Asianet News TeluguAsianet News Telugu

కేంద్ర, రాష్ట్రాల మధ్య జీఎస్టీ ‘బకాయి’ల చిచ్చు.. మాట తప్పుతున్న మోదీ సర్కార్

కేంద్రం, రాష్ట్రాల మధ్య జీఎస్టీ బకాయిల చిచ్చు క్రమంగా పెరుగుతున్నది. నష్టపరిహారం అందక రాష్ట్ర ప్రభుత్వాలు అల్లాడిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో అంతరాలు పెరుగుతున్నాయి. ఆర్థిక మందగమనం వేళ పన్ను గొడవలు పెరుగుతున్నాయి. 
 

More measures to boost economy as and when required, says FM
Author
Hyderabad, First Published Dec 16, 2019, 11:16 AM IST

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ).. కేంద్ర, రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నది. దాదాపు రెండున్నరేండ్ల క్రితం ఇచ్చిన మాటను మోదీ సర్కారు తప్పుతుండటమే ఇందుకు కారణం. నష్టపరిహారం చెల్లిస్తామంటూ జీఎస్టీని అమల్లోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం.. వసూళ్లు క్షీణించాయంటూ ఇప్పుడు చేతులెత్తేస్తున్నది. 

‘ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మార్కెట్ నినాదం’తో  2017 జూలై ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా తెచ్చినదే ఈ జీఎస్టీ. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రాల్లో ఉన్న డజనుకుపైగా పన్నులను ఏకం చేసి పరిచయం చేసిన జీఎస్టీ పరిధిలో 500లకుపైగా సేవలు, 1,300లకుపైగా వస్తువులున్నాయి. 

5, 12, 18, 28 శాతాల్లో ఆయా వస్తు, సేవలపై పన్నులను విధించారు. బంగారంపై ప్రత్యేకంగా 3 శాతం పన్ను వేయగా, విలువైన ముడి రత్నాలు, రాళ్లపై కనిష్ఠంగా 0.25 శాతం పన్ను నిర్ణయించారు. ఇక పెట్రో ఉత్పత్తులను జీఎస్టీలో చేర్చని కేంద్రం.. విద్య, వైద్యం, తాజా కూరగాయలు తదితరాలకు ఈ పన్ను నుంచి మినహాయింపునిచ్చింది.

ఈ ఏడాది ఆగస్టు నుంచి రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారం అందలేదు. జీఎస్టీ అమల్లోకి తెస్తున్నప్పుడు రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లినా పరిహారం ఇస్తామన్న కేంద్రం.. తొలి ఐదేళ్లు ఈ సాయం చేస్తామని హామీ ఇచ్చింది. రాష్ర్టాల్లోని వివిధ పన్నులను జీఎస్టీలో కలిపేయడమే ఇందుకు కారణం. రెండు నెలలకోసారి ఈ నష్ట పరిహారం చెల్లిస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

also read పౌరసత్వ సవరణ చట్టం.. ‘టీ’ ఇండస్ట్రీ ఉక్కిరిబిక్కిరి 

ఈ క్రమంలో రెండున్నరేళ్లకే మొండి చెయ్యి చూపుతున్నది కేంద్రం. ఆగస్టు-సెప్టెంబర్ బకాయిలకుతోడు అక్టోబర్-నవంబర్ బకాయిలు పేరుకుపోయాయి. నిజానికి ఆగస్టు-సెప్టెంబర్ బకాయిలు అక్టోబర్‌లో, అక్టోబర్-నవంబర్ బకాయిలు డిసెంబర్‌లో చెల్లించాల్సి ఉన్నది. కానీ ఇంతవరకు ఆగస్టు-సెప్టెంబర్ బకాయిలే వసూలు కాలేదు. 

