మోదీ సర్కారుకు గుడ్ న్యూస్.. భారత్‌పై అప్పుల భారం తగ్గుతోంది..మూడీస్ సంస్థ కీలక నివేదికలో వెల్లడి..
ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థ అయినటువంటి మూడీస్, తాజాగా మోడీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ వినిపించింది. దేశంపై ఉన్నటువంటి రుణభారం తగ్గుముఖం పడుతుందని దీనికి ప్రధాన కారణం జీడీపీలో పెరుగుదలని పేర్కొంది.
భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) వేగంగా వృద్ధి చెందుతోందని, ఇది దేశంపై అప్పుల భారాన్ని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ గురువారం తెలిపింది. దేశపు క్రెడిట్ ప్రొఫైల్, ఆర్థిక బలం, రుణ స్థోమతపై సంస్థ ప్రత్యేకంగా నివేదికను విడుదల చేసింది.
ఈ నివేదిక ప్రకారం, భారతదేశం GDP వేగవంతమైన వృద్ధి కారణంగా, దేశ రుణ భారం తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా రుణ భారం తగ్గుదల మూడీస్ వేసిన అంచనాలలో కీలకమైన అంశంగా ఉండటం విశేషం.
భారతదేశం అధిక స్థాయి ప్రభుత్వ రుణాన్ని కలిగి ఉంది, ఇది 2022-23కి GDPలో 81.8 శాతంగా అంచనా వేయబడింది. అయితే మూడీస్ వేసిన అంచనా ప్రకారం భవిష్యత్తులో ఈ సగటు దాదాపు 56 శాతంకు తగ్గే అవకాశం ఉందని తెలిపింది. దీన్ని బట్టి భవిష్యత్తులో. దేశ రుణ స్థోమత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని తెలిపింది. అయితే ప్రపంచవ్యాప్తంగా మరోవైపు ఇతర దేశాల్లో సైతం రుణ భారం తగ్గుతోంది.. కానీ అన్ని అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఇది జరగదు. ఫ్రాన్స్, ఇటలీ యుఎస్ లో దీర్ఘకాల ఖర్చుల కారణంగా రుణభారం పెరుగుతుంది.
భారతదేశంపై అత్యల్ప పెట్టుబడి రేటింగ్ Baa3 రేటింగ్ పెంపు అంశంపై మూడీస్ ప్రతినిధులు శుక్రవారం ప్రభుత్వ అధికారులతో సమావేశం కానున్నారు. రేటింగ్‌లను మెరుగుపరచడానికి ఈ సమావేశం ఒక ప్రత్యేకమైన భేటీగా పరిగణించనున్నారు.
కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా తగ్గుముఖం పడుతోంది..
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ కరెంట్ ఖాతా లోటు (సిఎడి) స్థూల దేశీయోత్పత్తి (జిడిపి)లో 2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు రికవరీ మార్గంలో ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు (సిఇఎ) వి. అనంత్ నాగేశ్వరన్ గురువారం మాట్లాడుతూ అనేక విషయాలు పంచుకున్నారు.
ముందున్న సవాళ్లు చాలా తక్కువ.
ముడి చమురు ధరలు ఎక్కువగా ఉన్నందున 2022-23 మొదటి 9 నెలల్లో కరెంటు ఖాతా లోటు 2.7 శాతానికి చేరుకుంది. అదే సమయంలో, దాని భారీ దేశీయ డిమాండ్ కారణంగా, మరింత దిగుమతులు చేయవలసి వచ్చింది. ఫలితంగా వాణిజ్య లోటు పెరిగిందని తెలిపింది. .
అయితే రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం వల్ల ఉత్పత్తి మరియు ధరలపై ప్రభావాన్ని ఎదుర్కోవడానికి దేశం సర్వసన్నద్ధంగా ఉందని నాగేశ్వరన్ అన్నారు. ఎల్ నినో ప్రభావం భారతదేశ వృద్ధికి ముప్పుగా పరిణమించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్న వారం తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఇదిలా ఉంటే చెన్నైలో జరిగిన FICCI కన్వెన్షన్‌ను ఉద్దేశించి నాగేశ్వరన్ మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా లోటు జిడిపిలో 2 శాతం కంటే తక్కువగా ఉంటుందని మేము భావిస్తున్నామని తెలిపారు.
రిజర్వ్ బ్యాంక్ తాజా డేటా ప్రకారం, ఏప్రిల్-డిసెంబర్ 2022లో కరెంట్ ఖాతా లోటు GDPలో 2.7 శాతంగా ఉంది, ఇది ఏప్రిల్-డిసెంబర్ 2021లో 1.1 శాతంగా ఉంది. ఎగుమతుల వాణిజ్యంలో నష్టాల కారణంగా ఇది జరిగింది.ఇతర దేశాలతో చూస్తే దేశంలోని విదేశీ మారకద్రవ్య నిల్వలు 10 నెలల దిగుమతులకు సరిపోతాయని, వర్ధమాన దేశాలతో పోలిస్తే ఇదే అత్యుత్తమ స్థానమని నాగేశ్వరన్ అన్నారు.