Asianet News TeluguAsianet News Telugu

కరోనా ఎఫెక్ట్: ముడి సరుకుకొరత..సవాళ్ల ముంగిట ఫార్మా ఇండస్ట్రీ

 చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ దేశీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలకు గుబులు పుట్టిస్తోంది. అక్కడి నుంచి మన అవసరాలకు తగినట్లు ముడి ఔషధాలు రావటం లేదు. 

Coronavirus outbreak: China shutdown to hit Indian drug manufacturers
Author
New Delhi, First Published Feb 9, 2020, 1:13 PM IST

న్యూఢిల్లీ: ప్రస్తుతం ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా చర్చకొస్తున్న అంశం కరోనా వైరస్.. చైనాలో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. విదేశాలకు వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ మనదేశంలోనూ కలకలం సృష్టిస్తోంది. వివిధ పర్రిశమలను కలవరపరుస్తోంది. ప్రత్యేకించి ఫార్మాస్యూటికల్ పరిశ్రమకు సమస్యలు తలెత్తనున్నాయి. 

ప్రత్యేకించి ముడి ఔషధాల కోసం చైనా మీద ఎక్కువగా ఆధారపడిన దేశీయ ఫార్మాస్యూటికల్ పరిశ్రమ మరింత భయపడుతోంది. భారతదేశానికి మూడింట రెండొంతుల డ్రగ్స్, ఇతర ముడి పదార్థాలు చైనా నుంచే వస్తున్నాయి. హాంకాంగ్ కేంద్రంగా విదేశాలతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్న భారతీయ వ్యాపారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also read:అంగట్లో ఇండియన్స్ పర్సనల్ డేటా.. గుర్తించిన సింగపూర్ సంస్థ ఐబీ

మందులు తయారు చేయడానికి అవసరమైన పలు ముడి పదార్ధాలను భారత ఫార్మాస్యూటికల్ కంపెనీలు చైనా నుంచి కొనుగోలు చేస్తున్నాయి. వీటిని ఇక్కడి ఫార్మా కంపెనీలు తుది వినియోగానికి అనువైన ట్యాబ్లెట్లు, కేప్సుల్స్‌గా తయారు చేస్తున్నాయి. 

దాదాపు దేశీయ ఔషధ అవసరాల్లో 60-80 శాతం వరకూ చైనా నుంచి వస్తున్నవే. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఫార్మా కంపెనీలు సుమారు రూ.17వేల కోట్ల విలువైన బల్క్‌, ఏపీఐ ఔషధాలను చైనా నుంచి దిగుమతి చేసుకున్నాయి.

ఈ నేపధ్యంలో చైనాలో విస్తరిస్తున్న కరోనా వైరస్‌ దేశీయ ఫార్మాస్యూటికల్ కంపెనీలకు గుబులు పుట్టిస్తోంది. అక్కడి నుంచి మన అవసరాలకు తగినట్లు ముడి ఔషధాలు రావటం లేదు. హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు కొంతకాలంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో ఔషధ పరిశ్రమ విస్తరించింది. 

హైదరాబాద్, విశాఖపట్నం నగరాలకు దగ్గర్లో ఏర్పాటైన ఔషధ యూనిట్లు పలు దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. బల్క్‌ ఔషధాలు ఇక్కడ సొంతంగా తయారు చేసుకోవటం కంటే చైనా నుంచి దిగుమతి చేసుకోవటం చౌక కావటం దీనికి ప్రధాన కారణం. 

కొంతకాలంగా చైనాలో పారిశ్రామిక కాలుష్యం బాగా పెరిగింది. దీంతో కాలుష్య నిబంధనలను కఠినతరం చేశారు. తత్ఫలితంగా రెండు, మూడేళ్ల నుంచే బల్క్‌ ఔషధాలు, ఏపీఐలు చైనా నుంచి రావటం తగ్గింది. 

