Asianet News TeluguAsianet News Telugu

ముకేశ్‌ అంబానీకి ఊరట... కార్పొరేట్ సంస్థల.. విభజన రెండేళ్లు వాయిదా...

భారతీయ కార్పొరేట్ సంస్థల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, సీఈఓ పదవుల విభజన గడువును సెబీ 2022 వరకు పెంచింది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితుల్లో రెండేళ్ల పాటు చైర్మన్, ఎండీ పదవుల విభజన నిర్ణయం అమలును వాయిదా వేయాలని సీఐఐ, ఫిక్కీ తదితర సంస్థల అభ్యర్థన మేరకు సెబీ అంగీకరించింది.

India Inc breathes easy, gets two years to split CMD position
Author
Hyderabad, First Published Jan 14, 2020, 11:50 AM IST

న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి కాసింత ఊరట లభించింది. ఆయనకే కాదు భారతీయ కార్పొరేట్ రంగానికి కూడా.. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓలు వేర్వేరుగా ఉండాలన్నదని సెబీ నిబంధన. 

కానీ కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిన డిమాండ్లకు మార్కెట్ నియంత్రణ మండలి సెబీ తలొగ్గింది. స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీలు సంస్థలు కచ్ఛితంగా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ల పదవులను విడగొట్టాలనే గడువును ఏప్రిల్ 2022 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.

also read ఉల్లి ‘ఘాటు’తో కంటనీరు...ధరల ప్రభావంతో తొలిసారి.... 

ప్రస్తుతం దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమన పరిస్థితుల నేపథ్యంలో సంస్థలపై పడుతున్న భారం దృష్ట్యా ఈ గడువును పెంచాలని కార్పొరేట్ల విజ్ఞప్తులు చేసిన నేపథ్యంలో సెబీ ఈ నిర్ణయం తీసుకున్నది. సెబీ నూతన మార్గదర్శకాల ప్రకారం టాప్-500 లిస్టెడ్ కార్పొరేట్ సంస్థలు కచ్ఛితంగా చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ) లేదా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈవో)లను ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి విడగొట్టాలని గతంలో ఆదేశించింది.

స్టాక్ మార్కెట్లో లిస్టెడ్ కంపెనీల్లో కార్పొరేట్ పరిపాలన పనితీరును మెరుగుపరుచాలనే ఉద్దేశంతో ఈ రెండు కీలక పోస్ట్‌లను విడగొట్టాలని సెబీ భావించింది. ఈ నూతన మార్గదర్శకాలు వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని చూసినా సంస్థల నుంచి వచ్చిన సూచనల మేరకు దీనిని 2022 ఏప్రిల్ ఒకటో తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఈ నెల 10న విడుదల చేసిన గెజిటెడ్ నోటిఫికేషన్‌లో పేర్కొంది.

India Inc breathes easy, gets two years to split CMD position

ఈ నోటిసును ఎప్పుడు విడుదల చేసిందో మాత్రం వెల్లడించకున్నా, ఈ మార్గదర్శకాల అమలును మాత్రం రెండేళ్ల పాటు వాయిదావేస్తున్నట్లు సెబీ వర్గాలు వెల్లడించాయి. పారిశ్రామిక సంఘాలైన ఫిక్కీ, సీఐఐలతోపాటు ఇతర కార్పొరేట్ సంస్థల ఈ గడువును పెంచాలని సెబీని కోరిన విషయం తెలిసిందే.

గడువు సమీపిస్తున్నాకార్పొరేట్ సంస్థలు మాత్రం సీఎండీ పదవులను వేరు చేయ లేదు. ఇప్పటి వరకు కేవలం 50 శాతం సంస్థలు మాత్రమే ఈ రెండు పదవులను విడగొట్టాయి. మరికొన్ని సంస్థలైతే రెండు పదవులను విలీనం చేశాయి కూడా.

India Inc breathes easy, gets two years to split CMD position

సంస్థల్లో కార్పొరేట్ పాలన మెరుగుదలకు సెబీ నియమించిన కొటక్ కమిటీ ఈ సూచనలు చేసింది. దేశంలో అతిపెద్ద సంస్థలైన రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీసీఎల్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, విప్రో, హీరో మోటోకార్ప్‌లలో ఒకే వ్యక్తి రెండు పోస్టులైన సీఎండీ పదవి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రెండేళ్ల పాటు పొడిగిస్తూ సెబీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఇండస్ట్రీ వర్గాలు స్వాగతించాయి. సీఎండీల పదవుల విభజన గడువు మరో రెండేళ్లు పొడగించడం శుభ పరిణామం అని, కుటుంబ సభ్యుల వ్యాపారాలు మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ నిర్ణయం దోహదం చేయనున్నదని ఫిక్కీ ప్రెసిడెంట్ సంగీతా రెడ్డి తెలిపారు. 

also read సేల్స్ ఎఫెక్ట్ : వాహనాల అమ్మకాలపై జీఎస్టీని తగ్గించండి...

సెబీకి పలుసార్లు విజ్ఞప్తి చేయడం వల్లనే ఈ కాలపరిమితిని పెంచినట్లు ఫిక్కీ అధ్యక్షురాలు సంగీతా రెడ్డి చెప్పారు. అలాగే అనేక కుటుంబ సభ్యుల నడుపుతున్న సంస్థలకు ఈ నిర్ణయం కాస్త ఊరటనిచ్చినట్లు అయిందన్నారు. వీటితోపాటు ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్న సంస్థలకూ కూడా వర్తించనున్నదని సంగీతా రెడ్డి వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు కీలక వ్యక్తులతో కంపెనీలను నడుపడం చాలా కష్టమని, కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు.

నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) డేటా ప్రకారం లిస్టెడ్ టాప్ 500 కంపెనీల్లో 162 కంపెనీలకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓగా ఒక్కరే ఉన్నారు. 52 కంపెనీలకు చైర్ పర్సన్, సీఈఓలు వేర్వేరుగా ఉన్నారు. చైర్మన్, ఎండీ పదవులను వేర్వేరు చేయాలని 2018 జూన్ నెలలో సెబీ ఖరారు చేసినా కార్పొరేట్ సంస్థలు మాత్రం చివరి వరకు ఈ నిబంధన అమలు దిశగా అడుగులేయనే లేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios