మరింత క్షీణించిన దేశ ఆర్థిక వృద్ధిరేటు... ఆందోళనకరంగా జీడీపీ...

భారత ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా మాత్రమే వెళుతుందని, త్వరలో పుంజుకుంటుందని విత్తమంత్రి నిర్మల సీతారామన్ చేసిన వ్యాఖ్యలు నీటి మీద రాతలేనని తేలిపోయింది. రెండో త్రైమాసికంలో జీడీపీ 4.5 శాతానికి పడిపోయింది. 2012-13 తర్వాత ఇదే కనిష్ఠం. ఉత్పత్తి రంగం దెబ్బతీయగా, 2.1 శాతంతో వ్యవసాయ రంగం నిరాశపరిచింది. 
 

Gross Domestic Product growth falls to 4.5% in Q2 of 2019-20

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వృద్ధిరేటు మరింత క్షీణించింది. గత ఏడు త్రైమాసికాల నుంచి వరుసగా పతనమవుతున్న స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2019-20) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో 4.5 శాతానికి పతనమై ఆరేండ్ల కనిష్ఠస్థాయికి దిగజారింది. 

ఉత్పత్తి రంగంలో వృద్ధిరేటు క్షీణించడం, వ్యవసాయరంగంలో నెలకొన్న స్తబ్ధత ఇందుకు ప్రధాన కారణాలని ప్రభుత్వం శుక్రవారం విడుదలచేసిన తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో 5 శాతంగా నమోదైన జీడీపీ వృద్ధిరేటు కంటే ఇది 0.5 శాతం తక్కువగా నమోదు కావడం ఆసక్తికర పరిణామం. 

గత ఆర్థిక సంవత్సర (2018-19) రెండో త్రైమాసికంలో నమోదైన 7.1 శాతం వృద్ధిరేటు కంటే 2.6 శాతం తక్కువ. అంతకుముందు 2012-13 ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో జీడీపీ వృద్ధిరేటు అత్యంత కనిష్ఠస్థాయికి దిగజారి 4.3 శాతంగా నమోదైంది. జీడీపీకి సంబంధించిన తాజా గణాంకాలను మౌలిక వసతుల రంగంలోని కీలక పరిశ్రమల గణాంకాలతో కలిపి శుక్రవారం విడుదల చేశారు. 

also read తెలంగాణలో రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రంగం పెట్టుబడి...5వేల ఉద్యోగాలు...

ఎన్‌ఎస్వో (నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ఏడాది క్రితం 6.9 శాతంగా ఉన్న స్థూల విలువ ఆధారిత (జీవీఏ) వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో 1 శాతం తగ్గింది. అలాగే ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో ఈ వృద్ధిరేటు వ్యవసాయరంగంలో 4,9 శాతం నుంచి 2.1 శాతానికి పడిపోయింది.

నిర్మాణరంగంలో 8.5 శాతం నుంచి 3.3 శాతానికి, మైనింగ్‌రంగంలో 2.2 శాతం నుంచి 0.1 శాతానికి, విద్యుత్, గ్యాస్, నీటిసరఫరా తదితర వినిమయ సేవల రంగంలో 8.7 శాతం నుంచి 3.6 శాతానికి, వాణిజ్యం, హోటల్, రవాణా, కమ్యూనికేషన్లు, ప్రసార (బ్రాడ్‌కాస్టింగ్) సంబంధ సేవల రగంలో 6.9 శాతం నుంచి 4.8 శాతానికి, ఆర్థిక, రియల్ ఎస్టేట్, వృత్తి సేవల రంగంలో 7 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గింది. అయితే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్, ఇతర సేవల రంగాల్లో జీవీఏ వృద్ధిరేటు 8.6 శాతం నుంచి 11.6 శాతానికి పెరిగింది. 

