న్యూఢిల్లీ: నెల వారీ చెల్లింపులు.. దానికి ముందు డౌన్‌ పేమెంట్ లేకుండా నచ్చిన కారు నడిపే వెసులుబాటు!! అదీ కేవలం నెలవారీ అద్దె చెల్లిస్తూ నడుపుకోవచ్చు. దాని నిర్వహణ, బీమా వంటి ఖర్చుల భారం కూడా సదరు కార్ల తయారీ సంస్థలే చూసుకుంటాయి. ఇది చాలామందిని ఆకర్షించే.. నచ్చే వార్తే. 

ఇలాంటి వారిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు కార్లు, ప్రత్యేకించి ప్రయాణ వాహనాల తయారీ సంస్థలు.. కార్ల లీజింగ్‌ వ్యాపారంలోకి ఎంటర్ అవుతున్నాయి. కార్ల విక్రయాలు తగ్గుతున్న నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకోవటానికి కార్ల తయారీ సంస్థలు లీజు రూట్ ఎంచుకుంటున్నాయి.  

లీజు వల్ల కస్టమర్‌పై ముందస్తు అంటే డౌన్‌ పేమెంట్ చెల్లింపు భారం ఉండదు. బీమా, రోడ్‌ ట్యాక్స్, యాక్సిడెంటల్‌ రిపేర్లు, మెయింటెనెన్స్‌ అంతా కార్ల కంపెనే చూసుకుంటుంది. ఓ ఐదేళ్లు నెలవారీ కంపెనీ నిర్దేశించిన సొమ్ము చెల్లిస్తే చాలు. ఐదేళ్ల తరువాత వాహనాన్ని తిరిగి కంపెనీకి అప్పగించాలి సుమా. అంతే!!. 

కాల పరిమితి, ఈఎంఐ మొత్తం అనేవి మోడల్‌ను బట్టి మారుతాయి. ఈ విధానంలో కంపెనీలు కనీసం 2 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు కార్లను లీజుకు ఇస్తున్నాయి. అంతే కాదు సదరు మోడల్ కారు లీజు పూర్తి కాకముందే కస్టమర్‌ మరో మోడల్‌కు అప్‌గ్రేడ్‌ కావొచ్చు కూడా!!. 

వినియోగదారుడు తనకు నచ్చిన మోడళ్లను తరచూ మార్చుకునేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని వరుణ్‌ మోటార్స్‌ ఎండీ వరుణ్‌ దేవ్‌ చెప్పారు. లీజు విధానం ఇప్పుడిప్పుడే ప్రాచుర్యంలోకి వస్తోందన్నారు. 

దేశీయంగా 2018–19లో కంపెనీలన్నీ 33,77,436 ప్యాసింజర్‌ వెహికిల్స్‌ విక్రయించాయి. అంతకు ముందటేడాదితో పోలిస్తే వృద్ధి రేటు 2.7 శాతమే. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–మే నెలలో విక్రయాలు ఏకంగా 19 శాతం పడిపోయాయి. 

కార్ల విక్రయాలు పడిపోవడానికి బలహీన సెంటిమెంట్,  వాహన ధరలు పెరగడం, ఆర్జించే వ్యక్తులపై పన్ను భారం వంటివి దీనికి కారణాలుగా చెప్పొచ్చు. మరోవైపు ఉబెర్, ఓలా వంటి రైడ్‌ షేరింగ్‌ కంపెనీల కార్యకలాపాలు ద్వితీయ శ్రేణి నగరాలకూ విస్తరిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో అమ్మకాలు పెంచుకోవటానికి కంపెనీలు అన్ని మార్గాలనూ అన్వేషిస్తున్నాయి. ఇందులో లీజింగ్‌ ఒకటి. కార్పొరేట్‌ క్లయింట్లకు లీజుపై వాహనాలను దాదాపు అన్ని కంపెనీలు ఇస్తున్నాయి. ఈ మధ్య రిటైల్‌ కస్టమర్లకూ ఈ సేవలను విస్తరించాయి. 

ఓరిక్స్‌ ఆటో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఎల్‌డీ ఆటోమోటివ్, రెవ్‌ కార్స్‌ వంటి లీజింగ్‌ కంపెనీల భాగస్వామ్యంతో హ్యుండాయ్, మహీంద్రా అండ్‌ మహీంద్రా, స్కోడా, ఎఫ్‌సీఏ ఇండియా ప్రస్తుతం ఈ రంగంలోకి వచ్చాయి. మారుతీ, టాటా వంటి సంస్థలూ త్వరలో వస్తామనే సంకేతాలిస్తున్నాయి. 

‘లీజింగ్‌ విధానం మంచిదే. మార్కెట్‌ తీరుతెన్నులను గమనిస్తున్నాం’ అని మారుతి సుజుకి మార్కెటింగ్, సేల్స్‌ ఈడీ శశాంక్‌ శ్రీవాస్తవ చెప్పారు. ఉద్యోగులు, వృత్తి నిపుణులు, చిన్న, మధ్య తరహా కంపెనీలు కార్లను లీజుకు తీసుకోవచ్చు. నగరం, వాహనం మోడల్, కాల పరిమితిని బట్టి నెలవారీ లీజు మొత్తం మారుతుంది.

ఐదేళ్ల కాల పరిమితిపై హ్యుండాయ్‌ శాంత్రో బేసిక్‌ మోడల్‌ కారు నెలవారీ అద్దె సుమారు రూ.7,670 ఉంది. క్రెటాకు రూ.17,640 చార్జీ చేస్తారు. ఇదే వర్షన్‌ క్రెటా కొనాలంటే డౌన్‌ పేమెంట్‌ రూ.2.7 లక్షలిచ్చాక, ఈఎంఐ రూ.18,900 దాకా చెల్లించాల్సి ఉంటుంది. 

మహీంద్రా కేయూవీ100ఎన్‌ఎక్స్‌టీ అద్దె రూ.13,499, ఎక్స్‌యూవీ500 రూ.32,999లుగా నిర్ణయించారు. స్కోడా మోడల్‌ ప్రారంభ అద్దె రూ.19,856. ప్రస్తుతం సూపర్బ్‌ మోడల్‌ మాత్రమే ఈజీ బై కింద అందుబాటులో ఉందని స్కోడా తెలిపింది. ఫియట్, జీప్‌ మోడళ్లను ఎఫ్‌సీఏ ఇండియా లీజు కింద ఆఫర్‌ చేస్తోంది. 

ఇంకా టూ వీలర్ స్పేస్‌లోనూ అథర్ ఎనర్జీ సంస్థ ప్రీమియం, బ్యాటరీ- పవర్డ్ స్కూటర్ ఆథర్ 450పై నెల వారీగా రూ.2500 అద్దె వసూలు చేస్తుంది. అంతేకాదు మూడేళ్ల గడువు పూర్తయిన తర్వాత డౌన్ పేమెంట్ రూ.75 వేలు తిరిగి చెల్లించేస్తుంది. 

యువతరం, మిలినియల్ కన్జూమర్స్ పూర్తిగా రైడ్ షేరింగ్ సర్వీసులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. హ్యుండాయ్ వంటి సంస్థలు వేతన జీవులకు, వర్కింగ్ ప్రొఫెషనల్స్, కార్పొరేట్లు, ప్రభుత్వ రంగ సంస్థలకు ఎఎల్డీ ఆటోమోటివ్ సహకారంతో లీజింగ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. 

అమెరికా, యునైటెడ్ కింగ్ డమ్, జర్మనీ, ఫ్రాన్స్ తదితర అభివ్రుద్ది చెందిన దేశాల్లో కార్ల లీజింగ్ 30 శాతానికి చేరుకున్నది. భారతదేశంలో ఇది కేవలం ఒక్క శాతం లోపే ఉంది. ఒరిక్స్ భాగస్వామ్యంతో స్కోడా ఆటో మార్చిలో లీజింగ్ సొల్యూషన్ ఆఫర్ చేస్తోంది. 

స్కోడా ఆటో సేల్స్ అండ్ సర్వీస్, మార్కెటింగ్ డైరెక్టర్ జాక్ హొల్లిస్ మాట్లాడుతూ డాక్టర్లు, చార్టర్డ్ అక్కౌంటెంట్లు 20 శాతం మంది, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు చెందిన వారు 15 శాతం కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు. 

అథర్ ఎనర్జీ కో ఫౌండర్ తరుణ్ మెహతా మాట్లాడుతూ లీజింగ్ బిజినెస్ ప్రోత్సాహకరంగానే ఉన్నదన్నారు. తొలుత చెన్నైలో లీజింగ్ ప్రారంభించామన్నారు. ఈ ఏడాది చివరికల్లా మూడో వంతు కార్ల లీజు ఉంటుందన్నారు.