Union Budget 2022 Highlights: నిర్మలమ్మ చెప్పిన 8 కీలక విషయాలివే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ప్రసంగించారు. సుమారు గంటన్నరపాటు ఆమె చేసిన ప్రసంగంలో కీలక అంశాలను ప్రస్తావించారు. మూల ధన వ్యయం మొదలు, పీఎం గతి శక్తి ప్లాన్, రక్షణ రంగంలో మార్పులు, డిజిటల్ రూపీని విడుదల చేయడం వంటి ముఖ్యమైన ప్రకటనలు చేశారు. ఆమె ప్రసంగంలోని ఎనిమిది ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పార్లమెంటులో బడ్జెట్(Union Budget 2022) ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఈ రోజు బడ్జెట్ ప్రసంగాన్ని(Budget Speech) ఇచ్చారు. సుమారు గంటన్నరపాటు ఆమె ప్రసంగించారు. ఆమె తన బడ్జెట్ ప్రసంగాన్ని అమృత్ కాలం చుట్టూ అల్లుకున్నారు. అంటే వచ్చే 25 ఏళ్లలో భారత్ ఎలా అభివృద్ధి చెందనుంది? అనే కోణంలో ఆమె మాట్లాడారు. మొత్తంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగంలో ఎనిమిది కీలక విషయాలను(Key Points) పరిశీలిద్దాం.
1. మూల ధన వ్యయాన్ని భారీగా పెంచారు. 35.4 శాతం మేర మూల ధన వ్యయాన్ని పెంచుతున్నట్టు ఆమె ప్రకటించారు. గత బడ్జెట్‌లో మూల ధన వ్యయం రూ. 4.54 లక్షల కోట్లు ఉండగా, ఈ సారి ఈ మూల ధన వ్యయాన్ని రూ. 7.50 లక్షల కోట్లకు పెంచారు. ఇది ఆశాజనకమైన నిర్ణయం. కానీ, ఈ ధనాన్ని ఎలా.. ఏ మార్గాల్లో ఖర్చు చేయనున్నారనే విషయంపై స్పష్టత లేదు.
2. నిర్మలా సీతారామన్ ప్రసంగంలో తొలి అర్థభాగం పీఎం గతి శక్తి ప్లాన్ చుట్టే ఉన్నది. ఈ ప్లాన్ ప్రాముఖ్యతను ఆమె ప్రధానంగా మాట్లాడారు. ఈ ప్లాన్‌కు ఏడు గ్రోత్ ఇంజిన్లు ఉన్నాయని పేర్కొన్నారు. అవి రోడ్లు, రైల్వే, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, మాస్ ట్రాన్స్‌పోర్ట్, వాటర్‌వేస్, లాజిస్టిక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లు ఏడు ఇంజిన్‌లుగా కేంద్రం తెలిపింది. జాతీయ రహదారి నెట్‌వర్క్‌ను పీఎం గతి శక్తి ప్లాన్ కింద మరో 25వేల కిలోమీటర్లు పెంచనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు.
3. ఎంఎస్ఎంఈల కోసం ప్రకటించిన ఈసీఎల్‌జీఎస్‌పై కేంద్ర మంత్రి మాట్లాడారు. ఈ స్కీమ్‌ను వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించారు. అంతేకాదు, ఈ పథకం కోసం మరో రూ. 50 వేల కోట్లను జోడించినట్టు వివరించారు. దీంతో ఈ పథకం కింద మొత్తం కవర్ రూ. 5 లక్షల కోట్లుగా మారింది.
4 క్రిప్టో ట్యాక్స్ నిర్ణయాన్ని ఆమె పేర్కొన్నారు. ఎలాంటి వర్చువల్ డిజిటల్ అసెట్ సంపదను ట్రాన్స్‌ఫర్ చేసినా దానిపై 30 శాతం పన్ను విధించబోతున్నట్టు తెలిపారు. నిర్దేశిత మానిటరీ త్రెషోల్డ్ దగ్గర టీడీఎస్‌ను ఒక శాతంగా ప్రకటించారు.
5. స్పెషల్ ఎకనామిక్ జోన్ చట్టాన్ని మార్చబోతున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. దీని స్థానంలో కొత్త సెజ్ చట్టాన్ని భర్తీ చేయనున్నట్టు వివరించారు. ఎగుమతుల్లో పోటీని పెంచడానికి అన్ని పెద్ద, కొత్త పరిశ్రమలు ఈ చట్టం కిందకు రాబోతున్నాయని తెలిపారు.
6. కాగా, డిజిటల్ కరెన్సీపై కీలక ప్రకటన చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రూపీని ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.
7. రక్షణ రంగానికి చెందిన కొనుగోళ్లు 68 శాతం దేశీయంగానే చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తద్వార మేక్ ఇన్ ఇండియాకు సముచిత ప్రాధాన్యతను ఇచ్చారు. డిఫెన్స్ ఆర్ అండ్ డీని పెద్ద పరిశ్రమలు, స్టార్టప్‌లు, అకడమిక్ సంస్థలకూ అందుబాటులోకి తెస్తామని, ఇందుకోసం రక్షణ రంగానికి కేటాయించిన దానిలో 25 శాతం మొత్తం ఖర్చు పెడతామని వివరించారు.
8. ప్రతి ఇంటికి నీటి కుళాయి ద్వారా నీరు అందించే ప్రాజెక్టుపైనా కేంద్ర మంత్రి మాట్లాడారు. హర్ ఘర్ నల్ సే జల్ పథకం కవరేజీ ఇప్పుడు 8.7 కోట్ల కుటుంబాలుగా ఉన్నది. ఇందులో 5.5 కోట్ల కుటుంబాలకు నీటి కుళాయి ద్వారా నీటిని అందించడం గత రెండేళ్లలో పూర్తయిందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ పథకం కోసం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 60 వేల కోట్లను కేటాయించినట్టు వివరించారు. పీఎం హౌజింగ్ స్కీమ్ కోసం వచ్చే ఆర్థిక సంవత్సారినికి గాను రూ. 48 వేల కోట్లను కేటాయిస్తున్నట్టు చెప్పారు.