ఎప్పటికీ ఇది సమస్యే కాబట్టి దేశీయంగానే బల్క్‌ ఔషధాల తయారీని పెంచాలని అటు ప్రభుత్వం, ఇటు పరిశ్రమ వర్గాలు మాట్లాడుతున్నాయి. కానీ ఆ దిశగా గట్టి అడుగులు పడటం లేదు. దేశంలో నాలుగైదు ప్రదేశాల్లో బల్క్‌ ఔషధ పార్కులు ప్రారంభించాలని, అందుకు ప్రభుత్వం ఉదారంగా నిధులు ఇవ్వాలని ఫార్మా పరిశ్రమ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. 

రాష్ట్రాల్లో ఫార్మా పార్కులను ఏర్పాటు చేసే కసరత్తు ఇంకా పట్టాలెక్కక ముందే ఇప్పుడు కరోనా వైరస్‌ సమస్యతో బల్క్‌ ఔషధాల సమస్య తీవ్రతరంగా మారింది. కరోనా వైరస్‌ సమస్యతో చైనా నుంచి బల్క్‌, ఏపీఐ ఔషధాల సరఫరా ఏ మేరకు తగ్గుతుందనే విషయంలో ఈ నెల 10 తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉందని స్ధానిక ఔషధ కంపెనీ అధిపతి ఒకరు చెప్పారు. 

చైనాలో క్రిస్మస్‌, కొత్త సంవత్సర సెలవులు ఈ నెల 10 వరకూ పొడిగించారు. సెలవులు ముగిశాక అక్కడి నుంచి ఏ మేరకు మనకు అవసరమైన బల్క్‌, ఏపీఐ ఔషధాలు సరఫరా అవుతాయా? లేదా? తెలుస్తుందని పేర్కొన్నారు.

ఇప్పటికైతే కొరత అంత కనిపించటం లేదు.. వైరస్ తీవ్రత మరికొంత కాలం కొనసాగితే మాత్రం తీవ్రమైన ఇబ్బందులు తప్పవు, మందుల ధరలు కూడా పెరిగిపోతాయని ఔషధ కంపెనీ అధిపతి చెప్పారు. చైనాలోని వుహాన్‌, ఝెజియాంగ్‌, జియాంగ్సు తదితర నగరాలకు సమీపంలో బల్క్‌ డ్రగ్స్‌, ఏపీఐలు అధికంగా తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. 

ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు కరోనా వైరస్‌ ఫలితంగా నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉత్పత్తి కార్యకలాపాలు నిలిచిపోయాయి. విటమిన్లు, యాంటీ-బయాటిక్స్‌ తయారీలో వినియోగించే ఎన్నో ముడి ఔషధాలకు మనకు చైనా మీద అధికంగా ఆధారపడవలసిన పరిస్థితి ఉంది. రెండు మూడు వారాలుగా చైనా బల్క్‌ ఔషధాల దిగుమతులు క్షీణించాయి. 

పెన్సిలిన్‌-జీ, పేరసిటమాల్‌, అజిత్రోమైసిన్‌, మాంటెలుకాస్ట్‌.. తదితర ఔషధాల తయారీకి ముడి ఔషధాల కొరత ఏర్పడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. దేశీయ ఫార్మా కంపెనీల వల్ల ఉన్న ముడిపదార్థాల నిల్వలు రెండు, మూడు నెలల అవసరాలకు మాత్రమే సరిపోతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

అప్పటి లోగా కరోనా విజృంభణ తగ్గుముఖం పట్టని పక్షంలో ముడి ఔషధాల ధరలు పెరిగి, పలు రకాల మందుల ధరలు పెరిగే ప్రమాదం ఏర్పడుతుంది. జర్మనీ కార్ల ప్లాంట్లకూ చైనా నుంచి విడిభాగాలు సరఫరా అవుతాయి. 

ఇంతకుముందు వాణిజ్య యుద్ధం వల్ల 2019లో పారిశ్రామిక ఉత్పత్తి నెమ్మదించి ఇబ్బంది పడిన జర్మనీ, ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థలను ఇప్పుడు కరోనా బెంబేలెత్తిస్తోంది. ఈ ఏడాది వ్యవస్థలు పునరుత్తేజితం అవుతాయని ఆశిస్తుంటే, ఈ వైరస్‌ ప్రతికూలంగా మారిందని భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios