న్యూఢిల్లీ: వాహనాల భవిష్యత్‌దేనని తేలిపోయింది. ఈ విషయమై టాటా సన్స్ గ్రూప్ అనుబంధ టాటా మోటార్స్, టాటా పవర్ ముందే గుర్తించాయి. ఈ రెండు సంస్థలు విద్యుత్‌ నడిచే వాహనాలకు డిమాండ్ ఉంటుందన్న అంచనాతో దేశవ్యాప్తంగా ఐదు ప్రధాన నగరాల్లో 300 వేగవంతమైన చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి సిద్ధం అయ్యాయి. 

టాటా పవర్, టాటా మోటార్స్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్న నగరాల్లో హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పుణె ఉన్నాయి. దీంట్లో భాగంగా శుక్రవారం పుణెలో సంస్థ ఏడు చార్జింగ్ స్టేషన్లను ప్రారంభించింది. వచ్చే రెండు నెలల్లో ఈ నాలుగు నగరాల్లో 45 చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు టాటా పవర్ ఎండీ, సీఈవో ప్రవీర్ సిన్హా తెలిపారు. 

ఈ చార్జింగ్ స్టేషన్లు టాటా మోటర్స్ డీలర్ల వద్ద, టాటా అనుబంధ సంస్థల ఇతర రిటైల్ అవుట్‌లెట్ల వద్ద ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు టాటా పవర్ ఎండీ, సీఈవో ప్రవీర్ సిన్హా చెప్పారు. విద్యుత్‌తో నడిచే వాహనాలకు వేగవంతంగా, సులభంగా చార్జింగ్ చేయడమే లక్ష్యంగా వీటిని నెలకొల్పుతున్నట్లు తెలిపారు.

టాటా మోటార్స్ సీఈఓ కం ఎండీ గ్యుంటేర్ బుట్చెక్ మాట్లాడుతూ ఎకో సిస్టమ్స్‌ను దేశంలోని వినియోగదారులను అందుబాటులోకి తేవాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. ‘సస్టయినబుల్ మొబిలిటీ మిషన్ సాధన దిశగా, వినియోగదారుల ఈ-మొబిలిటీ సొల్యూషన్స్ పరిష్కారం చూపుతున్నది’ అని తెలిపారు. 

టాటా పవర్ ఏర్పాటు చేయనున్న భారత్ ప్రమాణాలతో 15 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. మున్ముందు 30-50 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 

టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ బిజినెస్ అండ్ కార్పొరేట్ స్ట్రాటర్జీ ప్రెసిడెంట్ శైలేష్ చంద్ర మాట్లాడుతూ విద్యుత్ వినియోగ కార్ల అవసరాలకు అనుగుణంగా అందజేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ముంబై నగరంలో టాటా పవర్ 42 చార్జింగ్ స్టేషన్లు నిర్వహిస్తోంది. ఈ మేరకు హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, ఐజీఎల్ రిటైల్ ఔట్‌లెట్ల సాయంతో చార్జింగ్ స్టేషన్లను నడుపుతోంది.