Asianet News TeluguAsianet News Telugu

స్టాక్స్‌ను మెప్పించని నిర్మలమ్మ.. రూ.3.46 లక్షల కోట్లు ఆవిరి

స్టాక్‌ మార్కెట్లకు బడ్జెట్‌ మింగుడుపడకపోవడంతో నష్టాలు ఏరులైపారాయి. లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపదను ఆవిరైంది.

Investor wealth erodes by Rs 3.46 lakh crore as markets plummet after Budget announcement
Author
New Delhi, First Published Feb 2, 2020, 1:56 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బడ్జెట్‌ బాంబు పేలింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. మదుపరులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. దీంతో సూచీలు కుప్పకూలాయి. 

స్టాక్‌ మార్కెట్లకు బడ్జెట్‌ మింగుడుపడకపోవడంతో నష్టాలు ఏరులైపారాయి. లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపదను ఆవిరైంది. శనివారం ఒక్కనాడే బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్‌ విలువ రూ.3.46 లక్షల కోట్లు కరిగిపోయింది. బీఎస్‌ఈ ప్రధాన సూచీ 988 పాయింట్లు పతనం కావడంతో రూ.3,46,256.76 కోట్ల మదుపరుల సంపద చేజారిపోయింది. 

ప్రస్తుతం బీఎస్‌ఈ సంస్థల మార్కెట్‌ విలువ రూ.1,53,04,724.97 కోట్లుగా ఉన్నది. నిర్మలమ్మ పద్దులో వృద్ధిదాయక చర్యలు ఆశించిన స్థాయిలో లేక మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసిందని షేర్స్‌ అండ్‌ స్టాక్‌ బ్రోకర్స్‌ ప్రధాన ఆర్థికవేత్త ఆనంద్‌ రాఠీ అన్నారు. కాగా, డీడీటీ రద్దు, పన్ను కోతలు మార్కెట్లకు ఊతమిచ్చేవేనని, నెమ్మదిగా మదుపరులు అర్థం  చేసుకుంటారని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఎండీ మోతీలాల్‌ ఓస్వాల్‌ వ్యాఖ్యానించారు. బీఎస్‌ఈలో 1,724 షేర్లు నష్టపోగా, 611 షేర్లు లాభపడ్డాయి. 126 షేర్ల విలువ యథాతథంగా ఉన్నది.

కేంద్ర బడ్జెట్‌ రోజున స్టాక్‌ మార్కెట్లు ట్రేడ్‌ అవడం సంప్రదాయంగా వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారమైనా అటు బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ), ఇటు నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)లలో ట్రేడింగ్‌ జరిగింది. అయితే ఉదయం ఆరంభమే నష్టాలతో మొదలైన సూచీలు.. చివరిదాకా అదే దారిలో పయనించాయి. 

ఆర్థిక క్రమశిక్షణ, వృద్ధి దాయక చర్యలను ఆశించిన మదుపరులకు భంగపాటే ఎదురైంది. దీంతో సమయం గడుస్తున్నకొద్దీ నష్టాలు తీవ్రరూపం దాల్చాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 987.96 పాయింట్లు/ 2.43 శాతం దిగజారి 40 వేల మార్కుకు దిగువన 39,735.53 వద్ద ముగిసింది. గడిచిన దశాబ్దానికిపైగా కాలంలో ఒక్కరోజే సెన్సెక్స్‌ ఈ స్థాయిలో నష్టపోవడం ఇదే తొలిసారి. 

చివరిసారిగా 2008 అక్టోబర్‌ 24వ తేదీన 1,070.63 పాయింట్లు పడిపోయింది. మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే. అదీ బడ్జెట్‌ రోజే కావడం గమనార్హం. ఇక ఒకానొక దశలో సెన్సెక్స్‌ దాదాపు 1,275 పాయింట్లు నష్టపోవడం బడ్జెట్‌పట్ల మదుపరుల్లో ఉన్న అసంతృప్తికి అద్దం పడుతున్నది. నిఫ్టీ కూడా 300.25 పాయింట్లు లేదా 2.51 శాతం కోల్పోయి 11,661.85 వద్ద నిలిచింది. 


నిజానికి నిరుడు బడ్జెట్‌ రోజున మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. 2019 జూలైలోసెన్సెక్స్‌ 222.14 పాయింట్లు, నిఫ్టీ 149.30 పాయింట్లు పుంజుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2019-20)గాను జీడీపీలో ద్రవ్యలోటు కట్టడి లక్ష్యాన్ని 3.3 శాతం నుంచి 3.8 శాతానికి పెంచడంతో మార్కెట్‌ పతనం మొదలైంది. 

ఆ తర్వాత నిర్మలా సీతారామన్‌ ప్రకటనలన్నీ మార్కెట్‌ అంచనాలను అందుకోవడంలో విఫలం కావడంతో క్రమేణా మదుపరులు విపరీతమైన అమ్మకాల ఒత్తిడిలోకి జారుకున్నారు. ఆదాయం పన్ను (ఐటీ) కోతలు కొంత అయోమయానికి గురిచేసినా.. డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ (డీడీటీ) ఎత్తివేత నిర్ణయం సైతం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపరుచలేకపోయింది. 

కార్పొరేట్‌ బాండ్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులకున్న (ఎఫ్‌పీఐ) పెట్టుబడుల పరిమితిని 9 శాతం నుంచి 15 శాతానికి పెంచుతామన్న నిర్ణయం కూడా మదుపరులను ఆకట్టుకోలేకపోయింది. కాగా, రియల్టీ, క్యాపిటల్‌ గూడ్స్‌, ఇండస్ట్రియల్స్‌, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌, మెటల్‌ రంగాల షేర్లు 7.82 శాతం మేర నష్టపోగా, ఐటీ, టెక్నాలజీ రంగాల షేర్లు 1.41 శాతం మేర లాభపడ్డాయి. 

పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకం పెంపుతో సిగరెట్‌ తయారీ సంస్థల షేర్లు భారీ నష్టాలకు లోనయ్యాయి. ఐటీసీ షేర్‌ విలువ అత్యధికంగా పడిపోయింది. బీఎస్‌ఈలో 6.97 శాతం పతనమై రూ.218.85 వద్ద ముగిసింది. ఒకానొక దశలో 8.31 శాతం క్షీణించి 52 వారాల కనిష్ఠాన్ని తాకుతూ రూ.215.70 స్థాయిని చేరింది. గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా 6.82 శాతం, వీఎస్టీ ఇండస్ట్రీస్‌ 5.40 శాతం, గోల్డెన్‌ టొబాకో 0.18 శాతం చొప్పున నష్టపోయాయి. 

ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీ ఐ, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 5.98 శాతం మేర నష్టపోయాయి. అయితే ఐడీబీఐ బ్యాంక్‌ షేర్‌ విలువ 10 శాతానికిపైగా పెరిగింది. బ్యాంక్‌లోని మిగతా వాటానూ ప్రభుత్వం అమ్మనుందన్న బడ్జెట్‌ ప్రకటన మదుపరులను మెప్పించింది. 
దీంతో బీఎస్‌ఈలో 10.03 శాతం పుంజుకుని రూ.37.30 వద్ద ము గిస్తే.. ఎన్‌ఎస్‌ఈలో 10.20 శాతం ఎగబాకి రూ.37.25 వద్ద నిలిచింది. టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌ షేర్లూ లాభపడ్డాయి.

ఐటీ శ్లాబుల్లో మార్పులు, కొత్త ఐటీ విధానంతో బీమా షేర్లు ప్రభావితమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బీమా సంస్థల షేర్లు గరిష్ఠంగా 13 శాతం నష్టాలు చవిచూశాయి. బీఎస్‌ఈలో మ్యాక్స్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ 12.78 శాతం, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ 10.93 శాతం, ఎస్బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 10.02 శాతం, న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ 7.16 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ 6.06 శాతం చొప్పున నష్టపోయాయి. 

కొత్త ఐటీ శ్లాబులు, రేట్లను పన్ను చెల్లింపుదారులు ఎంచుకుంటే రూ.50 వేల స్టాండర్డ్‌ డిడక్షన్‌, పిల్లల ట్యూషన్‌ ఫీజులు, బీమా ప్రీమియం, ప్రావిడెంట్‌ ఫండ్‌లపై పన్ను మినహాయింపులను కోల్పోవాల్సి వస్తున్నది. దీంతో ఈ నిర్ణయం మదుపరులను నిరాశపరుచగా, బీమా షేర్లను దెబ్బతీసింది.

ప్రభుత్వరంగ టెలికం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌లలోకి రూ.37,640 కోట్ల నిధులను కేటాయించనున్నట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులను 4జీ స్పెక్ట్రం, స్వచ్ఛంద పదవీ విరమణ పథకం అమలు చేయడంలో భాగంగా ఈ నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపింది. వీటిలో 4జీ స్పెక్ట్రం కోసం బీఎస్‌ఎన్‌ఎల్‌కు రూ.14,115 కోట్లు కేటాయించనుండగా,ఎంటీఎన్‌ఎల్‌కు రూ.6,295 కోట్ల నిధులను వెచ్చించనున్నది.
 

Follow Us:
Download App:
  • android
  • ios