దేశీయ ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మార్కెట్లోకి విద్యుత్ వర్షన్ వాగన్ఆర్ మోడల్ కారును తీసుకొస్తున్నది. అదీ కూడా అతి తక్కువ ధరకే వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీని ధర కొనుగోలు దారులకు ఆకర్షణీయంగా రూ.7 లక్షల్లోపు ఉంటుందని అంచనా. 

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఫేమ్’ పథకం కింద విద్యుత్ లేదా హైబ్రీడ్ వాహనాలకు లభించే అన్ని డిస్కౌంట్లు, రాయితీలు, సబ్సిడీలు కలుపుకుని ఈ ధరను నిర్ణయించినట్లు మారుతి సుజుకి తెలిపింది.

ప్రస్తుతం వాగన్ఆర్ మోడల్ విద్యుత్ వర్షన్ కారుకు వివిధ రకాల టెస్టులు జరుగుతున్నాయి. ప్రస్తుత స్ట్రక్చర్ ప్రకారం కారు వాగన్ఆర్ విద్యుత్ వినియోగ కారుపై సుమారు రూ.1.3 లక్షల సబ్సిడీ లభిస్తుందని.. ఇటీవల కేంద్రం ప్రకటించిన ‘ఫేమ్2’ పథకంలో భాగంగా అది మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. 

సింగిల్ చార్జింగ్‌తోనే 200 కి.మీ. వరకు మారుతి సుజుకి వాగన్ ఆర్ కారుతో ప్రయాణం చేయవచ్చునని భావిస్తున్నారు. విద్యుత్ చార్జింగ్ కెపాసిటీ మారుతి సుజుకి వాగన్ఆర్ మోడల్ కారుకు కీలకం కానున్నది. కస్టమర్ల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్‌కు అనుగుణంగా రిలయబుల్, సూటబుల్ విద్యుత్ వర్షన్ మోడల్ కారును తయారు చేస్తున్నది మారుతి సుజుకి.

జపాన్‌లో ఇప్పటికే విక్రయిస్తున్న మారుతి వాగన్ఆర్ విద్యుత్ కారు తరహా మాదిరిగా భారత్ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ప్రొటోటైప్ ఎలక్ట్రిక్ వాహనాలను డెవలప్ చేస్తున్నారు. గుర్‌గ్రామ్ మారుతి సుజుకి ప్లాంట్‌లో ప్రస్తుతం వాగన్ఆర్ విద్యుత్ వర్షన్ కారు తయారవుతోంది. 

విద్యుత్ వర్షన్ వాగన్ఆర్ కారులో టాప్ మౌంటెడ్ వైండ్ షీల్డ్ వైపర్, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాడ్జి, డ్యుయల్ స్టైల్ హెడ్ ల్యాంప్స్, లాట్ బాక్సియర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. వాగన్ ఆర్ విద్యుత్ వర్షన్ కారులో వినియోగించే లీథియం బ్యాక్టరీని టయోటా, తోషిబా సహకారంతో అభివ్రుద్ధి చేస్తోంది మారుతి సుజుకి.