Asianet News TeluguAsianet News Telugu

టెక్నాలజీ పెరిగినా డబుల్ వెహికల్స్ రీకాల్

టెక్నాలజీ పెరిగినా సాంకేతిక లోపాల వల్ల గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వాహనాల రీకాల్ రెట్టింపైంది. గతేడాది 80,531 వాహనాలను రీకాల్ చేస్తే, ఈ ఏడాది ఇప్పటివరకు 1,62,869 రీకాల్ చేసుకున్నాయి.

Vehicle recall doubles in 2018; faulty software emerge as major contributor
Author
New Delhi, First Published Dec 20, 2018, 12:16 PM IST

న్యూఢిల్లీ: వాహన చోదకుల భద్రత రీత్యా 2017తో పోలిస్తే 2018లో వెహికల్ రీకాల్స్ రెట్టింపైంది. అయితే సాఫ్ట్ వేర్, ఎలక్ట్రానిక్ కంటెంట్‌ల్లో లోపాల వల్లే ఆయా ఆటోమొబైల్ సంస్థలు తమ వాహనాలను రీకాల్ చేస్తున్నాయి. వ్యయం ఒత్తిళ్లను అధిగమించేందుకు పలు వాహనాల తయారీలో ఒకే సాఫ్ట్‌వేర్, ఎలక్ట్రానిక్ కంటెంట్ వాడటమే దీనికి కారణమని తెలుస్తోంది. 

ఈ ఏడాది నాలుగు చక్రాల వాహనాలు, ద్విచక్ర వాహనాలు కలిపి 1,62,869 వాహనాలను ఆయా సంస్థలు రీకాల్ చేశాయి. 2017లో కేవలం 80,531 వాహనాలను మాత్రమే రీకాల్ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేట్ రేటింగ్స్ సంస్థ ‘ఇక్రా’ వైస్ ప్రెసిడెంట్ షంషీర్ డెవాన్ మాట్లాడుతూ ‘మొత్తం వెహికల్స్‌లో సుసంపన్న ఫీచర్లు ఏర్పాటు చేశారు. వాహనాల సేఫ్టీ భాగాల్లో ఎలక్ట్రానిక్ వాటా పెరుగుతోంది. కొన్నిసార్లు రియల్ లైఫ్ డ్రైవింగ్ కండీషన్లు మినహా పొరపాట్లు జరుగుతుంటాయి’ అని పేర్కొన్నారు. 

మెరుగైన ఇంధన వినియోగ సామర్థ్యం గల సమర్థవంతమైన వాహనాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్నదని, పొరపాట్ల రహితంగా కార్లను తయారు చేయడం ఆటోమొబైల్ సంస్థలకు కష్టంగానూ, పరీక్షగానూ మిగిలిందని ఆటోమొబైల్ పారిశ్రామిక నిపుణులు అంటున్నారు. వాహనాలను రీకాల్ చేసిన సంస్థల్లో ‘హోండా కార్స్’ మొదటి స్థానంలో నిలుస్తుంది. 

హోండా కార్స్ ఇండియా ఈ ఏడాది రెండుసార్లు కలిపి 30,124 వాహనాలను రీకాల్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో అకార్ట్, సిటీ, జాజ్ మోడల్ కార్ల ఎయిర్ బ్యాగ్‌ల్లో లోపాల వల్ల 22, 834 కార్లు రీకాల్ చేసింది. ఈపీఎస్ ప్రివెంటివ్ ఇన్స్‌పెక్షన్ సమస్యతో నూతనంగా ఆవిష్కరించిన జూలైలో 7,290 అమేజ్ కంపాక్ట్ సెడాన్ మోడల్ కార్లను రీకాల్ చేసింది. 

తర్వాతీ స్థానంలో విలాస కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ వివిధ రకాల మోడల్ కార్లు 22,579 యూనిట్లు రీకాల్ చేసింది. మార్చి నుంచి జూన్ వరకు స్టీరింగ్ కాలం సరిగ్గా లేకపోవడమే దీనికి కారణం. మరో జర్మనీ విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ 16,350 కార్లు వెనక్కు పిలిచింది. ఇందులో ఉత్పాదక ప్రక్రియలోనే లోపం ఉండటంతో రీ కాల్ చేసింది బీఎండబ్ల్యూ. 

మరోవైపు వోక్స్ వ్యాగన్ గ్రూప్ కూడా ఆడి ఎ4 మోడల్ కార్లు 15,812తపాటు మొత్తం 16,113 కార్లు రీ కాల్ చేసింది. ఎయిర్ కండీషనర్‌లో యాగ్జిలరీ హీటర్ ఫెయిలైన కారణంతో ఆ కార్లను మార్కెట్ నుంచి ఉపసంహరించింది. 

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐ) సియాజ్ మోడల్ కార్లు 880తోపాటు మొత్తం 2,799 కార్లను రీ కాల్ చేసింది. సియాజ్ మోడల్ కారులో స్పీడో మీటర్ రీప్లేస్ చేయాల్సి వచ్చింది. స్విఫ్ట్‌కు చెందిన 566, డిజైర్‌కు చెందిన 713 యూనిట్లలో ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్ యూనిట్ (ఏసీయూ) సరిగ్గా పని చేయకపోగా, కొన్ని యూనిట్లు ఉత్పత్తి సమయంలోనే దెబ్బతినడంతో రీకాల్ చేసింది. సూపర్ క్యారీ మోడల్ కార్లలో ఫ్యూయల్ పంపు లీకేజీ వల్ల సమస్యలు తలెత్తడంతో 640 కార్లను ఉపసంహరించుకున్నది. ఇక ఫోర్డ్ ఇండియా 7,249 కార్లు, టయోటా కిర్లోస్కర్ 9,329 కార్లను రీకాల్ చేశాయి. 

మోటారు సైకిళ్లలోనూ భారీ స్థాయిలో వెహికల్స్ రీకాల్ అయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 56,721 బైక్ లను ఆయా సంస్థలు రీకాల్ చేశాయి. 56,267 బైక్‌లతో హోండా మోటార్ సైకిళ్లు రీకాల్ చేసింది. సుజుకి మోటారు సైకిల్స్ 113 బైకులను వెనక్కు పిలిచింది. కవాసాకి 140, ట్రైయంప్ 201 బైక్ లను ఉపసంహరించుకున్నది. 

భారతీయ ఆటోమొబైల్ సంస్థలు స్వచ్ఛందంగా వాహనాల రీకాల్ పాలసీ అమలు చస్తున్నాయి. ఈ పాలసీ అమలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి 28 లక్షల వాహనాలను ఆయా సంస్థలు రీకాల్ చేశాయి. 2015లో 10,00,467 యూనిట్లు, 2016లో 8,42,909 వాహనాలను రీ కాల్ చేశాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios