న్యూఢిల్లీ: దేశంలో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్నది. ముఖ్యంగా మెట్రో పాలిటన్ నగరాల్లో పరిస్థితులు మరింత విషమిస్తున్నాయి. గతేడాదిలో ప్రపంచంలోని పది అత్యంత కలుషిత నగరాల్లో ఏడు మనదేశంలోనే ఉన్నాయని తేల్చిచెప్పిన ఓ నివేదికే దీనికి నిదర్శనం. కాలుష్యం కట్టడికి పర్యావరణవేత్తలు, సామాజిక కార్యకర్తల నుంచి వస్తున్న ఒత్తిడితో ప్రభుత్వాలు అరకొర చర్యలు తీసుకుంటున్నా అవి పూర్తిస్థాయి ఫలితాలనివ్వడం లేదు.

ఈ ఒత్తిడిని అధిగమించేందుకే మోడీ సర్కార్..  పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు బదులు విద్యుత్ వాహనాలను వినియోగించాలని సూచిస్తున్నది. తయారీదారులపై ఒత్తిడి పెంచుతున్నది. పెద్ద ఎత్తున మార్కెట్లోకి వచ్చే లిథియం అయాన్‌ బ్యాటరీలు, జీవితకాలం ముగిసిన లెడ్‌ యాసిడ్‌ ఘటాలను సరైన పద్ధతుల్లో హ్యాండిల్‌ చేయడానికి మనం సంసిద్ధులుగా ఉన్నామా? లాంటి ప్రశ్నలు ఈ నిర్ణయంతో ఉదయిస్తున్నాయి. 

ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఏర్పాటయ్యే చార్జింగ్‌ వ్యవస్థ కూడా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ వైపే చూసే అవకాశమున్నప్పుడు వీటితో కాలుష్య నియంత్రణ సాధ్యమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మనదేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీలను ప్రామాణికంగా తీసుకున్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనే వారికి ఆదాయంపన్ను మినహాయించబోతున్నట్టు తెలిపారు. వాటిపై జీఎస్టీని 12శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించనున్నట్టు చెప్పారు. విద్యుత్ వాహనాల వినియోగం పెంచేందుకే మోడీ సర్కార్ ఈ నిర్ణయాలు తీసుకున్నదన్న విషయం స్పష్టంగా కానవస్తున్నది.

కానీ, ఎలక్ట్రిక్‌ వాహనాలు దేశం ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యను నియంత్రిస్తాయా? అన్న ప్రశ్నకు జవాబు మాత్రం అస్పష్టంగానే ఉంది. ఇందుకోసం మన దేశంలో ఇంధన వినియోగంపై ఎలాంటి భావి ప్రణాళికలు వేసిందో చూడాల్సిందే. దేశ అవసరాల కోసం బొగ్గు ఆధారిత విద్యుచ్ఛక్తి ప్రస్తుతం (47శాతం) కంటే 2030నాటికి అధికంగా (51శాతం) పెరుగుతుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది.

2047నాటికి థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల ఉత్పత్తి రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక అంచనా. వాయు కాలుష్యానికి బొగ్గు వినియోగం ప్రధాన కారకంగా ఉంది. కాగా, భవిష్యత్‌లో పరిశ్రమలకు బొగ్గు ఆధారిత విద్యుచ్ఛక్తి ప్రధానపాత్ర పోషించనుంది. భారీ స్థాయిలో పెరగనున్న విద్యుత్ వాహనాలకు అదేస్థాయిలో చార్జింగ్‌ అందించే వ్యవస్థ కూడా థర్మల్‌ పవర్‌ ప్లాంట్లపైనే ఆధారపడే అవకాశం ఉన్నదని నిపుణులు చెబుతున్నారు.

రోడ్డుపై నేరుగా కాలుష్యం విడుదల చేయని ఎలక్ట్రిక్‌ వాహనాలూ వాటి చార్జింగ్‌ కోసం పరోక్షంగా బొగ్గు (థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు‌) పైనే ఆధారపడనున్నాయని చెబుతున్నారు. భారత ఇంధనవనరుగా బొగ్గు వాటా పెరుగుతున్న నేపథ్యంలో కేవలం ఎలక్ట్రిక్‌ వాహనాలతో కాలుష్యం కట్టడి అవుతుందనుకోవడం అసంబద్ధమని వివరిస్తున్నారు.

2001ఇండియాస్‌ బ్యాటరీస్ ‌(మేనేజ్‌మెంట్‌, హ్యాండ్లింగ్‌) రూల్స్‌ లెడ్‌ యాసిడ్‌ బ్యాటరీలకే పరిమితం అయ్యాయి. లిథియం అయాన్‌ బ్యాటరీల రీసైక్లింగ్‌పై ప్రస్తుతం ఎలాంటి చట్టాల్లేవు. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డూ ఈ సంగతి గుర్తించింది. వీటి రీసైక్లింగ్‌పై అసంఘటిత రంగమూ ఆసక్తి చూపడం లేదు. 

ఎందుకంటే లిథియమ్‌ అయాన్‌ బ్యాటరీల రీసైక్లింగ్‌తో విలువైన లోహాలు లభించవు. ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్‌ వృద్ధితోనే రీసైక్లింగ్‌ వ్యవస్థ మెరుగవుతుందని కొందరు ఆశావాద దృక్పథం వ్యక్తం చేస్తున్నారు. కానీ, అభివృద్ధి చెందిన యూరప్ దేశాలూ ఇప్పటికే లిథియం అయాన్‌ బ్యాటరీ వ్యర్థాలతో సతమతం అవుతున్నాయి. ఈ బ్యాటరీల నుంచి కేవలం 5శాతం లిథియం మాత్రమే ఆ దేశాల్లో రికవరైనట్టు ఒక రిపోర్టులో తేలింది.