న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్‌ దిగ్గజం టాటా మోటార్స్‌ ఫలితాలు నిరాశపరిచాయి. గత మార్చి 31వ తేదీతో ముగిసిన 2018-19 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కంపెనీ లాభం భారీగా 49 శాతం క్షీణించి రూ.1108.66 కోట్లకు పడిపోయింది.

గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.2715.16 కోట్ల కన్సాలిడేటెడ్‌ లాభాన్ని ఆర్జించింది. ఆదాయం కూడా రూ.91643.44 కోట్ల నుంచి రూ.87285.64 కోట్లకు తగ్గింది.
 
2018-19 ఆర్థిక సంవత్సరంలో టాటా మోటార్స్‌ రూ.28,724.20 కోట్ల నికర నష్టం నమోదు చేసింది. అంతకు ముందు 2017-18లో కంపెనీ రూ.9091.36 కోట్ల లాభం గడించింది. 

మొత్తం ఆదాయం రూ.2,96,298.23 కోట్ల నుంచి రూ.3,04,903.71 కోట్లకు పెరిగింది. నాలుగో త్రైమాసికంలో దేశీయ వ్యాపారం ద్వారా రూ.106.19 కోట్ల స్టాండ్‌ అలోన్‌ లాభం ఆర్జించింది. గత ఏడాది రూ.499.94 కోట్ల నష్టంలో ఉంది.
 
ఆదాయం మాత్రం రూ.19,173.46 కోట్ల నుంచి రూ.18,561.41 కోట్లకు దిగజారింది. మార్చి 31వ తేదీతో ముగిసిన 2019-20 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ అంతకు ముందు ఏడాదితో పోల్చితే రూ.946.92 కోట్ల స్టాండ్‌ అలోన్‌ నష్టం నుంచి బయటపడి రూ.2398.93 కోట్ల స్టాండ్‌ అలోన్‌ లాభం ఆర్జించింది. స్టాండ్‌ అలోన్‌ ఆదాయం రూ.69,202.76 కోట్లు.
 
జేఎల్‌ఆర్‌ పన్ను చెల్లించకముందు 269 మిలియన్‌ పౌండ్ల లాభాన్ని ఆర్జించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 27.1శాతం తక్కువ. జేఎల్‌ఆర్‌ ఆదాయం 7,134 మిలియన్‌ పౌండ్లుగా నమోదైంది. 

టాటా మోటార్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ మార్కెట్లలో ప్రస్తుతం సమస్యలే ఈ పరిస్థితికి కారణమని తెలిపారు. టాటా మోటార్స్ సంస్థను సృజనాత్మకత,  అభివృద్ధి వంటి అంశాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. 

టాటా మోటార్స్ మార్కెట్‌షేర్‌ను, లాభదాయకతను పెంచుకొంటామని చంద్రశేఖరన్ విశ్వాసం వ్యక్తం చేశారు. టాటా మోటార్స్.. మార్కెట్ అంచనాలను దాటకున్నా ఆ సంస్థ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ (జేఎల్ఆర్) మూడు త్రైమాసికాల తర్వాత పుంజుకున్నది. 

దేశీయంగా డిమాండ్‌ను సుస్థిరంగా కాపాడుకుంటూ టాటా మోటార్స్ ముందుకు సాగుతున్నది. అయితే చైనాలో జాగ్వార్ లాండ్ రోవర్ కార్లకు సవాళ్లు ఎదురవుతున్నాయి. బ్రెగ్జిట్ నేపథ్యంలో జాగ్వార్ తన వ్యయాన్ని తగ్గించుకుంటూ వస్తోంది.