Asianet News TeluguAsianet News Telugu

ఆర్థిక వ్యవస్థపై కరోనా కాటు...పీవీ నర్సింహారావు హయాం నాటికి దిగజారిన జీడీపీ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి రెండు శాతానికే పరిమితమని ఫిచ్​ రేటింగ్స్​ సంస్థ తాజాగా పేర్కొంది. దాదాపు 30 ఏళ్ల క్రితం 1991లో దేశ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసిన వేళ.. విదేశీ మారక ద్రవ్యం లేక.. బకాయిలు చెల్లించడానికి బంగారం కుదువ బెట్టాల్సి వచ్చింది. దీంతో నాడు ప్రధానిగా పగ్గాలు చేపట్టిన పీవీ నర్సింహారావు క్యాబినెట్‌లో నేటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా సంస్కరణలు తెచ్చారు.
 

Fitch slashes India growth forecast to 30-year low of 2% for FY21
Author
Hyderabad, First Published Apr 4, 2020, 12:55 PM IST

న్యూఢిల్లీ: ఆర్థికమాంద్యంతో అల్లాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా కాటుతో మరింత దిగజారనున్నదా? ఈ ప్రశ్నకు వివిధ వర్గాల నుంచి అవునన్న సమాధానమే వస్తున్నది. కరోనా వల్ల ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్​ సంస్థలు వరుసగా దేశీయ వృద్ధి రేటు అంచనాలను కుదిస్తూ వస్తున్నాయి. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో దేశ ఆర్థిక వృద్ధిరేటు 30 ఏళ్ల  కనిష్ఠ స్థాయి రెండు శాతానికే పరిమితం అవుతుందని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ‘ఫిచ్‌' కుండ బద్ధలు కొట్టింది. మరో సంస్థ మూడీస్ ఇన్వెస్టర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 2.5 శాతానికే పరిమితమవుతుంది. \

ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) మాత్రం కాస్త ఊరటనిచ్చింది. భారత ఆర్థిక వృద్ధిరేటు 4 శాతానికి క్షీణిస్తుందని అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై రెండు రోజులు దాటక ముందే ప్రస్తుత (2020-21) ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించి వేసిన ఫిచ్.. 1991లో దేశీయ ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేసిన దగ్గర నుంచి 30 ఏళ్లలో ఇదే అత్యల్పం అని పేర్కొంది. 

ఈ ఏడాది స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు 5.1 శాతంగా నమోదవుతుందని ‘ఫిచ్‌' గతంలో అంచనా వేసింది. ఒకవైపు ప్రపంచ వ్యాప్త మాంద్యం, మరోవైపు కొవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో తమ అంచనాను కుదిస్తున్నామని ఫిచ్ శుక్రవారం తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందని ఫిచ్ అభిప్రాయపడింది. కరోనా వైరస్​ తాకిడికి వినియోగదారుల వ్యయాలు తగ్గడంతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా నష్టపోయే జాబితాలో ఉన్నాయని ఫిచ్​ రేటింగ్స్​ అభిప్రాయపడింది.

మరోవైపు మూడీస్​ ఇన్వెస్టర్స్​ సర్వీస్​ కూడా అదే బాటలోనే పయనించింది. మూడీస్​ ఇన్వెస్టర్స్ ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 2.5 శాతానికే పరిమితం అవుతుంది. అంతకుముందు 5.3 శాతమని అంచనా వేసింది. కొవిడ్​-19 మహమ్మారి ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కోలుకోలేని దెబ్బ కొట్టిందని అభిప్రాయపడింది.

ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వృద్ధి నాలుగు శాతానికి పరిమితమని పేర్కొంది. ప్రపంచ వ్యాప్త రాబడిలో దాదాపు 5 శాతం(4.1 ట్రిలియన్​ డాలర్లు) తగ్గనుందని విశ్లేషించింది.

వృద్ధి రేటును ఎస్​ అండ్​ పీ గ్లోబల్​ రేటింగ్స్​ 3.5 శాతానికి కుదించింది. అంతకుముందు.. 5.2 శాతంగా నమోదవుతుందని అంచనా వేయడం గమనార్హం. దేశీయ క్రెడిట్​ రేటింగ్​ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్​ కూడా తన అంచనాల్ని ఇటీవల సవరించింది. ఆర్థిక వృద్ధిని 5.5 నుంచి 3.6 శాతానికి పరిమితం చేసింది. 

గత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన 5 శాతం వృద్ధి రేటుతో పోల్చి, తాజా వృద్ధి అంచనాలను రేటింగ్​ సంస్థలు వెల్లడించాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్​డౌన్​ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రైవేట్‌ వినియోగంతోపాటు పెట్టుబడులూ తగ్గిపోయాయి. తాజా పరిణామాల నడుమ భారత వృద్ధి రేటును సవరించినట్లు ఆయా సంస్థలు పేర్కొన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios