న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తమ వాహనాల వినియోగదారులకు ఫ్రీ చెకప్‌తోపాటు ఎంపిక చేసిన డీలర్ల వద్ద పాత కార్లను నూతన కార్లతో రుణంపై ఎక్స్చేంజ్ ఫేర్ లో మార్చుకోవచ్చునని టాటా మోటార్స్ తెలిపింది. దేశవ్యాప్తంగా మాన్ సూన్ ఫ్రీ చెకప్ సోమవారం (జూలై 15) నుంచి 11 రోజుల పాటు అంటే ఈ నెల 25వ తేదీ వరకు జరుగుతుందని తెలిపింది. 

ఈ సందర్భంగా టాటా మోటార్స్ తన కార్ల వినియోగదారులకు పలు రకాల ఆఫర్లు, స్కీమ్‌లు అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా కస్టమర్ సెంట్రిక్ స్కీములను ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపింది. రోడ్ సైడ్ అసిస్టెన్స్‌లో  స్పేర్ పార్ట్స్, లేబర్ వ్యయం, ఆయిల్ టాప్ అప్స్ మీద 10 శాతం రాయితీ అందజేస్తున్నట్లు పేర్కొంది. ప్రైవేట్ కార్ల కొనుగోలు దారులు, ఆయిల్ చేంజ్, టాప్ అప్ కోసం 15 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. 

టాటా మొటార్స్ కస్టమర్ కేర్ హెడ్, సీనియర్ జనరల్ మేనేజర్ సుభాజిత్ రాయ్ స్పందిస్తూ ‘టాటా మోటార్స్ సంస్థకు కస్టమర్ సర్వీసు కీలకం. మార్కెట్లో మారుతున్న డిమాండ్లకు అనుగుణంగా విస్త్రుత శ్రేణి సర్వీసులను అందుబాటులోకి తెస్తున్నాం. సమయానుకూలంగా కస్టమర్ అవసరాలకు అనుగుణంగా కాంపిటీటివ్, క్వాలిటీ విస్తరణకు చర్యలు చేపట్టాం. జేడీ పవర్ కస్టమర్ సర్వీస్ ఇండెక్స్‌లో రెండో ర్యాంకులో ఉన్నాం. ఈ మాన్‌సూన్ సెషన్‌లో ప్యాసింజర్ కార్లు, యుటిలిటీ వెహికల్స్ చెకప్ క్యాంప్‌పై కేంద్రీకరించాం’ అని తెలిపారు.