న్యూఢిల్లీ: మందగమనంలో చిక్కుకున్న దేశ ఆర్థిక వ్యవస్థ బయట పడలేక సతమతం అవుతోంది. జీడీపీ గ్రోత్ రేట్ రోజురోజుకు క్షీణిస్తోంది. గత 45 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగ సమస్య నెలకొన్నది. ఈ పరిస్థితుల్లోనే గత సెప్టెంబర్ నెలలో పారిశ్రామిక రంగానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ ఉద్దీపనల వల్ల పెద్దగా సత్ఫలితాలనివ్వలేదు.

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ పైనే అందరూ కేంద్రీకరించారు. ప్రత్యేకించి పన్ను మినహాయింపులపై ఎదురుచూస్తున్న వారు నిర్మలమ్మ బడ్జెట్ పై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. 2019 జూలై ఐదో తేదీన ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ఆర్థిక మందగమనాన్ని అధిగమించడానికి తోడ్పడలేదన్న విమర్శల మధ్య ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్ ప్రాధాన్యం సంతరించుకున్నది.

also read బడ్జెట్ 2020 : ఎల్టీసీజీ టాక్స్‌కు ఇక ఆర్ధికమంత్రి నిర్మల రాంరాం

ఆర్థిక మందగమనం, కార్పొరేట్ పన్నులో కోత విధించినందున ఉపశమనాలు భారీగా ఉండే అవకాశాల్లేవని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. చైనా నుంచి దిగుమతి చేసుకునే టాయ్స్ మీద భారీగా దిగుమతి సుంకాలు విధించే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక శాఖ వర్గాల కథనం.

డ్రాగన్ తయారు చేసే బొమ్మలపై 100 శాతం కస్టమ్స్ డ్యూటీ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 300 వస్తువులపై పన్ను తప్పదని తెలుస్తోంది. చెప్పులు, ఫర్నీచర్, టైర్లు, కాగితం కూడా ప్రియం కానున్నాయి. అయితే మత్స్య కార్మిక రంగానికి రూ.45 వేల కోట్లతో ప్రత్యేక పాలసీ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు అభిజ్ణ వర్గాల భోగట్టా. 

పారిశ్రామికంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి బూస్ట్‌నిచ్చే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉండనున్నాయి. ఉత్పాదక రంగాన్ని పరుగులు పెట్టించేందుకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బొమ్మలు, చెప్పులు, రబ్బర్, ప్రత్యేకమైన పేపర్లపై కస్టమ్స్ సుంకం పెంచే అవకాశాలు పుష్కలం. వివిధ వస్తువులపై విదించాల్సిన సుంకాలను సోదాహరణంగా ఆర్థిక శాఖకు వాణిజ్యశాఖ నివేదించినట్లు సమాచారం. 

న్యూ మాటిక్ రబ్బర్ టైర్లపై 10-15 శాతం సుంకాన్ని 40, చెప్పులపై విధించే సుంకం 25 నుంచి 35 శాతానికి, పెంచనున్నట్లు వినికిడి. ఫ్రీ ట్రేడ్ ఒప్పందం వల్ల ఆసియా దేశాల నుంచి ఈ ఉత్పత్తులు దిగుమతి అవుతున్నాయి. ఇక ఫర్నీచర్ పై సుంకం 20 నుంచి 30 శాతానికి, కోటెడ్ పేపర్ మీద, పేపర్ బోర్డులు, చేతితో తయారు చేసే పేపర్స్ సుంకం 20 నుంచి 40 శాతానికి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కర్ర, లోహాలు, ప్లాస్టిక్ తో తయారయ్యే బొమ్మల దిగుమతిపై సుంకం 20 నుంచి నేరుగా 100 శాతం పెంచేందుకు స్కోప్ ఉంది. చైనా నుంచి 2017-18లో 281.82 మిలియన్ల డాలర్ల విలువైన వస్తువులు దిగుమతి చేసుకుంటే గత ఆర్థిక సంవత్సరంలో అది 304 మిలియన్ డాలర్లకు చేరుకున్నది. 

మెటల్ స్క్రాప్ దిగుమతిపై సుంకాలు తగ్గించాలని పారిశ్రామిక రంగంలోని ద్వితీయ శ్రేణి వ్యాపారులు అభ్యర్థిస్తున్నారు. భారతీయ ద్వితీయ లోహాల తయారీకి ప్రధానంగా స్థానికంగా స్క్రాప్ తక్కువ సరఫరా అవుతున్నందున దిగుమతి చేసుకున్న స్క్రాప్ పైనే ఆధార పడాల్సి వస్తుందని మెటీరియల్ రీ సైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం మెటల్ స్క్రాప్ మీద దాని స్థాయిని బట్టి 2.5 నుంచి ఐదు శాతం వరకు కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్నారు. 

కొన్నేళ్లుగా తగినంత స్క్రాప్ అందుబాటులో లేక భారత్ మెటల్ స్క్రాప్ దిగుమతి దారుగా ఉన్నది. మెటల్ స్క్రాప్ దిగుమతిని ప్రోత్సహించాలని వ్యాపారులు కోరుతున్నారు. దేశీయంగా 35 శాతం మెటల్ స్క్రాప్ మాత్రమే లభిస్తున్నది. మిగతా దిగుమతిపైనే ఆధారం. రీ సైక్లింగ్ పరిశ్రమ 80 లక్షల నుంచి కోటి మందికి ఉపాధి కల్పిస్తున్నది. 

also read Budget 2020: నిర్మలా సీతారామన్ బడ్జెట్.... పలు కీలక ప్రకటనలు...

ఇక జాతీయ రహదారులకు ఈ దఫా రూ.10 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉంది. ‘భారత్ మాల’ రూపంలో జాతీయ రహదారుల అభివ్రుద్ది లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతున్నది. 26,200 కి.మీ దూరం ఎకనమిక్ కారిడార్, 8000 కి.మీ ఇంటర్ కారిడార్, 7500 కి.మీ ఫీడర్ రూట్లు, 5300 కి.మీ సరిహద్దు, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ మార్గాలు, 4,100 కి.మీ. కోస్తా పోర్ట్ అనుసందాన రోడ్లు, 1900 కి.మీ ఎక్స్ ప్రెస్ హైవేల నిర్మాణం చేపట్టాలని రోడ్లు, రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ లక్ష్యం.

మత్యకారుల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఆ రంగం అభివ్రుద్ది కోసం వచ్చే ఐదేళ్లకు రూ.45 వేల కోట్లతో ఒక విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తున్నది. ఏటా సముద్రమార్గాల్లో 43 లక్షల టన్నుల మత్స్య సంపద ఉత్పత్తి జరుగుతున్నది. మిగతా మారుమూల ప్రాంతాల్లోని 2.30 కోట్ల మంది మత్స్యకారుల అభివ్రుద్దికి ఏ విధానం లేదు. 

స్వచ్ఛ భారత్ ను ప్రోత్సహించడానికి బడ్జెట్ ప్రతిపాదనల్లో కొన్ని సంస్థలకు ప్రోత్సాహకాలు ప్రకటించే చాన్స్ ఉంది. ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణలో నిమగ్నమైన సంస్థలకు ఇన్సెంటివ్ లు ఇచ్చే దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోన్నది. వీటి నిర్వహణకు వాడే యంత్రాలపై 100 శాతం సబ్సిడీ ఇచ్చే ఆలోచనలో కేంద్రం ఉందని సమాచారం.