Asianet News TeluguAsianet News Telugu

మహీంద్రాతో ‘టాటా‘ సయ్యాట: ప్రయాణ వాహనాల్లో పోటాపోటీ!!

ఇంతకుముందు సంప్రదాయ పద్ధతుల్లో వాహనాలను ఉత్పత్తి చేసిన టాటా మోటార్స్ మిగతా సంస్థలకంటే వెనుకబడి ఉండేది. కానీ అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీని పుణికి పుచ్చుకుని నూతన మోడల్ కార్లను మార్కెట్ లోకి తేవడంతో ప్రయాణికుల వాహనాల విభాగంలో మూడో స్థానం కోసం మహీంద్రా అండ్ మహీంద్రాతో తలపడేందుకు సిద్ధమైంది. 

Tata Motors closes gap with Mahindra in race for 3rd biggest PV maker in India
Author
New Delhi, First Published Sep 17, 2018, 10:48 AM IST

న్యూఢిల్లీ: ఇప్పటివరకు సంప్రదాయ పద్ధతుల్లో వాహనాలను ఉత్పత్తి చేసిన టాటా మోటార్స్.. తాజాగా ఆధునాతన టెక్నాలజీని పుణికిపుచ్చుకుని.. ఇతర ఆటోమొబైల్ సంస్థలతో ‘సై’ అంటోంది. ప్రయాణికుల వాహనాల తయారీ, విక్రయాల్లో ప్రత్యర్థి సంస్థలకంటే వెనుకబడి ఉన్న టాటా మోటార్స్.. ప్రస్తుతం పోటీదారులుగా ఉన్న మారుతి సుజుకి, మహీంద్రా అండ్ మహీంద్రాలతో తలపడేందుకు దూసుకొస్తోంది. 

ప్యాసింజర్‌ వాహన విభాగంలో దూకుడుగా ముందుకు టాటా మోటార్స్ సాగుతోంది. దేశీయంగా ప్యాసింజర్‌ వాహన విక్రయాల్లో మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) సవాల్‌ విసురుతోంది. ప్రస్తుతం మహీంద్రా వాహన విక్రయాల్లో దేశంలో మూడో స్థానంలో ఉండగా తాజాగా టాటా మోటార్స్‌ ఈ స్థానాన్ని కైవసం చేసుకునే దిశగా సాగుతున్నదని సియామ్‌ తాజా గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్టు నెల వరకు మహీంద్రా, టాటా మోటార్స్‌ వాహన విక్రయాల మధ్య తేడా కేవల 1,313 యూనిట్లు మాత్రమేనని సియామ్‌ తెలిపింది.

గత ఏప్రిల్ నుంచి ఆగస్టు నెల వరకు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) మొత్తం 1,00,015 ప్రయాణ వాహనాలను విక్రయించింది. దాని ప్రత్యర్థి టాటా మోటార్స్‌ కార్లు 98,702 అమ్ముడుపోయాయి. టాటా విక్రయాల్లో కాంపాక్ట్‌ ఎస్‌యువి నెక్సాన్‌, హ్యాచ్‌బ్యాక్‌ టియాగో మోడళ్లు కీలకంగా ఉండటం కలిసి వచ్చింది. 2017-18 ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో మూడో స్థానంలో ఉన్న మహీంద్రా అండ్ మహీంద్రా 90,614 యూనిట్లను విక్రయించగా టాటా మోటార్స్‌ 64,131 కార్లను విక్రయించింది. 
 
గత ఏడాది టాటా మోటార్స్‌ ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- ఆగస్టు మధ్య కాలంలో మారుతి సుజుకీ 7,57,289 యూనిట్లను విక్రయించి అగ్రస్థానంలో కొనసాగుతుండగా, 2,26,396 యూనిట్ల అమ్మకాలతో హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా రెండో స్థానంలో నిలిచింది. కాగా హోండా కార్స్‌ ఇండియా నాలుగో స్థానం నుంచి ఐదో స్థానానికి పడిపోయింది. ఈ కాలంలో హోండా 79,599 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో హోండా విక్రయాలు 73,012 యూనిట్లు. మరోవైపు టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌.. ఈ ఏడాది 67,501 యూనిట్ల విక్రయాలతో హోండా చేరువలోకి వచ్చిందని సియామ్‌ వెల్లడించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios