Asianet News TeluguAsianet News Telugu

పవర్ ‘ఫేవరేట్’కా సాల్.. బట్ రీకాల్’ఓసవాల్!!


దేశీయంగా వాహనాల రంగం విద్యుత్ వినియోగం దిశగా శుభారంభాన్నిచ్చింది. రెండేళ్ల క్రితం నోట్ల రద్దు.. ఆపై జీఎస్టీతో సతమతమైన ఆటోమొబైల్.. ఈ ఏడాది కాస్త గాడిలో పడ్డా టెక్నికల్ పొరపాట్లతో రీకాల్స్ పలు ఆటోమొబైల్ సంస్థలకు ఇబ్బందులు తెచ్చి పెట్టాయి. పెట్రోల్ ధరలు, రూపాయి మారకం విలువ తగ్గుదలతో ఏడాది చివరిలో వాహనాల విక్రయం తగ్గుముఖం పట్టింది. 

Year 2018 in review: Auto industry shows mixed trends
Author
New Delhi, First Published Dec 29, 2018, 11:08 AM IST

న్యూఢిల్లీ: దేశీయంగా ఆటోమొబైల్ రంగం ఈ ఏడాది పలు ఒడిదొడుకులకు గురైంది. 2016లో నోట్ల రద్దు, జీఎస్టీతో పన్ను రేట్ల పెంపుతో ఇబ్బందుల పాలై 2017లో కాస్త సాఫీగా అడుగులేసిన ఆటోమొబైల్ రంగం 2018లోనూ అదే ధోరణిని కొనసాగించింది. ఈ ఏడాది విద్యుత్‌ వాహనాలకు మంచి ఊతం లభించడం శుభపరిణామంగా చెప్పాలి. కాకపోతే ఎక్కువ స్వయం కృతాపరాధాలతో ఎడతెగని ‘రీకాల్స్’తో ఆటోమొబైల్ కంపెనీలు ఇబ్బందుల పాలయ్యాయయన్నఅభిప్రాయం సర్వత్రా వినిపించింది. 

2018లో కొత్త వాహన మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తాయి. కొన్ని ప్రతిష్ఠాత్మక మోడల్ వాహనాలు కూడా ఈ ఏడాదిలోనే కనుమరుగయ్యాయి కూడా. ముఖ్యంగా దాదాపు 20 ఏళ్ల తర్వాత టాటా మోటార్స్‌ తన ఇండికా కారు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ఈ ఏడాదే ప్రకటించింది. భారత్‌లోనే డిజైన్‌ చేసి అభివృద్ధి చేసిన తొలి మోడల్‌ ఇది. 

ఇలా ఉత్పత్తి నిలిపివేసిన పలు మోడళ్లలో టాటా ఇండిగో, మహీంద్రా వెరిటో, వెరిటో వైబ్‌, మహీంద్రా నువోస్పోర్ట్‌, హోండా బ్రయో, ఫోక్స్‌వ్యాగన్‌ జెట్టా, ఫోక్స్‌వ్యాగన్‌ బీటెల్‌, సాంగ్‌యాంగ్‌ రెక్స్‌టన్‌, హ్యుండాయ్‌ ఇయాన్‌ కూడా ఉన్నాయి.

రీకాల్స్‌ అంశంలో ఆటోమొబైల్ రంగం పరిస్థితి అధ్వానంగానే సాగింది. ఏడాది పొడవునా 2.5 లక్షల వాహనాలను కార్లు, బైక్‌ల తయారీ కంపెనీలు రీ కాల్ చేశాయి. ఇది క్రితం ఏడాదితో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. రీ కాల్ విషయంలో తొలి మూడు నెలల్లోనే 2017 మార్కును అధిగమించాయి. 

మారుతీ, హోండా, మెర్సిడెజ్‌, ఫోక్స్‌వ్యాగన్‌తో పాటు హోండా మోటార్‌ సైకిల్‌, కవాసాకి వంటి ద్విచక్ర వాహన సంస్థలూ చిన్న చిన్న పొరపాట్లతో తమ వాహనాలను ఈ ఏడాది రీ కాల్ చేశాయి. ప్రభుత్వం ఈ విషయంలో ఇంకా ఒక విధానాన్ని తేకపోవడం గమనార్హం. ఇలా తయారీలోనే తప్పు చేసిన తయారీదార్లపై అపరాధ రుసుము విధించే ప్రతిపాదనేదీ రాకపోవడం కూడా గమనార్హం.

దేశీయంగా  వాహన విక్రయాల్లో ఈ ఏడాది ఏప్రిల్‌-నవంబర్ అన్ని విభాగాల్లోనే అత్యధిక వృద్ధిని నమోదు చేయడం విశేషం. ముఖ్యంగా వాణిజ్య వాహనాల్లో 31.49%; త్రిచక్ర వాహనాల్లో 25.16% చొప్పున వృద్ధి నమోదైంది. ఎగుమతులు సైతం ఏప్రిల్‌-నవంబర్ నెల మధ్య 20.78 శాతం మేర వృద్ధి చెందడం గమనార్హం. 

ఈ ఏడాది ఫేమ్‌ పథకం కింద విద్యుత్‌ వాహనాలను ప్రారంభించడానికి 11 నగరాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. అంతే కాదు ఈ రంగంలో పనిచేసే స్టార్టప్‌లకు ఒక ఇంక్యుబేషన్‌ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయనుంది.

ఈ ఏడాది వాహన పరిశ్రమలో విక్రయాలు మెరుగ్గా ఉండటానికి కొత్త మోడల్ వాహనాలు, పంటలకు కనీస మద్దతు ధరలు, రైతు రుణ మాఫీ హామీ వంటి అంశాలు దోహద పడ్డాయి. కానీ  పెరిగిన పెట్రో ధరలు మాత్రం స్పీడ్‌ బ్రేకర్లుగా పనిచేశాయి. ఏడాది చివర్లో వడ్డీ రేట్లు, బీమా వ్యయాలు కూడా వినియోగదార్ల సెంటిమెంట్‌ను ఇబ్బంది పెట్టాయి. 

ఇక త్వరలో అమలయ్యే బీఎస్‌-6 ప్రమాణాలను పాటించడానికి, విద్యుత్‌ వాహనాల కోసం కంపెనీలు ఈ ఏడాది వ్యయాలు బాగానే చేశాయి. వచ్చే ఏడాదీ ఇవి కొనసాగవచ్చు. మరోవైపు ఢిల్లీలో 15 ఏళ్ల నాటి పెట్రోల్, 10 ఏళ్ల నాటి డీజిల్‌ వాహనాలపై సుప్రీం కోర్టు నిషేధం విధిస్తూ గత అక్టోబర్ నెలలో తీర్పు చెప్పింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును సమర్థించింది. 

దాదాపు 80 శాతం కాలుష్యం, ప్రమాదాలు 15 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వాహనాల వల్లే జరుగుతోందని ఒక నివేదిక స్పష్టం చేసిన తరుణంలో పాత వాహనాలను తుక్కు కిందకు మార్చడానికి ప్రోత్సాహకాలు ఇస్తే బాగుంటుందని, అమలు త్వరగా జరుగుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ప్యాసింజర్ కార్లపై పలు పన్ను రేట్లను తొలగించాలని కోరుకుంటున్నాయి.  విద్యుత్‌ వాహనాలకు ప్రత్యేక రేటును నిర్ణయించాలని అంటున్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios