ముంబై: ఎలక్ట్రానిక్‌ వాహనాలు (ఈవీ) వినిగదారులకు సాధారణంగానే ఛార్జింగ్‌ సమస్యలు ఎదురవుతాయి. అయితే, వారికి చాలా సౌకర్యకరంగా ఉండేలా ముంబైకి చెందిన గిగాడైన్‌ ఎనర్జీ అనే స్టార్టప్ ఒక వినూత్న ఆవిష్కరణ చేసింది. 15 నిమిషాల్లో ఛార్జింగ్‌ ఎక్కేలా బ్యాటరీని తయారు చేసేందుకు అందుకు తగిన విధానాన్ని అభివృద్ధి చేసింది. 

తమ ఆవిష్కరణపై ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో జుబిన్‌ వర్ఘెసీ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం అందుబాటులో ఉన్న లిథియమ్ ‌- ఇయోన్‌ బ్యాటరీల కన్నా అంతర్జాతీయ పేటెంట్‌ పెండింగ్‌ టెక్నాలజీతో తయారు చేసేవి చాలా సమర్థవంతమైనవన్నారు. 

ఉన్న బ్యాటరీలు.. ఎలక్ట్రానిక్‌ వాహనాల ఖర్చుకి అయ్యే ఖరీదులో 40 శాతం ధర పలుకుతాయని గిగాడైన్ ఎనర్జీ సీఈో జుబిన్‌ వర్ఘెసీ తెలిపారు. తాము కనుగొన్న కొత్తరక బ్యాటరీలు ధర తక్కువతో పాటు ఛార్జింగ్‌ సమయాన్ని తగ్గిస్తాయని తెలిపారు.

‘ఎలక్ట్రానిక్‌ వాహనాలు ఉపయోగించడానికి చాలా వీలుగా ఉంటాయి. 2030లోగా 100 శాతం ఈవీలనే విక్రయానికి ఉంచాలన్నది భారత్‌ లక్ష్యం. అయితే, వీటి బ్యాటరీల అధిక ధర వల్ల దీనికి ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. బ్యాటరీల తయారీ పరిశ్రమలో భారత్‌ ముందుండాల్సి ఉంది’ అని గిగాడైన్ ఎనర్జీ సీఈో జుబిన్‌ వర్ఘెసీ అన్నారు. 

ప్రస్తుతం ఈవీ బ్యాటరీలను తయారు చేయాలంటే ప్రధాన వనరుగా లిథియమ్‌-ఇయోన్‌ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా వీటినే ఎక్కువగా వాడుతున్నారు. అయితే, ఇవి ఛార్జ్‌ కావడానికి చాలా సమయం పడుతుండడంతో వినియోగదారులకు కాస్త అసౌకర్యంగా ఉంటుందని జుబిన్‌ అన్నారు. కొత్త సాంకేతికతతో వస్తున్న తమ బ్యాటరీల్లో మాత్రం ఛార్జింగ్‌ సామర్థ్యం అధికంగా ఉంటుందని చెప్పారు. 

తాము అభివృద్ధి చేస్తున్న కొత్తతరం బ్యాటరీలు ఎలక్ట్రోస్టాటిక్‌ ఛార్జ్‌ స్టోరేజ్‌, రాపిడ్‌ కైనటిక్‌ ఫెరాడే రియాక్షన్‌ విధానాల ఆధారంగా పని చేస్తాయని గిగాడైన్ ఎనర్జీ సీఈో జుబిన్‌ వర్ఘెసీ తెలిపారు. 2020కల్లా ఈ బ్యాటరీలను అమ్మకానికి ఉంచడమే తమ లక్ష్యమని చెప్పారు. ఈవీ మార్కెట్‌ నిజంగా ఉన్నతమైన స్థితిలోకి వస్తే, తాము వీటిపై మరింత పని చేసే అవకాశం ఉంటుందని, ఈ మార్కెట్‌లో తమకు మరింత ఆసక్తి కలుగుతుందని అన్నారు. 

ఈ కొత్తతరం బ్యాటరీలను ఎలక్ట్రానిక్ వాహనాల్లో పాత వాటి స్థానంలో నేరుగా భర్తీ చేసేలా రూపొందిస్తామని గిగాడైన్ ఎనర్జీ సీఈో జుబిన్‌ వర్ఘెసీ చెప్పారు. ఈవీల్లో వినియోగించే బ్యాటరీలను తయారు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని, తాము రూపొందిస్తున్న ఈ బ్యాటరీలు టెలికాం టవర్స్‌, ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ వంటి వాటిల్లోనూ ఉపయోగపడతాయని చెప్పారు.