Asianet News TeluguAsianet News Telugu

దేశవ్యాప్తంగా లాక్​డౌన్:​ ఇల్లు కదలని ఇండియన్లు...సొంతూళ్లకు హైదరాబాదిలు

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ సమయంలో ప్రజల కదలికలపై సెర్చింజన్ గూగుల్ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రాలేదని, సొంతూళ్లకు వెళ్లడానికి మాత్రం ప్రాధాన్యం ఇచ్చారని వెల్లడించింది.

Are Lockdowns Working? Google's Location Data Tells You
Author
Hyderabad, First Published Apr 4, 2020, 2:42 PM IST

న్యూఢిల్లీ: సెలవు దొరికితే ఏ సినిమాకో, షికారుకో వెళ్లడం సగటు భారతీయుడి అలవాటు. సాధారణ రోజుల్లో అయితే బస్టాండ్లకు పోటెత్తుతారు. రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతాయి. పార్కులు నిండి పోతాయి. 

లాక్‌డౌన్‌ వల్ల నిత్యావసరాల దుకాణాలు, మెడికల్‌ షాపులు మినహా ఇవన్నీ మూత పడ్డాయి. ఫలితంగా జనం ఇళ్లకే పరిమితమయ్యారు. దీనిపై ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌ ఆసక్తికర డేటా వెల్లడించింది. 

మొబైల్‌ ఫోన్ల లోకేషన్‌ డేటాను ఉపయోగించి దేశంలోని ప్రజల కదలికలపై వివరాలను వెల్లడించింది. మొత్తం 131 దేశాల డేటాను కొవిడ్‌-19 కమ్యూనిటీ మొబిలిటీ రిపోర్ట్‌ పేరిట గూగుల్‌ విడుదల చేసింది.

ఫిబ్రవరి 16 నుంచి మార్చి 29 మధ్య దేశంలోని కేఫ్‌లు, షాపింగ్‌ కేంద్రాలు, థీమ్‌ పార్కులు, మ్యూజియంలు, లైబ్రరీలు, సినిమా థియేటర్లకు వెళ్లడం ఏకంగా 77 శాతం తగ్గినట్లు గూగుల్‌ పేర్కొంది. ఇక నిత్యావసర, ఫార్మసీ దుకాణాలకు వెళ్లడం సైతం 65% తగ్గింది. 

పార్కులు, ఇతర పర్యాటక ప్రదేశాలను సందర్శించడం 57% తగ్గిపోయింది. సబ్‌వేలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను సందర్శించడం 71% తగ్గిపోగా, పని ప్రదేశాలకు వెళ్లడం దాదాపు 47% తగ్గింది. సొంతూళ్లకు వెళ్లడం మాత్రం ఇదే సమయంలో 22% పెరగడం గమనార్హం. 

కొవిడ్‌-19ను ఎదుర్కోవడానికి ఇలాంటి సమగ్ర డేటా సహాయ పడుతుందని ప్రజారోగ్య అధికారుల నుంచి తాము విన్నామని ఆ కంపెనీ తెలిపింది. అయితే, ఆయా ప్రాంతాలకు వెళ్లడం ఎంతమేర పెరిగిందీ తగ్గిందీ చెప్తాం తప్ప.. ఎవరు వెళ్లారు? అనే వ్యక్తిగత వివరాలు చెప్పడం లేదని గూగుల్‌ హెల్త్‌ చీఫ్‌ హెల్త్‌ ఆఫీసర్‌ కరెన్‌ డిసాల్వో తెలిపారు. 

also read ఆర్థిక వ్యవస్థపై కరోనా కాటు...పీవీ నర్సింహారావు హయాం నాటికి దిగజారిన జీడీపీ

లాక్‌డౌన్‌ నేపథ్యంలో పలు చోట్లకు జనం కదలికల్లో హెచ్చుతగ్గులను శాతాలవారీగా అందిస్తున్నది. కాగా, ఇది కేవలం ప్రజల కదలికల గురించి శాతాల వారీగా విశ్లేషణ మాత్రమేనని గూగుల్‌ మ్యాప్స్‌ అధిపతి, గూగుల్‌ హెల్త్‌ చీఫ్‌ హెల్త్‌ అధికారి కరెన్‌ డెసాల్వో తెలిపారు. 

వ్యాపార కార్యకలాపాల నిర్వహణ, డెలివరీ సేవలు వంటి విషయాల్లో సిఫారసులకు, ప్రజల ప్రయాణాల్లో వచ్చిన మార్పులను తెలుసుకునేందుకు ఈ డేటా ఉపయోగపడుతుందన్నారు. వ్యక్తుల కదలికల వాస్తవ సంఖ్య, వారి వ్యక్తిగత సమాచారాన్ని ఎంతమాత్రం బహిరంగపర్చడం లేదన్నారు. 

ఏఏ ప్రాంతాల్లో జనంరద్దీ ఎలా ఉన్నదన్నది తెలుసుకునేందుకు తమ సమాచారం ఉపయోగపడుతుందని గూగుల్‌ హెల్త్‌ చీఫ్‌ హెల్త్‌ అధికారి కరెన్‌ డెసాల్వో వెల్లడించారు. తద్వారా ప్రజల అవసరాలను గుర్తించి ఆ మేరకు ప్రభుత్వాలు చర్యలు తీసుకునేందుకు ఇది సహకరిస్తుందని పేర్కొన్నారు. 

కాగా, గూగుల్‌ మ్యాప్స్‌లో ఇప్పటికే ఈ విధానం అందుబాటులో ఉన్నది. లొకేషన్‌ ఫీచర్‌ ఆధారంగా రద్దీగా ఉండే ట్రాఫిక్‌ సిగల్స్‌, మార్గాలు, ప్రాంతాలను మొబైల్‌ వినియోగదారులకు గూగుల్‌ సూచిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు వ్యక్తిగత గోప్యత హక్కును గూగుల్‌ హరిస్తున్నదన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి.  
 

Follow Us:
Download App:
  • android
  • ios