Asianet News TeluguAsianet News Telugu

జూమ్ కారు ద్వారా 20 నగరాల్లోకి టాటా ‘టైగొర్’ విద్యుత్ వెహికల్స్


సామూహిక, వ్యక్తిగత ప్రయాణ వాహనాల్లో విద్యుత్ మోడల్ వాహనాలను అందుబాటులోకి తెచ్చేందుకు టాటా మోటార్స్ ఎంతో క్రుషి చేస్తోంది. ఇందులో భాగంగా వ్యక్తిగత రెంటల్ డ్రైవ్ సంస్థ జూమ్ కారుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఏడాది లోపు 20 నగరాల పరిధిలో 500 విద్యుత్ ‘టైగొర్’ను మార్కెట్లోకి తేనున్నది.

Tata Motors ties up with Zoomcar to deploy Tigor EVs in Pune
Author
New Delhi, First Published Dec 22, 2018, 10:36 AM IST

దేశీయ ఆటో మేజర్ టాటా మోటార్స్.. పరిస్థితులు, పర్యావరణ పరిరక్షణ అవసరాలకు అనుగుణంగా తన వ్యూహాన్ని మార్చుకుంటున్నది. వచ్చే ఏడాది లోపు దేశవ్యాప్తంగా 20 నగరాల పరిధిలో 500 విద్యుత్ వాహనాలను అందుబాటులోకి తేనున్నది. ఇందుకోసం దేశీయ సెల్ఫ్ డ్రైవ్ రెంటల్ కారు సంస్థ ‘జూమ్ కారు’తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నది. ఇందులో భాగంగా  పుణె కేంద్రంగా పని చేస్తున్న ఉత్పాదక కేంద్రంలో టాటా మోటార్స్ కంపాక్ట్ సెడాన్ టైగొర్ ను జూమ్ కారుకు ఆఫర్ చేయనున్నది. 

కర్బన రహిత ప్రయాణానికి అనువుగా టైగొర్ ఈవీ
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ బిజినెస్ అండ్ కార్పొరేట్ స్ట్రాటర్జీ అధ్యక్షుడు శైలేశ్ చంద్ర, జూమ్ కారు చీఫ్ ఎగ్జిక్యూటివ్ కం సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ మోరాన్‌తో కలిసి పుణెలో తొలి 10 టైగొర్ విద్యుత్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కారు కర్భన రహితంగా పుణె వాసుల ప్రయాణానికి అనువుగా ఉంటుందని శైలేశ్ చంద్ర పేర్కొన్నారు. విద్యుత్ వాహన రవాణాను పెంపొందించాలన్న ప్రభుత్వ విజన్ అమలు చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. శరవేగంగా విద్యుత్ వినియోగ వాహనాల తయారీ కోసం వివిధ ఎకో సిస్టమ్ పార్టనర్ల సహకారంతో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. 


తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి టాటా వింగర్‌ 15 సీటర్‌
తెలుగు రాష్ట్రాల మార్కెట్లోకి సరికొత్త వింగర్‌ 15 సీటర్‌, వింగర్‌ 12 సీటర్‌ వాహనాలను టాటా మోటార్స్‌ విడుదల చేసింది. వింగర్‌ 15ఎస్‌ ప్రారంభ ధర రూ.12.6 లక్షలు, వింగర్‌ 12ఎస్‌ ప్రారంభ ధర 13.63 లక్షలుగా ఉంది. సౌకర్యవంతమైన హైబ్యాక్‌ రిక్లైనింగ్‌ సీట్లు, అధిక లగేజ్‌ స్పేస్‌, వ్యక్తిగత ఏసీ వెంట్స్‌, యూఎస్బీ చార్జింగ్‌ పాయింట్లు వంటి ఫీచర్లు ఉన్నట్టు కంపెనీ తెలిపింది. టూర్‌, ట్రావెల్‌ ఆపరేటర్ల కోసం ఈ వాహనాలను రూపొందించినట్టు పేర్కొంది. ఈ వాహనాల పనితీరు చాలా మెరుగ్గా ఉండటంతోపాటు  అధిక ఇంధన సామర్థ్యం కూడా కలిగి ఉంటాయని టాటా మోటార్స్‌ ప్యాసెంజర్‌ కమర్షియల్‌ వెహికిల్‌ బిజినెస్‌ యూనిట్‌ హెడ్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌) సందీప్‌ కుమార్‌ తెలిపారు.

పెట్రో ఉత్పత్తులపై ‘ఎక్సైజ్‌’ పెంపు లేనట్లే?
కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచకపోవచ్చని తెలుస్తోంది. ‘పెట్రో’ ధరలను నియంత్రించేందుకు అక్టోబర్ నెల నాలుగో తేదీన కేంద్రం ఎక్సైజ్‌ సుంకంపై లీటరుకు రూ. 1.5 వంతున కోత విధించింది. అలాగే చమురు మార్కెటింగ్‌ కంపెనీలు లీటర్‌పై రూపాయి వంతున రాయితీ ఇచ్చేలా ప్రకటన చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని ఉపసంహరిస్తే ఓటర్ల నుంచి పెద్దఎత్తున విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉందని బీజేపీ భావిస్తున్నట్లు చమురు శాఖలోని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. 

ఇలా ఎక్సైజ్ సుంకం తగ్గింపునకు కేంద్రం నిర్ణయం
అప్పట్లో ముడి చమురు, ఇంధన ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకంలో కోతతో పాటు రాయితీకి నిర్ణయం తీసుకుంది. అనంతరం మార్కెట్‌ ధరలు కొంతమేర తగ్గినా నాటి నిర్ణయాన్ని మాత్రం ఉపసంహరించుకునే యోచనలో ప్రభుత్వం లేనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు కూడా రాయితీని ఉపసంహరించాల్సిందిగా కోరడం లేదని సంబంధిత అధికారి తెలిపారు. గత కొద్ది సంవత్సరాల్లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు కూడా ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచుకుంటూ వెళ్లింది. ఇలా 2014 నవంబరు నుంచి 9 సార్లు పెంచగా, కేవలం రెండు సార్లు మాత్రమే తగ్గించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios