Union Budget 2022: వేతన జీవులకు మరోసారి నిరాశే మిగిల్చిన బడ్జెట్.. వాటిలో ఎలాంటి మార్పు లేదు..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2022-23లో వేతన జీవులకు నిరాశే మిగిలింది. ఆదాయ పన్ను రాయితీల విషయంలో వారిని నిరాశే ఎదురైంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్ 2022-23లో వేతన జీవులకు నిరాశే మిగిలింది. ఆదాయ పన్ను రాయితీల విషయంలో వారిని నిరాశే ఎదురైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి వ్యక్తిగత ఆదాయపు పన్ను టారీఫ్‌లపై ఎలాంటి మార్పును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించలేదు. దీంతో ఆదాయ పన్ను వినహాయింపుపై ఈ సారీ కూడా వేతన జీవులకు నిరాశ తప్పలేదు. ఈ క్రమంలోనే వేతన జీవులు బడ్జెట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇక, స్టాండర్డ్ పన్ను డిడక్షన్ రూ. లక్ష పెంచుతారని వేతన జీవులు ఆశగా ఎదురుచూశారు. కరోనా నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అలవెన్స్‌ల కోసం ప్రత్యేక నిబంధనల తీసుకోస్తారని అంతా అంచనా వేశారు. కానీ బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ అలాంటి ప్రకటన ఏమి వెలువడలేదు.
80సీ కింద మినహాయింపుల పెంపుపై వేతన జీవులు ఎన్నో ఆశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద గరిష్ఠంగా ఇస్తున్న రూ.1.50 లక్షల మినహాయింపుల పరిమితిని రూ.3 లక్షలకు పెంచాలని వేతన జీవులు కేంద్రాన్ని కోరుతున్నారు. దీంతోపాటు ప్రామాణిక మినహాయింపుల(స్టాండర్డ్ డిడక్షన్)ను మరో రూ.50వేల మేర పెంచితే ఉద్యోగులకు కొంత మేలు జరుగుతుందని భావించారు. కానీ ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో 80C పరిమితికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు.
ఇక, భారత్‌లో డిజిటల్ కరెన్సీకి (digital currency) సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. రిజర్వ్ బ్యాంక్ ఇండియా ద్వారా డిజిటల్ కరెన్సీని తీసుకురానున్నట్టుగా చెప్పారు.
రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్ రూపీ ఉండనుందని తెలిపారు. కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్ కరెన్సీ ఉండనుందని చెప్పారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో రూపొందించనున్నట్టుగా వెల్లడించారు. డిజిటల్ రూపీ విడుదలతో ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహం అందుతుందన్నారు. దీనిని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) అని పిలవనున్నారు. ప్రస్తుతం దేశంలో చెలామణీలో ఉన్న భౌతిక కరెన్సీతో పాటే డిజిటల్ కరెన్సీ కొనసాగనుంది.