Asianet News TeluguAsianet News Telugu

‘ఆటో’ ప్లాంట్లలో వెంటిలేటర్ల తయారీ! భారీ ప్రణాళికలతో ముందడుగు

దేశీయంగా కొవిడ్‌-19 కేసులు పెరిగే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా వెంటిలేటర్లను తయారు చేయడంపై దృష్టిపెట్టింది. 

Coronavirus Crisis: Government Asks Automobile Companies To Manufacture Ventilators
Author
New Delhi, First Published Mar 31, 2020, 12:11 PM IST

న్యూఢిల్లీ: దేశీయంగా కొవిడ్‌-19 కేసులు పెరిగే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా వెంటిలేటర్లను తయారు చేయడంపై దృష్టిపెట్టింది. 

విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని భావించినా విడి భాగాలను తెచ్చుకుని అసెంబ్లింగ్ చేసినా ఒక్కో వెంటిలేటర్ ధర రూ.5-10 లక్షలు పలుకుతోంది. ఇప్పుడు భారీ స్థాయిలో వెంటిలేటర్లు మనకు.. మనతోపాటు ప్రపంచ దేశాలకూ అవసరమే. ఈ పరిస్థితుల్లో విదేశాల నుంచి వెంటిలెటర్ల దిగుమతి అనుమానమేనన్న అభిప్రాయాలు ఉన్నాయి. 

ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ మీద పోరు చేయడానికి అవసరమైన అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నది కేంద్ర ప్రభుత్వం. వెంటిలేటర్లను డిజైన్ చేసే బాధ్యతను రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని భారత రక్షణ పరిశోధనా సంస్థ (డీఆర్డీవో) స్వీకరించింది. 

వాటిని దేశీయంగా తయారు చేసుకుంటే తక్కువ ధరకే లభిస్తుందన్న అభిప్రాయం కూడా ఉన్నది. ఒకేసారి పలువురికి సేవలందించే వెంటిలేటర్‌ను డీఆర్డీవో డిజైన్ చేసింది. 

తొలి నెలలో 5000, రెండో నెలలో 10వేలు తయారు చేయగలమని డీఆర్డీవో తెలిపింది. ఈ డిజైన్‌ను మహీంద్రా అండ్ మహీంద్రాతోపాటు తొమ్మిది సంస్థలకు అప్పగించింది. భారీ సంఖ్యలో వెంటిలేటర్ల తయారీకి చర్యలు చేపట్టింది.

ప్రస్తుత సమయంలో అవసరమైన వెంటిలేటర్ల తయారీని చేపట్టాలని దేశీయ ఆటోమొబైల్‌ తయారీ సంస్థలను కోరింది. ప్రస్తుతం లాక్ డౌన్, వైరస్ ముప్పు వల్ల దాదాపు ఆటోమొబైల్ సంస్థలన్నీ మూత పడ్డాయి. ఈ నేపథ్యంలో వెంటిలేటర్లను తయారు చేసేందుకు ముందుకు రావాలని కేంద్రం వాటిని కోరడం గమనార్హం. 

సాధ్యమైనంత త్వరగా వెంటిలేటర్లను తయారు చేసేందుకు సిద్ధం కావాలని ఆటోమొబైల్ సంస్థలను కోరింది. మరోవైపు వచ్చే వారం నుంచి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డీఆర్‌డీవో రోజుకు 20,000 ఎన్‌-95 మాస్కులు ఉత్పత్తి చేయనుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో 14,000కి పైగా వెంటిలేటర్లు, 11.95 లక్షల ఎన్‌-95 మాస్క్‌లు అందుబాటులో ఉన్నాయి. అదనంగా మరో 5 లక్షల మాస్కులను గత రెండు రోజుల్లో పంపిణీ చేశారు. 

సోమవారం 1.40 లక్షల మాస్కులను పంపిస్తారు. ప్రస్తుతం 3.34 లక్షల వైద్య రక్షణ దుస్తులు అందుబాటులో ఉండగా ఏప్రిల్‌ నాలుగో తేదీన విదేశాల నుంచి మూడు లక్షలు దిగుమతి అవుతాయని వైద్యశాఖ వెల్లడించింది.

స్థానిక తయారీ సంస్థలతో కలిసి భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌) రెండు నెలల్లో 30,000 వెంటిలేటర్లను తయారు చేయనుందని వైద్యశాఖ తెలిపింది. ప్రైవేటు సంస్థలైన అగ్వా హెల్త్‌కేర్‌ నెలరోజుల్లో 10,000 వెంటిలేటర్లు అందజేస్తుందని పేర్కొంది. 

వైద్యరక్షణ దుస్తుల తయారీకి 11 సంస్థలు అర్హత సాధించగా 21 లక్షల సెట్లను ఆర్డర్‌ ఇచ్చామని తెలిపింది. రోజుకు 6-7వేల చొప్పున వీటిని అందిస్తారని వెల్లడించింది. ఏప్రిల్‌ మధ్య నుంచి ఉత్పత్తి రోజుకు 15 వేలకు పెరుగుతుందని ధీమా వ్యక్తం చేసింది.

ఇప్పటికే రూ.7500లకు ప్రొటోటైప్ వెంటిలేటర్లను అందుబాటులోకి తెస్తామని మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. మరోవైపు దేశీయ అతిపెద్ద ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి తాజాగా అగ్వా హెల్త్ కేర్ సంస్థతో కలిసి వెంటిలేటర్ల తయారీకి కలిసి పనిచేయాలని ఒప్పందం కుదుర్చుకున్నది. 

నెలకు పది వేల వెంటిలేటర్లను అందుబాటులోకి తేవాలని మారుతి సుజుకి లక్ష్యంగా పెట్టుకున్నది. వచ్చేనెల రెండో వారంలో మారుతి సుజుకి -అగ్వా హెల్త్ కేర్ నుంచి ప్రభుత్వానికి వెంటిలేటర్లు అందుబాటులోకి రానున్నది.

ఇక దేశీయ కార్పొరేట్ సంస్థల్లోనే అత్యధికంగా రూ.1000 కోట్లు విరాళం ప్రకటించిన టాటా మోటార్స్ మాత్రు సంస్థ టాటా సన్స్.. ఇందులో గణనీయ భాగం వెంటిలేటర్ల తయారీకి ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మైసూర్ కేంద్రంగా పని చేస్తున్న స్కన్ రాయ్ టెక్నాలజీ సంస్థ రెండు నెలల్లో లక్ష వెంటిలేటర్లు సిద్దం చేస్తామని వెల్లడించింది. 

బైక్స్ అండ్ స్కూటర్స్ తయారీ సంస్థలు బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ వ్యాధి నివారణకు గణనీయ స్థాయిలోనే సేవలందించేందుకు సిద్ధమని ప్రకటించాయి. వైద్య సంబంధ వెంటిలేటర్లను తయారు చేయడానికి ప్రభుత్వం కూడా నిబంధనలను సడలించింది. దీని ప్రకారం ఆసక్తి గల కార్పొరేట్ సంస్థలన్నింటితోనూ వెంటిలేటర్లు తయారు చేయించాలన్న సంకల్పం కేంద్రంలో కనిపిస్తోంది. 

also read:కరోనాపై పోరు: వెంటిలేటర్ల తయారీలో మారుతి సుజుకి

ఏ సంస్థ అయినా వెంటిలేటర్లను తయారు చేసేందుకు వీలుగా డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ యాక్ట్ అండ్ మెడికల్ డివైజ్ రూల్స్ సవరించింది. దీని ప్రకారం వెంటిలేటర్లను తయారు చేయడానికి ముందుకు వచ్చే సంస్థలకు లైసెన్సులను మంజూరు చేయనున్నది.  

Follow Us:
Download App:
  • android
  • ios