గ్రోత్ 10-12% లక్ష్యం: జూన్ కల్లా మార్కెట్లోకి 6 ట్రయంప్ బైక్‌లు
బ్రిటిష్ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘ట్రయంఫ్’ వచ్చే జూన్ నెలాఖరులోగా ఆరు నూతన మోడల్ బైక్‌లను భారతదేశంలో ఆవిష్కరించనున్నది. ఏటా 10- 12 శాతం వ్రుద్ధిరేటు సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపింది.
భారతదేశంలో సేవలు ప్రారంభించి ఐదేళ్లు పూర్తి చేసుకున్న బ్రిటిష్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ‘ట్రయంఫ్ మోటార్ సైకిల్స్’ ఏటా 10-12 శాతం వ్రుద్ధి రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
వచ్చే ఏడాది జూన్ నెలలోగా భారతదేశ మార్కెట్లోకి ఆరు నూతన మోడల్ బైక్‌లను ఆవిష్కరించనున్నది. ట్రయంఫ్ సంస్థకు భారత్ మార్కెట్ చాలా కీలకం అని పేర్కొంది. దేశవ్యాప్తంగా రూ. 7.7 - 22 లక్షల మధ్య విలువ గల వివిధ వేరియంట్లతో కూడిన బైక్‌లను విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఏటా 10-12 % గ్రోథ్ లక్ష్యమన్న ట్రయంఫ్ మోటార్ సైకిల్స్
ప్రతి ఏటా 10 -12 శాతం ప్రగతి తమ లక్ష్యమని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా జనరల్ మేనేజర్ షోయబ్ ఫరూక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భారతదేశంలో తమ మార్కెట్ పట్ల పాజిటివ్ ఔట్ లుక్ తో ఉన్నామని చెప్పారు. విడుదల చేయనున్న కొత్త మోడళ్లలో మిక్సింగ్, నూతన మోడల్స్ ఉంటాయన్నారు.
ఇక సేల్స్ నెట్ వర్క్ పరిధిలో ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16 మంది డీలర్లు ఉన్నారు. వచ్చే మూడు, నాలుగేళ్లలో 25 డీలర్ షిప్‌లకు పెంచుకోవాలన్నది తమ లక్ష్యమని షోయబ్ ఫరూక్ తెలిపారు. గత ఐదేళ్లలో అసాధారణ స్థాయిలో గ్రోత్ సాధించామన్నారు. చిన్న పట్టణాల్లోకి తాము విస్తరించాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.
చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు డీఎల్ఎఫ్, ఏబీబీ, డెల్టాతో ఈవీ మోటార్స్ టైఅప్
దేశవ్యాప్తంగా 6500 ఎలక్ర్టిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి ఈవీ మోటార్స్ సంస్థ డీఎల్‌ఎఫ్, ఏబీబీ ఇండియా, డెల్టా ఎలక్ర్టానిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నది. ఈ స్టేషన్ల ఏర్పాటు కోసం ఆ కంపెనీలు 20 కోట్ల డాలర్లు (రూ.1400 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తాయి.
ప్లగ్ ఎన్ గో పేరిట ఈ చార్జింగ్ స్టేషన్లను వచ్చే ఏడాది లోగా న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, చండీగఢ్, జైపూర్, అహ్మదాబాద్ సహా అన్ని ప్రధాన నగరాల్లోనూ వ్యాపార, నివాస సముదాయాల సమీపంలో ఏర్పాటు చేస్తామని, వాటిని తమ క్లౌడ్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానం చేస్తామని ఇవి మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ బన్సాల్ తెలిపారు.
సమన్వయంతో ముందుకెళితేనే విద్యుత్ వాహన చార్జింగ్‌లో ముందడుగు
వాటిలో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు వంటి వివిధ శ్రేణి వాహనాలకు అవసరమైన చార్జింగ్ పరికరాలు ఉంటాయని, నిరంతర సర్వీసింగ్, మెయింటెనెన్స్ మద్దతు, రిమోట్ మానిటరింగ్, ఇ-పేమెంట్ వంటి వివిధ ఆధునిక వసతులు అందుబాటులో ఉంటాయని ఇవి మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ వినీత్ బన్సాల్ చెప్పారు.
సమీప భవిష్యత్‌లో భారీ సంఖ్యలో ఎలక్ర్టానిక్ వాహనాలు మార్కెట్‌లోకి రానున్న నేపథ్యంలో ఎలక్ర్టిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థిరాస్తి వ్యాపారాలు, వాహనాల ఓఈఎం తయారీదారులు, చార్జర్ల తయారీదారుల సమన్వయ కృషి అవసరమని ఆయన అన్నారు.