న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య పరిమిత వాణిజ్య ఒప్పందానికి దారులు మూసుకుపోయాయని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అయితే సమగ్ర వాణిజ్య ఒప్పందంతో ముందుకు వస్తామన్నారు. 'యూఎస్​-ఇండియా ఫోరం: పార్ట్​నర్స్ ఫర్ గ్రోత్​' సమావేశంలో పాల్గొన్న ఆయన ఇరుదేశాల వాణిజ్య ఒప్పందాన్ని మరో స్థాయికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు.

Also read:ఈ దశాబ్ది రిలయన్స్-మైక్రోసాఫ్ట్‌దే: ముకేశ్ అంబానీ

నూతన వాణిజ్య ఒప్పందం వల్ల ఇరుదేశాలకు లాభం చేకూరుతుందని కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. అమెరికా అధునాతన​ టెక్నాలజీ వల్ల భారత్​కు​, ప్రతిభకు వనరుగా ఉన్న తమ​ వల్ల అమెరికాకు లాభం చేకూరుతుందన్నారు.

2022 నాటికి ప్రతి కుటుంబానికి 24 గంటల విద్యుత్​, వంట గ్యాస్​, అంతర్జాల సౌకర్యం, మంచి విద్య, వైద్యం అందుబాటులో ఉంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అలాగే భారత దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి మోదీ ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

ఇరుదేశాలు తమతమ మార్కెట్లను ఒకరికోసం మరొకరు తెరిచే అవకాశం కోసం చర్చలు సాగుతున్నట్లు కేంద్ర పారిశ్రామిక విధానం, అభివృద్ధిశాఖ కార్యదర్శి గురుప్రసాద్ మోహపాత్ర తెలిపారు. ప్రతిపాదిత భారత్​-యూఎస్ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య ఈ విషయంలో కచ్చితంగా మంచి అవగాహన ఏర్పడుతుందని భావిస్తున్నట్లు కేంద్ర పారిశ్రామిక విధానం, అభివృద్ధిశాఖ కార్యదర్శి గురుప్రసాద్ మోహపాత్ర అభిప్రాయపడ్డారు.

ప్రపంచంలోని ప్రతీ బాధ్యతాయుతమైన దేశం... తమ దేశానికి, పౌరుల అవసరాలకు అనుగుణంగా తన సొంత డేటా స్టోరేజిని కలిగి ఉండాలని కోరుకుంటుందని కేంద్ర పారిశ్రామిక విధానం, అభివృద్ధిశాఖ కార్యదర్శి గురుప్రసాద్ మోహపాత్ర చెప్పారు. ముసాయిదా ఈ-కామర్స్ విధానం నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇందుకోసం ఓ ఎఫ్​డీఐ పాలసీని కూడా రూపొందించాలని భావిస్తున్నట్లు కేంద్ర పారిశ్రామిక విధానం, అభివృద్ధిశాఖ కార్యదర్శి గురుప్రసాద్ మోహపాత్ర తెలిపారు. దీని వల్ల వాణిజ్యపరంగా ఉపయోగించే డేటాపై పరపతి పొందవచ్చని, అదే సమయంలో జాతీయ భద్రతకు కూడా తోడ్పడుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు.

అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన అద్భుతంగా సాగినా ఓ లోటు స్పష్టంగా కనిపించింది. అదే రెండు దేశాల మధ్య సమగ్ర అవగాహనా ఒప్పందం కుదరకపోవడమే. మున్ముందు భారీ వాణిజ్య ఒప్పందం కుదురుతుందని ప్రకటించడం మినహా పురోగతి లేదు. దీనికి రెండు దేశాల మధ్య తీవ్ర విభేదాలే కారణమని తెలుస్తోంది. 

ఇరు దేశాల మధ్య 1700 కోట్ల డాలర్ల వాణిజ్య లోటు కొనసాగడం వాణిజ్య ఒప్పందానికి ప్రధాన అవరోధంగా నిలిచింది. వ్యవసాయ, వాణిజ్య ఉత్పత్తులపై ఇరు దేశాలు సుంకాలు విధిస్తున్నాయి. ప్రత్యేకించి మేధోపరమైన హక్కులు, పాడి ఉత్పత్తలు, చికెన్ లెగ్స్, హార్లీ డేవిడ్‌సన్ బైక్‌ల కొనుగోలు విషయంలోనూ విభేదాలు ఉన్నాయి. 

భారత బ్యాంకింగ్, బీమా రంగాల్లో పరిమితంగా ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల శాతాన్ని పెంచినా బీమా రంగంలో 49 శాతం, బ్యాంకింగ్ రంగంలో 74 శాతం విదేశీ పెట్టుబడులకే అనుమతినిస్తున్నారు. మల్టీ బ్రాండ్ ఉత్పత్తులపై రిటైల్ రంగంలో ఎఫ్డీఐలను అనుమతించినా విభేదాలు ఉన్నాయి. ఇది అమెరికాకు నచ్చడం లేదు.

డొనాల్డ్ ట్రంప్ సర్కార్ అమలు చేస్తున్న కఠిన వీసా నిబంధనలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రత్యేకించి హెచ్1 బీ వీసాల పట్ల అమెరికా నిబంధనపై ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య రాజకీయ అనివార్యతలు ప్రధాన అడ్డంకిగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

ఒప్పందం చేసుకుంటే నవంబర్ నెలలో జరిగే ఎన్నికల్లో ఓడిపోతానని ట్రంప్ భావిస్తుండటమే దీనికి కారణం. అమెరికాకు అవాంఛనీయ వాణిజ్య ప్రయోజనాలు కల్పించవద్దంటూ ప్రధాని మోదీపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయి.