బిగిసిన ‘డ్రాగన్’ పట్టు: హాంకాంగ్‌పై భద్రతా చట్టానికి ఓకే..
హాంకాంగ్ మీద పట్టు సాధించేందుకు చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ప్రతిపాదించిన హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టం అంతర్జాతీయ ప్రకంపనలు స్రుష్టిస్తోంది. అమెరికా దాని మిత్ర దేశాలు మండిపడ్డాయి. ఐరాస భద్రతా మండలి సమావేశం ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రయత్నానికి డ్రాగన్ అడ్డు తగిలింది. దీనికి ప్రతిగా అమెరికా, బ్రిటన్.. హాంకాంగ్ వాసులకు తమ దేశ పౌరసత్వం ఇవ్వడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నాయి. అయితే, బ్రిటన్ ప్రభుత్వంతో చేసుకున్న విలీన ఒప్పందం ప్రకారం చైనాలో హాంకాంగ్ అంతర్భాగమే.. కానీ డ్రాగన్ తొందరపాటు పడటమే తాజా వివాదానికి కారణమా? అంటే చైనా నుంచి హాంకాంగ్ ను విడదీయడానికి అమెరికా వ్యూహాలు రచిస్తుండటం డ్రాగన్ వ్యూహాన్ని మార్చుకునేలా చేసినట్లు కనిపిస్తోంది.
బీజింగ్/ హాంకాంగ్/ వాషింగ్టన్/ లండన్: హంకాంగ్‌పై డ్రాగన్ పట్టు బిగిసేందుకు అడుగు ముందుకు పడింది. హంకాంగ్ ‘స్వయం పాలిత ప్రాంతం’ హక్కులను కాలరాచే ‘జాతీయ భద్రతా చట్టా’నికి గురువారం చైనాలోని నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ దాదాపు ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేసింది. దీంతో హాంకాంగ్‌లో కొనసాగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమాన్ని అణచివేయడానికి చైనాకు అధికారం దక్కుతుంది.
ఉగ్రవాద కార్యకలాపాల నిరోధం పేరిట హింసకు పాల్పడటం, విదేశీ జోక్యం అణచివేయడానికి డ్రాగన్‌కు అధికారం దఖలు పడుతుంది. ఇందుకోసం చైనాలోకి భద్రతా సంస్థలు హాంకాంగ్ నగరంలోకి అడుగు పెట్టేందుకు అధికారం లభిస్తుంది.
బిల్లుకు చైనా నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోదం తెలుపడంతో సంబంధిత చట్టం, దాని విధి విధానాలను నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తయారు చేస్తుంది. అందుకు మరో రెండు నెలల టైం పట్టే అవకాశం లభిస్తుంది. అటుపై హాంకాంగ్ ప్రభుత్వం శాసన ప్రకటనలో దీనిని అమలులోకి తీసుకు వస్తుంది.
హాంకాంగ్ చట్టసభకు గల హక్కులను తప్పించడానికి డ్రాగన్ ఈ విధానం అమలు చేస్తున్నది. అంటే దొడ్డి దోవన చైనా పరోక్షంగా హాంకాంగ్‌ను తన ఆధీనంలోకి తీసుకుంటుందన్న మాట. ఇది 1997 బ్రిటన్ పాలకుల నుంచి హాంకాంగ్‌ను టేకోవర్ చేసే సమయంలో చైనా చేసుకున్న వన్ కంట్రీ టూ సిస్టమ్స్ ఒప్పందానికి విరుద్ధం.
ఒప్పందం ప్రకారం 2047 వరకు హాంకాంగ్‌లో ప్రజాస్వామ్యం బతుకనివ్వకూడదని హంకాంగ్ కోసం ‘డ్రాగన్‘ ఎందుకు వెంపర్లాడుతున్నది. ఇప్పటి నుంచే ఈ నగరాన్ని చెప్పుచేతల్లోకి తెచ్చుకోవడానికి ఆత్రుత పడటానికి కారణాలేమిటి? దీనికి ఒక్కటే సమాధానం. ప్రస్తుతం చైనా ముందు ఉన్న ఆర్థిక అవసరాలు.
అందుకే చైనాకు హాంకాంగ్ ఒక బంగారు బాతు. ఆ బాతునే ఇప్పుడు కోసుకు తినేయాలని చూస్తున్నది. ఇంకో కారణం కూడా ఉన్నది. హాంకాంగ్ నగరానికి గల స్వయంప్రతిపత్తిని సవాల్ చేసేలా అమెరికా రక్షణ వ్యూహం రూపొందిస్తున్నది కూడా.
ఈ నేపథ్యంలోనే హాంకాంగ్ స్వయంప్రతిపత్తి ప్రాంతాన్ని టేకోవర్ చేసుకోవాలన్న డ్రాగన్ వ్యూహానికి గతేడాది జూన్ 9న బీజం పడింది. హాంకాంగ్ ప్రభుత్వం నేరస్థులను చైనాకు తరలించే బిల్లును ప్రవేశపెట్టింది. అటుపై మూడు రోజుల తర్వాత హాంకాంగ్ నగరంలో మొదైలన ఆందోళనలు సునామీగా మారాయి.
హాంకాంగ్ పాలకురాలు కేరీలాం ‘సారీ’ చెప్పినా, ఏడ్చినా బిల్లును రద్దు చేసినా ఆందోళనలు గతేడాది చివరి వరకు సాగాయి. ఒక దేశలో చైనా రంగంలోకి దిగింది.
మారు దుస్తుల్లో చైనా భద్రతా దళాలు హాంకాంగ్ ఆందోళనకారుల్లో చేరి దాడులు చేశాయన్న విమర్శలు ఉన్నాయి. మరోవైపు హాంకాంగ్ సరిహద్దుల్లో చైనా భారీగా యుద్ధ ట్యాంకులు, సైనిక దళాలను మోహరించింది. ఇదంతా చూస్తే ప్రపంచ పెట్టుబడి దారులకు స్వర్గధామంగా పేరొందిన హాంకాంగ్ మీద డ్రాగన్ దాడి చేస్తుందా? అనే స్థాయికి చర్చలు వెళ్లాయి. మరో తియాన్మన్ స్క్వేర్ ఉదంతం ముందుకు వస్తుందా? అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి.
కానీ అనూహ్యంగా ‘కరోనా’ మహమ్మారి తెర మీదకు రావడంతో హాంకాంగ్ ఆందోళనలకు తాత్కాలిక విరామం లభించింది. దీని అదునుగా చైనా జాతీయ భద్రతా చట్టాన్ని తెర మీదకు తీసుకురావడంతో మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. కానీ వందల సంఖ్యలో విద్యార్థులు, రాజకీయ నాయకులను అరెస్ట్ చేశారు.
ఒకప్పటి బ్రిటిష్ కాలనీ హాంకాంగ్. నాటి నుంచీ హాంకాంగ్ ఆర్థికంగా సుసంపన్నంగానే ఉంది. ఇక్కడ అమలైన ప్రజాస్వామ్య విధానాలు, వ్యాపార వాతావరణం ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడుల వరద ఉరకలెత్తింది.
చైనా కంపెనీలకు విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులు హాంకాంగ్ నుంచే వెళతాయి. ప్రపంచంలోని స్టాక్ మార్కెట్లలో హాంకాంగ్ స్టాక్ మార్కెట్ ఒకటి. అంత పరపతి గల హాంకాంగ్ వల్ల చైనా కూడా భారీగానే లబ్ది పొందింది.
also read తస్మాత్ జాగ్రత్త: వచ్చేనెలలో పెట్రోల్, డీజిల్ ధరల మోత.. లీటర్ పై భారీగా పెంపు..
చైనా ప్రభుత్వ రంగ బ్యాంకులకు అతిపెద్ద దేశీయేతర మార్కెట్ అంటే హాంకాంగ్ అంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ దేశాలకే అప్పులు ఇచ్చే ఆ బ్యాంకుల మొత్తం ఆస్తుల్లో ఏడు శాతం హాంకాంగ్ నగరంలోనే ఉన్నాయంటే ఈ నగరంలో వ్యాపార లావాదేవీలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.
బ్యాంక్ ఆఫ్ చైనా ఆధ్వర్యంలోని బీవోసీ హాంకాంగ్ లిమిటెడ్ నోట్లు జారీ చేసే బ్యాంక్. దీని నిర్వహణకు ఆదాయం 20 శాతం వరకు హాంకాంగ్, మకావ్‌ల నుంచే వస్తుంది. ప్రపంచంలోని కొన్ని కంపెనీల ప్రధాన కార్యాలయాలు హంకాంగ్ లోనే ఉన్నాయి.
చైనాలో నగదు కొరత సమస్యను ఎదుర్కొనే రియల్ ఎస్టేట్ సంస్థలు, స్థానిక ప్రభుత్వ రంగ ఆర్థిక సంస్థలు కూడా హాంకాంగ్ నుంచే రుణాలు తెచ్చుకుంటాయి. ఈ రుణాలు అంతర్జాతీయ మార్కెట్ నుంచి తెచ్చుకోవాలంటే ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
పశ్చిమ దేశాలతో సంబంధాలు గల హాంకాంగ్‌లో కార్యకలాపాల నిర్వహణకు చైనా కంపెనీలు ఆసక్తి చూపుతాయి. అందుకే పలు కంపెనీలు ఈ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. టెన్సెంట్ హోల్డింగ్, క్నుక్ వంటి దిగ్గజాలు ఇక్కడే ఉన్నాయి. 2015 నుంచి హాంకాంగ్‌లో ఐపీవోలకు వచ్చిన చైనా కంపెనీలు 100 బిలియన్ల డాలర్లకు పైగా పెట్టుబడులు సేకరించాయి. చైనాలో సేకరించిన పెట్టుబడులతో పోలిస్తే 80 శాతంతో సమానం.
ఇక విదేశీ పెట్టుబడి దారులు హాంకాంగ్ స్టాక్ మార్కెట్ ద్వారా షాంఘై మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే అవకాశం కల్పించారు.ఇప్పుడు ఈ రకమైన ట్రేడింగ్ వాటా షాంఘై స్టాక్ మార్కెట్లో 8 శాతం. ఇక హాంకాంగ్ కరెన్సీ అమెరికా డాలర్ తో సమానంగా ఉంటుంది. అందుకే చైనీయులు తమ యువాన్లను డాలర్లుగా మార్చుకోవడానికి హాంకాంగ్ లోని బీమా ఉత్పత్తులను వాడుకుంటారు. క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపి చైనా నిబంధనలను బైపాస్ చేస్తారు.
ఇవన్నీ ఒక ఎత్తయితే చైనాకు అమెరికాకు మధ్య వాణిజ్య యుద్ధం సాగుతున్నది. ఈ తరుణంలో హాంకాంగ్ నుంచి జరిగే ఎగుమతులపై టారిఫ్ లు విధించే విషయంలో ట్రంప్ సర్కార్ మినహాయింపునిచ్చింది. చాలా చైనా కంపెనీలు ఇప్పుడు హాంకాంగ్ ద్వారా ఎగుమతులు సాగిస్తున్నాయి. కానీ హాంకాంగ్‌లో జరుగుతున్న ఆందోళనలు ఎగుమతులు ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఫలితంగా మినహాయింపులు దక్కకపోవచ్చు.
చైనా ఆర్థిక వ్యవస్థ మందగించింది. ఫలితంగా పాశ్చాత్య దేశాల కంపెనీలను షాంఘై, షెన్‌జన్ నగరాలకు ఆకర్షించాలని డ్రాగన్ భావిస్తున్నా రాత్రికి రాత్రి జరుగదు. అలాగని అప్పటిదాక ఆర్థిక సంక్షోభం ఆగదు కూడా. అందుకే బంగారు బాతు వంటి హాంకాంగ్‌ను పూర్తిగా తన స్వాధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నది.
అందుకే ఎలాగైనా హాంకాంగ్‌లో అల్లర్లను అదుపు చేయడం డ్రాగన్‌కు అత్యవసరం కూడా. చైనాతో వాణిజ్య యుద్ధంలో హాంకాంగ్ ను ఆయుధంగా మలుచుకోవాలని అమెరికా చూస్తున్నది. ఇందుకోసం అమెరికా ఏకంగా ఆంక్షల బిల్లు కూడా సిద్ధం చేస్తున్నది. మరో పక్క అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో కూడా మాట్లాడుతూ ఇక హాంకాంగ్‌ను స్వయం పాలిత ప్రాంతంగా చూడబోమని పేర్కొనడం కొసమెరుపు.
చైనా తీసుకొచ్చిన హాంకాంగ్ జాతీయ భద్రతా చట్టంపై ఐరాస భద్రతామండలి సమావేశం ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రతిపాదనకు డ్రాగన్ అడ్డం కొట్టింది. ఇది తమ దేశ అంతర్గత వ్యవహారం అని తేల్చేసింది. అయితే చైనా చట్టం వల్ల ఒక పాలన-రెండు వ్యవస్థల థీమ్‌కు వ్యతిరేకం అని అమెరికా, బ్రిటన్ ఖండించాయి. హాంకాంగ్ వాసులకు తమ దేశ పౌరసత్వ హోదా కల్పించేందుకు గల అవకాశాలపై బ్రిటన్ కసరత్తు చేపట్టింది.