Asianet News TeluguAsianet News Telugu

ఆ రంగం ప్రమాదంలో ఉంది.. ఇన్వెస్టర్స్‌కు రఘురామ్‌ రాజన్‌ హెచ్చరిక

దేశీయ రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, మౌలిక పరిశ్రమలు ప్రమాదంలో ఉన్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండస్ట్రీస్‌.. టైమ్‌ బాంబ్‌ను తలపిస్తున్నాయన్నారు.

India s real estate sector is in deep trouble: Raghuram Rajan
Author
Hyderabad, First Published Dec 8, 2019, 6:00 PM IST

న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, మౌలిక పరిశ్రమలు ప్రమాదంలో ఉన్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ హెచ్చరించారు. రియల్‌ ఎస్టేట్‌, కన్‌స్ట్రక్షన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండస్ట్రీస్‌.. టైమ్‌ బాంబ్‌ను తలపిస్తున్నాయన్నారు. ఏ క్షణంలోనైనా ఈ రంగాల్లో నెలకొన్న సమస్యల బాంబు పేలిపోవచ్చని వ్యాఖ్యానించారు. 

కాబట్టి ఈ రంగాల సంస్థలకు రుణాలిచ్చిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)లు అప్రమత్తంగా ఉండాలని, తమ రుణాల పరిస్థితిని సమీక్షించుకోవాలని రఘురామ్ రాజన్ సూచించారు. ఎన్‌బీఎఫ్‌సీల ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ కూడా సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 

భారత ఆర్థిక వ్యవస్థ, వివిధ రంగాల పరిస్థితులపై రాజన్‌.. ఇండియా టుడే మ్యాగజైన్‌తో తన అభిప్రాయాలను పంచుకున్నారు. అయితే ఎన్‌బీఎఫ్‌సీల్లో టాప్‌ 50 సంస్థలను దగ్గరగా పరిశీలిస్తున్నామని ఇటీవల ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు. ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో వీటి వాటానే 75 శాతంగా ఉన్నది. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర మందగమనం నెలకొన్నదన్న ఆయన దిగాలుపడిన వృద్ధిరేటుతో నిరుద్యోగం కూడా పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 

చేతక్ టూ పల్సర్‌.. దటీజ్ రాహుల్ బజాజ్‌

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)లో దేశ జీడీపీ గణాంకాలు ఆరేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 4.5 శాతానికే పరిమితమైన విషయం తెలిసిందే. మొండి బకాయి (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏ)ల సమస్యతో సతమతమవుతున్న బ్యాంకింగ్‌ రంగం.. రుణాల విషయంలో ఆచితూచి స్పందిస్తుండటంతో రుణ లభ్యత పడిపోయిన సంగతి విదితమే. 

దీంతో వినియోగ సామర్థ్యం దారుణంగా దిగజారి వృద్ధిరేటు నానాటికీ క్షీణిస్తున్నది. దేశీయ నిర్మాణ రంగం.. అప్పుల కుప్పగా మారుతున్నది. ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు లేకపోవడంతో ఓవైపు పూర్తయిన ప్రాజెక్టులు.. మరోవైపు ఆగిపోయిన ప్రాజెక్టులతో రియల్‌ ఎస్టేట్‌ కళావిహీనంగా తయారైంది.

దాదాపు 66 బిలియన్‌ డాలర్ల (రూ.4,70,580 కోట్లు) విలువైన రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులు ఇప్పుడు దివాలా ప్రక్రియను ఎదుర్కొంటుండటం రియల్టీ దుస్థితికి అద్దం పడుతున్నది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నాటికి ఇన్సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్ర్ప్టీ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా వద్దకు నిర్మాణ రంగానికి చెందిన 115 కేసులు దివాలా పరిష్కారం నిమిత్తం వచ్చాయి. 

దివాళా బోర్డు వద్ద 28 కేసులు ముగియగా, 87 కేసుల్లో దివాలా ప్రక్రియ కొనసాగుతున్నది. ఇక సుమారు 4.54 లక్షల గృహాల నిర్మాణం వివిధ కారణాలతో నత్తనడకగా నడుస్తున్నట్లు ప్రముఖ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ తెలియజేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios