జోధ్‌పూర్‌: ఆటోమొబైల్ మేజర్ టాటా మోటార్స్‌ ప్రక్షాళన చేయ సంకల్పించింది. వచ్చే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఉన్న విక్రయశాలల రూపురేఖలు మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రీమియం ఎస్‌యూవీ హ్యారియర్‌ సహా ఇతర కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయనున్న నేపథ్యంలోవాటికి అనుగుణంగా విక్రయశాలలను తీర్చిదిద్దాలని భావిస్తున్నట్లు టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహన విభాగం అధ్యక్షుడు మయాంక్‌ పరీఖ్‌ పేర్కొన్నారు. భవిష్యత్‌లో మార్కెట్లోకి తేనున్న కార్లను రెండు ప్లాట్‌ఫామ్‌లు ఒమేగా, ఆల్ఫాలపైనే విక్రయించాలని టాటా మోటార్స్‌ యోచిస్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా టాటా మోటార్స్ చేతిలో 790 విక్రయశాలలు ఉన్నాయి. ‘మా విక్రయశాలలు, వర్క్‌షాప్‌లకు కొత్త రూపురేఖలు అవసరమని గుర్తించాం. అన్ని విక్రయశాలల నవీకరణకు అంతర్జాతీయ కన్సల్టింగ్‌ ఏజెన్సీని నియమించుకున్నాం’ అని టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహన విభాగం అధ్యక్షుడు మయాంక్‌ పరీఖ్‌ తెలిపారు. విక్రయశాలల నవీకరణ వచ్చే నెల ప్రారంభమవుతుందని, కనీసం ఏడాది పాటు కొనసాగుతుందని అన్నారు. విక్రయశాలల్లో కొత్త పరిజ్ఞానం, ఆహ్లాదకర వాతావరణం తీసుకొస్తామని తెలిపారు. విక్రయశాలల్లో వైఫై సేవలను ప్రవేశపెడతామని, ప్రత్యేక లాంజ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.

ఇక వచ్చే నెలలో ఎస్‌యూవీ హ్యారియర్‌ను టాటా మోటార్స్‌ విడుదల చేయనున్నది. దీని కోసం ప్రత్యేకంగా 800 మంది సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకునే పనిలో పడింది. మరోవైపు 2021-22 నాటికి విక్రయశాలల సంఖ్యను రెట్టింపు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో సగం వర్చువల్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఆధారంగా పని చేయనున్నాయి. 4జీ, 5జీ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నామని టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహన విభాగం అధ్యక్షుడు పరీఖ్‌ తెలిపారు. 

‘కంపెనీ అన్ని కార్లను రెండు ప్లాట్‌ఫామ్‌లపైనే విక్రయించాలని నిర్ణయించింది. కొన్ని పాత మోడళ్ల అమ్మకాలు నిలిపివేసే అవకాశం కూడా ఉంది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తుండటంతో కొన్నింటిని నవీకరించడం కష్టతరంగా మారింది’ అని టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహన విభాగం అధ్యక్షుడు తెలిపారు. కంపెనీ ఇప్పటికే ఇండిగా, ఇండిగో, మాంజా, విస్టా వంటి మోడళ్ల అమ్మకాలను నిలిపివేసింది. భారత విపణి పరిణితి చెందిందని, కొత్త ఉత్పత్తుల అవసరం ఉందని పరీఖ్‌ అన్నారు. భవిష్యత్‌లో టాటా మోటార్స్‌ కార్లు విద్యుత్‌ వేరియంట్లలో సైతం విడుదలవుతాయని చెప్పారు. ధరల పెంపు అవకాశాలను పరిశీలిస్తున్నామని వివరించారు.