రాష్ట్రాలు తమ ఆదాయంలో దాదాపు సగం కేంద్రం నుంచే అందుకుంటున్నాయి. 47.5 శాతం ఆదాయం కేంద్రం నుంచే వస్తున్నది. ఇందులో జీఎస్టీ నష్టపరిహారం కూడా ఉండగా, అది పెద్ద మొత్తంలో ఉండటంతో ఆయా రాష్ట్రాలు ఇప్పుడు ఇబ్బందులకు గురవుతున్నాయి. వీటిలో బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలే ఉండటం గమనార్హం. 

ఇప్పటికే తమ బకాయిలు త్వరగా చెల్లించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఉన్నతాధికారులు కోరారు. జీఎస్టీ బకాయిల కోసం కేంద్రంపై రాష్ట్రాలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. 

More measures to boost economy as and when required, says FM

నష్టపరిహారం ఆలస్యం కావడంతో వెంటనే చెల్లించకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టుకు లాగుతామని కేరళ హెచ్చరించింది. పరిహారం అందక రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటున్నదని కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఇజాక్ తెలిపారు. కాంట్రాక్టర్ల బిల్లులు, వ్యవసాయ, సంక్షేమ పథకాల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ ఆదాయంలో దాదాపు 60 శాతం రాష్ర్టాలదేనని గుర్తుచేశారు. 

కేంద్రం నుంచి కేరళకు ఆగస్టు-సెప్టెంబర్‌ నెలల్లో రూ.1,600 కోట్లు రావాల్సి ఉన్నది. కేరళతోపాటు పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తమ బకాయిల కోసం కేంద్రంతో పోరాడుతున్నాయి. అయితే జీఎస్టీ వసూళ్లు పడిపోవడం వల్లే పరిహారం చెల్లించలేకపోతున్నామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతున్నది. 

also read అప్పులు ఇవ్వడానికి వెనుకాడుతున్న బ్యాంక్‌లు.. పరిశ్రమలకు కష్టాలు

ఈ ఏప్రిల్-జూలైలో రూ.45,750 కోట్ల నష్టపరిహారం ఇచ్చామని గుర్తుచేసింది. ఇదిలావుంటే 15వ ఆర్థిక సంఘం.. కేంద్రం-రాష్ర్టాల మధ్య ఆర్థిక సంబంధాలను నిర్వచిస్తూ కేంద్ర పన్నుల్లో రాష్ర్టాలకు అందేది తక్కువేనని పేర్కొంది. బకాయిల చెల్లింపు సమస్య ఇప్పుడు రాష్ట్రాల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నది. అయితే 2025 వరకు జీఎస్టీ నష్టపరిహారాన్ని రాష్ట్రాలకు కేంద్రం చెల్లించాల్సిందేనని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి.

18న జీఎస్టీ మండలి భేటీ
బుధవారం జీఎస్టీ మండలి సమావేశం జరుగనున్నది. జీఎస్టీ వసూళ్లు ఆశించిన స్థాయిలో లేక ఈసారి ఆయా వస్తు, సేవలపై పన్నులను పెంచే అవకాశాలున్నాయన్న అంచనాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాల నుంచి జీఎస్టీ నష్టపరిహారం బకాయిలు చెల్లించాలన్న ఒత్తిడి పెరుగుతుండటం కూడా పన్ను రేట్ల పెంపుపై మోదీ సర్కారు దృష్టిని నిలుపుతున్నది. 

జీడీపీ క్రమేణా పతనమవుతుండటంతో తగ్గిన ప్రభుత్వ ఆదాయాన్ని జీఎస్టీ రేట్ల పెంపుతో పెంచుకోవాలని కేంద్రం చూస్తున్నది. దీంతో గతంలో జీఎస్టీ నుంచి పన్ను మినహాయింపును పొందిన వాటిపై, ఇప్పటివరకు జీఎస్టీ పరిధిలోకి రాని ఉత్పత్తులపై పన్ను భారాన్ని వేయాలని జీఎస్టీ మండలి యోచిస్తున్నట్లు సమాచారం.

Follow Us:
Download App:
  • android
  • ios