న్యూఢిల్లీ: హిందువులు పసిడి కొనుగోలుకు ధన త్రయోదశిని మంచి రోజుగా భావిస్తారు. ఈ రోజు పుత్తడి కొనుగోలు చేస్తే బాగా కలిసి వస్తుందని వారి నమ్మకం. ప్రతి ధనత్రయోదశికి ఎంతో కొంత బంగారం కొనడం చాలా మందికి సంప్రదాయమైంది. 

అయితే, ఈ ఏడాది ధర కొండెక్కడంతో కొనాలా? వద్దా? అన్న మీమాంసలో వారు ఉన్నారు. మరిప్పుడు బంగారం కొనవచ్చా? భవిష్యత్‌లో ధరలు తగ్గుతాయా? పెరుగుతాయా? ఒకవేళ కొనుగోలు చేస్తే ఏ రూపంలో కొనుగోలు చేయాలో తెలుసుకుందాం.. 

ఈ నెల 25వ తేదీన ధన త్రయోదశి (ధన్‌తేరస్)తో దీపావళి సంబరాలు మొదలవుతాయి. ధన్‌తేరస్‌ అనగానే మనకు గుర్తొచ్చేది బంగారం. ఆభరణాల రూపంలో ఆకర్షించడంతోపాటు పెట్టుబడిగా పనికొస్తుంది.  సాధారణంగా ధరించడానికైతే నగలు.. పెట్టుబడికి నాణాలు, బిస్కెట్‌ రూపంలో కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం పసిడి కొనుగోలుకు వీటితోపాటు పలు ప్రత్యామ్నాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
 
బంగారు నాణాలు, బార్లు, ఆభరణాలను ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. ఉదాహరణకు, ఈ-కామర్స్‌ పోర్టళ్లు, పేటీఎం వంటి మొబైల్‌ వ్యాలెట్లు కూడా తమ వేదిక ద్వారా బంగారం కొనుగోలుకు అవకాశం కల్పిస్తున్నాయి. మోతీలాల్‌ ఓస్వాల్‌ సైతం ‘మీ-గోల్డ్‌’ ప్లాట్‌ఫామ్‌ ద్వారా పసిడిలో పెట్టుబడి అవకాశం కల్పిస్తోంది.
 
బంగారంలో పెట్టుబడులు పెట్టేవారి కోసం కేంద్రం పసిడి బాండ్లను జారీ చేస్తున్నది. లోహ రూపంలో బంగారం కొనుగోళ్లను నిరుత్సాహ పరిచేందుకు 2015 నవంబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా బాండ్లను యూనిట్ల రూపంలో జారీ చేస్తారు. కనీసం ఒక గ్రామ్ (యూనిట్‌) కొనుగోలు చేయాలి. 

ఒక వ్యక్తి ఏదేని ఆర్థిక సంవత్సరంలో ఈ పథకం ద్వారా గరిష్ఠంగా 500 గ్రాముల బంగారం కొనుగోలు చేయవచ్చు. ఈ పరిమితిని హిందూ అవిభాజ్య కుటుంబానికి (హెచ్‌యూఎఫ్‌) 4 కిలోలు, ట్రస్టులు, అదే తరహా ఇతర సంస్థలకు 20 కిలోలుగా నిర్ణయించారు.
 
ఇక స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్)లోనూ పెట్టుబడులు పెట్టొచ్చు. గోల్డ్‌ ఈటీఎఫ్‌ యూనిట్లను ఎప్పుడంటే అప్పుడు కొనేందుకు, అమ్మేందుకు వీలుగా ఉంటుంది. పైగా ఆభరణాల కంటే చౌకగా లభిస్తాయి. ఆభరణాల విషయంలో తయారీ చార్జీలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. లోహం కొనుగోలుతో పోలిస్తే ఈటీఎఫ్‌ లావాదేవీల్లో పారదర్శకత ఎక్కువ. నాణ్యత సమస్య కూడా ఉండదు.
 
సాధారణంగా ఆభరణ విక్రయ సంస్థలు ఈ పథకాలను ఆఫర్‌ చేస్తుంటాయి. ఈ పథకాల్లో నిర్దేశిత కాలపరిమితి పాటు ప్రతినెలా స్థిరంగా కొంత సొమ్ము డిపాజిట్‌ చేయాలి సుమా. కాలపరిమితి తీరాక మీ మొత్తం డిపాజిట్‌ విలువకు సమానమైన బంగారాన్ని ఆ రోజు ధర ప్రకారంగా కొనుగోలు చేయవచ్చు.
 
గత 25 ఏళ్లలో బంగారం ధర ఎనిమిది రెట్లు పెరిగింది. 1994లో రూ.4,600 పలికిన తులం బంగారం.. ప్రస్తుతం రూ.39వేలకు చేరుకుంది. అంటే ధర 748 శాతం వృద్ధి చెందింది. ఉదాహరణకు, పాతికేళ్ల క్రితం రూ.2.5 లక్షలు పెడితే దాదాపు 544 గ్రాముల బంగారం వచ్చేది. దాని విలువ ఇప్పుడు రూ.21 లక్షలు దాటి ఉండేది.
 
గత నెలలో రూ.40వేలకు ఎగబాకిన పసిడి ధర.. ప్రస్తుతం రూ.39 వేలకు కొద్ది దిగువలో కదలాడుతోంది. ఈ ఏడాది జనవరిలో రూ.31వేల స్థాయిలో ఉన్న పుత్తడి రేటు గడిచిన 9 నెలల్లో 20 శాతానికి పైగా పెరిగింది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మాంద్యం మబ్బులు కమ్ముకుంటుండటం, ముడి చమురు ధరలు ఎగబాకుతుండటంతోపాటు రాజకీయ, భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులతో భవిష్యత్‌లో పసిడి రేటు మరింత ఎగబాకే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయి. గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్)లో పెట్టుబడులు అనూహ్యంగా పుంజుకోవడమే ఇందుకు సంకేతం. ఎందుకంటే, ప్రతికూలతల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పసిడికి పేరుంది.

బ్యాంక్‌ డిపాజిట్లు, స్థిరాస్తి, షేర్లతోపాటు పసిడిలోనూ పెట్టుబడులు పెట్టాలని ఫైనాన్షియల్‌ ప్లానర్లు సిఫారసు చేస్తున్నారు. అయితే, తమ ఇన్వె్‌స్టమెంట్‌ పోర్ట్‌ఫోలియోలో పసిడి వాటాను 10-15 శాతానికి మించకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాదు, రోజువారీ ట్రేడింగ్‌కు దూరంగా ఉండాలని, దీర్ఘకాలిక వ్యూహమే పెట్టుబడులకు శ్రీరామ రక్ష అని అంటున్నారు.