న్యూఢిల్లీ: టాటా టియాగో అమ్మకాలు రెండు లక్షల మైలురాయిని చేరాయి. ఈ కారును 2016, ఏప్రిల్‌లో మార్కెట్లోకి తెచ్చామని, ఇటీవలే రెండు  లక్షల కార్ల విక్రయాలు సాధించామని టాటా మోటార్స్‌ ప్రెసిడెంట్‌ (ప్యాసింజర్‌ వెహికల్స్‌ బిజినెస్‌ యూనిట్‌) మయాంక్‌ పరీఖ్ చెప్పారు.

టాటా టియాగో మోడల్‌ కారును మార్కెట్లోకి తెచ్చిన మూడేళ్ల లోపే మంచి వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. ఇలాంటి ఘనత సాధించిన కొన్ని హ్యాచ్‌బ్యాక్‌ మోడళ్లలో ఇది కూడా ఒకటని వివరించారు.

మొత్తం రెండు లక్షల కార్ల విక్రయాల్లో 1.7 లక్షల వరకూ పెట్రోల్‌ వేరియంట్లే అమ్ముడు పోవడం విశేషం. టియాగో  కారు పెట్రోల్, డీజిల్‌ వేరియంట్లలో కూడా లభిస్తోంది. మొత్తం 22 వేరియంట్లలో లభిస్తున్న ఈ కారు ధరలు రూ.4.20 లక్షల నుంచి రూ.6.49 లక్షల రేంజ్‌లో ఉన్నాయి. 

ఈ కారు మారుతీ వ్యాగన్‌ఆర్, మారుతీ సెలెరియో, హ్యుండాయ్‌ శాంత్రో, డాట్సన్‌ గో మోడల్ కార్లకు గట్టిపోటీనిస్తోంది. నూతన ఇంపాక్ట్ డిజైన్‌లో విపణిలో అడుగు పెట్టిన టాటా మోటార్స్ తొలి మోడల్ ‘టియాగో’ఒకటి.

2017లో దీన్ని రెండు ఎఎంటీ మోడళ్లలో కస్టమర్లకు టాటా మోటార్స్ అందుబాటులోకి తెచ్చింది. టియాగో ఎక్స్‌జడ్ఏ, ఎక్స్‌టీఏ వేరియంట్లతోపాటు స్పెషల్ ఫెస్టివ్ ఎడిషన్‌గా టాటా విజ్‌ను ఆవిష్కరించింది. 

కస్టమర్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకున్న టాటా మోటార్స్.. 2018లో టియాగో ఎన్ఆర్జీ మోడల్ కారును విపణిలోకి తీసుకొచ్చింది. జయేమ్ ఆటోమోటివ్ సంస్థతో 50:50 నిష్పత్తిగా జాయింట్ వెంచర్ టాటా మోటార్స్ ప్రారంభించింది. దీనికి తోడుగా ‘టియాగో ఎక్స్‌జడ్ ప్లస్’మోడల్ కారును ఆవిష్కరించింది.