Asianet News TeluguAsianet News Telugu

బ్రీఫ్‌కేసు టు టాబ్లెట్ వయా బహీఖాతా... బడ్జెట్ సమర్పణలో ఆసక్తికరమైన మార్పు...

బ్రీఫ్‌కేస్ నుండి పూర్తిగా పేపర్‌లెస్ మోడ్‌కు యూనియన్ బడ్జెట్ మారడం మారుతున్న భారత ముఖ చిత్రానికి ప్రతీకగా నిలిచింది. ఈ మార్పు చాలా మనోహరంగా ఉంది.

Briefcase to tablet via Bahikhata, An interesting change in Budget Presentation - bsb
Author
First Published Jan 29, 2024, 1:24 PM IST

న్యూఢిల్లీ : బడ్జెట్ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది బ్రీఫ్ కేస్. దశాబ్దాలుగా, కేంద్ర బడ్జెట్‌ సమర్పణ కోసం ఆర్థిక మంత్రులు బ్రీఫ్‌కేస్‌ను పార్లమెంట్‌లోకి తీసుకువెళుతున్న ఫోటోలు ఎక్కడ చూసినా కనిపించేవి. అయితే, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయం నుంచి దీంట్లో మార్పులు వచ్చాయి. ఆమె బడ్జెట్ సమర్పణకు ఇండియన్ టచ్ ఇచ్చారు. 

2019లో మొట్టమొదటి మహిళా ఆర్థికమంత్రి రూపంలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం చర్చనీయాంశంగా మారింది. అందులో మరో ఆకర్షణ.. అప్పటివరకున్న బడ్జెట్ కు రూపం మారిపోవడం. బ్రీఫ్ కేసు స్థానంలో ‘బహీ ఖాతా’ వచ్చి చేరింది. ఇది పెను సంచలనంగా మారింది. ఆ తరువాత మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా నిర్మలా సీతారామన్ 2021లో టాబ్లెట్‌ని ఉపయోగించడం ద్వారా పేపర్‌లెస్ ఫార్మాట్‌ కి శ్రీకారం చుట్టారు. 

బ్రీఫ్‌కేస్ నుండి పూర్తిగా పేపర్‌లెస్ మోడ్‌కు యూనియన్ బడ్జెట్ మారడం మారుతున్న భారత ముఖ చిత్రానికి ప్రతీకగా నిలిచింది. ఈ మార్పు చాలా మనోహరంగా ఉంది. ఇక ఇప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2024-25 ఆర్థిక సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించడానికి సిద్ధమవుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్‌ను సమర్పించనున్నారు.

2019లో, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, ఆర్థిక మంత్రిత్వ శాఖకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ, చివరి మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వరుసగా రెండోసారి విజయం సాధించిన తర్వాత ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీతారామన్ జూలై 5, 2019న తన తొలి బడ్జెట్‌ను సమర్పించారు.

బ్రీఫ్ కేస్ నుంచి టాబ్లెట్ వరకు ఒకసారి పరిశీలిస్తే.. 

బ్రీఫ్కేస్
స్వతంత్ర భారత తొలి ఆర్థిక మంత్రి ఆర్‌కె షణ్ముఖం చెట్టి, తొలి కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన పత్రాలను లెదర్ పోర్ట్‌ఫోలియో బ్యాగ్‌లో పెట్టుకుని వచ్చేవారు. ఇది బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయానికి కొనసాగింపుగా ఉండేది. ఆ తరువాత కూడా ఇదే సంప్రదాయం కొనసాగింది. కాకపోతే లెదర్ బ్రీఫ్ కేస్ స్థానంలో వేర్వేరు బ్రీఫ్‌కేస్‌లను ఉపయోగించేవారు. 

union budget 2024: ఈసారి ఏ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది ? సూచన ఇచ్చిన మంత్రి..

కాలక్రమేణా, ఇది అవసరాలకు అనుగుణంగా మారుతూ వచ్చింది. 1970వ దశకంలో, ఆర్థిక మంత్రులు హార్డ్‌బౌండ్ బ్యాగ్‌ని మోయడం ప్రారంభించారు. సంవత్సరాల తరబడి దాని రంగు మారుతూనే ఉంది.

ఈ 'బడ్జెట్ బ్రీఫ్‌కేస్' కి మాజీ బ్రిటిష్ ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్‌చెకర్ విలియం ఎవార్ట్ గ్లాడ్‌స్టోన్ పేరు పెట్టారు.

'బహీ ఖాతా'
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే పాత 'బడ్జెట్ బ్రీఫ్‌కేస్' స్థానంలో 'బహీ ఖాతా' వచ్చింది. తన మొదటి బడ్జెట్ సమయంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019లో బ్రీఫ్‌కేస్‌కు బదులుగా ఎరుపు రంగు ‘బహీ ఖాతా’ని తీసుకువెళ్లడం ద్వారా దేశం దృష్టిని ఆకర్షించారు. వలసవాద వారసత్వాన్ని త్యజించడమే దీని వెనుక కారణంగా ఉంది.

వ్యాపార యజమానులు తమ ఖాతాలను నిర్వహించడానికి దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నందున 'బాహీ ఖాతా'ని ఉపయోగించాలనే ఆమె నిర్ణయం బడ్జెట్ కి భారతీయ టచ్ ఇచ్చింది.

ఆ సమయంలో, నిర్మలా సీతారామన్ 'బాహీ ఖాతా'ని తీసుకురావడం "సులభం" అని, ఇది "భారతీయమైనది" అని అన్నారు.

టాబ్లెట్
2021లో, నిర్మలా సీతారామన్ 'మేడ్ ఇన్ ఇండియా' టాబ్లెట్‌ని ఉపయోగించి పేపర్‌లెస్ ఫార్మాట్‌లో బడ్జెట్‌ను సమర్పించడంతో సాంప్రదాయ 'బాహీ ఖాతా' మరింత ఆధునికంగా రూపాంతరం చెందింది. 

'డిజిటల్ ఇండియా' కోసం ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయానికి ఈ చర్య కూడా కలిసి వచ్చింది. COVID-19 మహమ్మారి వ్యాప్తి చెందిన తర్వాత ఇది మొదటి బడ్జెట్ ప్రదర్శన. నిర్మలా సీతారామన్ 2021లో ఎరుపు రంగు 'బాహీ ఖాతా' తరహా పర్సులో టాబ్లెట్‌ను తీసుకువెళ్లారు. 2022, 2023లో కూడా ఈ పద్ధతిని కొనసాగించారు. ఈ సంవత్సరం కూడా, ఆర్థిక మంత్రి 2024 బడ్జెట్‌ను పేపర్‌లెస్ ఫార్మాట్‌లో సమర్పించాలని భావిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios