  

ఈ నెల ఒకటో తేదీ నుంచి మే 31వ తేదీ మధ్య కాలానికి ఈఎంఐ బకాయిల చెల్లింపుల విషయమై చింతించాల్సిన అవసరం లేదు. క్రెడిట్‌ కార్డు బిల్లుల బకాయిలకు కూడా మారటోరియం వర్తిస్తుంది. కాకపోతే చెల్లింపుల నాటికి బిల్లు తడిసిమోపెడవుతుంది. 

క్రెడిట్‌ కార్డు బాకీలు, ఈఎంఐలకు కూడా మూడు నెలల మారటోరియం వర్తిస్తుందని ఆర్బీఐ స్పష్టతనిచ్చింది. ఆ మేరకు బాకీలను మూడు నెలల తర్వాత కట్టవచ్చు. అయితే, ఈ మొత్తం సమయానికి అసలుపై వడ్డీ భారం పడుతూనే ఉంటుంది. ఉదాహరణకు అసలు కట్టాల్సింది రూ. 10 వేలయితే, వాయిదాపడిన మొదటి నెలలో దీనిపై వడ్డీ లెక్కిస్తారు. దీనికి పన్నులు అదనం.

అలాగే, రెండో నెలలోనూ క్రెడిట్ కార్డు చెల్లింపు వాయిదా మొత్తం, వడ్డీ మీద కలిపి అదనంగా వడ్డీ, పన్నులు ఉంటాయి. మూడో నెలా ఇదే రిపీట్‌ అవుతుంది. ఇక నాలుగో నెలలో మాత్రం (మారటోరియం తర్వాత) అప్పటిదాకా పేరుకుపోయిన బాకాయి మొత్తాన్ని వడ్డీ, పన్నులతో సహా ఒకేసారి చెల్లించాల్సి రావడంతో తడిసి మోపెడవుతుంది.

వివిధ రకాల రుణగ్రహీతలందరికీ మారటోరియం ఇవ్వకపోవచ్చు. బ్యాంకులు ఈ మారటోరియం అమలులో విధి విధానాలను, అర్హత ప్రమాణాలను వెలువరించనున్నాయి. వడ్డీతోపాటు అసలు మొత్తానికి మారటోరియం వర్తిస్తుంది.

ఒక రకంగా ఇది రుణాల చెల్లింపు కాస్త వాయిదా పడటమే తప్ప తర్వాతైనా కచ్చితంగా కట్టాల్సిందే. ఆయా బ్యాంకుల నిబంధనలు బట్టి ఈఎంఐ కాలవ్యవధి పెరగవచ్చు లేదా మారటోరియం వ్యవధిలో కట్టాల్సి వడ్డీని మిగిలిన టర్మ్‌లో కొద్ది కొద్దిగా కట్టేలా సర్దుబాటు చేయొచ్చు. దీనిపై బ్యాంకులు స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.  

నెలవారీ వాయిదా చెల్లించకపోతే సంబంధిత వ్యక్తుల క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. మారటోరియం కాలంలో ఈఎంఐలు చెల్లించకపోతే క్రెడిట్‌ స్కోర్‌పై ప్రభావం ఉండకుండా చూడాలని క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థలను ఆర్బీఐ కోరింది. ఈ మారటోరియం సదుపాయాన్ని అవసరమైతే రుణగ్రహీత వినియోగించుకోవచ్చు లేదా ఈఎంఐ చెల్లించవచ్చు. 

మారటోరియం కాలంలో  చెల్లించాల్సిన మొత్తం వాయిదాలపై వడ్డీ.. అసలు మొత్తానికి జతయ్యే అవకాశం ఉంది. అప్పుడు మారటోరియం తర్వాత మూడు నెలల కాలానికి వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఈఎంఐ చెల్లించే సామర్థ్యం ఉంటే చెల్లించడమే మేలని విశ్లేషకులు సూచిస్తున్నారు. 

చాలా మంది తమ రుణ వాయిదాలను ఎలక్ర్టానిక్‌ క్లియరింగ్‌ సిస్టమ్‌ కింద ఆటో డెబిట్‌ను ఎంచుకుని ఉంటారు. ఇలాంటి సమయంలో ఆటోమేటిగ్గా వారి ఖాతా నుంచి సొమ్ము డెబిట్‌ అవుతుంది.

ఇలా కాకుండా ఉండాలంటే సంబంధిత రుణగ్రహీతలు బ్యాంకుకు సమాచారం అందించి మారటోరియం ప్రయోజనం కల్పించాలని కోరాల్సి ఉంటుంది. ఇక మారటోరియం విధానాన్ని అమలు చేయడానికి బ్యాంకులు తమ బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. 

అన్ని కాలపరిమితి రుణాలకు (వ్యవసాయ కాలపరిమితి రుణాలు, రిటైల్‌, పంట రుణాలు సహా) మారటోరియం కల్పించేందుకు అన్ని వాణిజ్య బ్యాంకులు (ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు, స్థానిక బ్యాంకులు), కో ఆపరేటివ్‌ బ్యాంకులు, ఆల్‌ ఇండియా ఫైనాన్షియల్‌ ఇనిస్టిట్యూషన్లు, ఎన్బీఎఫ్సీ (హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు, రుణ వితరణ సంస్థలు)లకు ఆర్‌బీఐ అనుమతిచ్చింది.