Gross Domestic Product growth falls to 4.5% in Q2 of 2019-20

అర్ధసంవత్సర (ఏప్రిల్-సెప్టెంబర్) ప్రాతిపదికగా చూస్తే ఏడాది క్రితం 7.5 శాతంగా ఉన్న స్థూల దేశీయోత్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో 4.8 శాతానికి తగ్గింది. స్థిర (2012-13) ధరల ప్రకారం 2018-19 రెండో త్రైమాసికంలో రూ.34.43 లక్షలకోట్లుగా ఉన్న జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో 4.5 శాతం వృద్ధిరేటుతో రూ.35.99 లక్షలకోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్టు ఎన్‌ఎస్వో తెలిపింది.

వరుసగా రెండో నెల కీలక రంగాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. అక్టోబర్ నెలలో -5.8 శాతానికి పడిపోయాయి. గడిచిన పదేండ్లలో ఇంత అత్యల్పంగా నమోదుకావడం ఇదే తొలిసారి. ఎనిమిది కీలక రంగాల్లో బొగ్గు, క్రూడాయిల్, సహజ వాయువు, సిమెంట్, స్టీల్, విద్యుత్‌లు ప్రతికూలానికి పడిపోగా, కేవలం రెండు విభాగాలు వృద్ధిని నమోదు చేసుకున్నాయి. 

also read టాప్-10 అత్యంత ధనవంతుల్లో ముకేష్ అంబాని...

బొగ్గు ఉత్పత్తిలో వృద్ధి 17.6 శాతానికి పడిపోగా, క్రూడాయిల్ 5.1 శాతం, సహజ వాయువు 5.7 శాతానికి పడిపోయినట్లు వాణిజ్య మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వీటితోపాటు సిమెంట్ (-7.7 శాతం), స్టీల్ (-1.6 శాతం), విద్యుత్ (-12.4 శాతం)లు కూడా పతనం చెందాయి. అలాగే రిఫైనరీ ఉత్పత్తుల్లో వృద్ధి 1.3 శాతం నుంచి 0.4 శాతానికి పడిపోయింది. కానీ, ఎరువుల రంగం మాత్రం భారీ వృద్ధిని నమోదు చేసుకున్నది. గతేడాది ఇదే నెలలో నమోదైన వృద్ధితో పోలిస్తే ఈసారి ఎరువుల విభాగం 11.8 శాతం వృద్ధిని కనబరిచింది. అక్టోబర్ 2018లో కీలక రంగాలు 4.8 శాతం వృద్ధిని కనబరిచాయి.

దీనిపై మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పందిస్తూ.. వృద్ధిరేటు 4.5 శాతానికి దిగజారడం ఆమోదయోగ్యం కాదు.. ఇది తీవ్ర ఆందోళనకరమైన విషయం. సమాజం పట్ల అపనమ్మకాన్ని పక్కనపెట్టి పరస్పర విశ్వాసాన్ని, సామరస్యతను పెంపొందించడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలని ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేస్తున్నా. దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చే సామాజిక లావాదేవీలకు పరస్పర విశ్వాసం పునాదిరాయి లాంటిది. కానీ.. ఇప్పుడు మన సమాజంలో పరస్పర విశ్వాసం, నమ్మకం ఛిన్నాభిన్నమయ్యాయి. మితిమీరిన అపనమ్మకం, భయం, నిరాశావాదం మన ఆర్థికాభివృద్ధిని దారుణంగా దెబ్బతీస్తున్నాయి’ అని స్పష్టం చేశారు. 
 
ఫిక్కీ అధ్యక్షుడు సందీప్ సోమానీ స్పందిస్తూ.. జీడీపీ పతనం ఊహించినదే. ప్రస్తుత పండుగ సీజన్‌లో పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ వ్యక్తిగత వినిమయం, పెట్టుబడుల డిమాండ్ బలహీనంగానే ఉన్నట్టు స్పష్టమవుతున్నదన్నారు. పీహెచ్‌డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ డీకే అగర్వాల్ మాట్లాడుతూ ‘ఇటీవల వరుసగా చేపట్టిన సంస్కరణలు దేశ ఆర్థిక వృద్ధిరేటు వేగాన్ని మళ్లీ పెంచుతాయి. వచ్చే త్రైమాసికంలో జీడీపీ పుంజుకొంటుందని మేము భావిస్తున్నాం’ అని తెలిపారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios