Asianet News TeluguAsianet News Telugu

భారత్‌లో మరో భారీ ఉత్పాదక యూనిట్ ఏర్పాటు...జపాన్ కంపనీ ప్రకటన

వైబ్రంట్ గుజరాత్ సదస్సు ఆ రాష్ట్ర ప్రగతికి అవసరమైన పెట్టుబడులు కురిపిస్తోంది. ఇప్పటికే ఆటోమొబైల్ హబ్‌గా అవతరిస్తున్న గుజరాత్ రాష్ట్రంలోనే మూడో ఉత్పాదక యూనిట్ ను ఏర్పాటు చేయనున్నట్లు జపాన్ ఆటో మేజర్ ‘సుజుకి మోటార్స్ కార్పొరేషన్’ ప్రకటించింది. ప్రత్యేకించి విద్యుత్, హైబ్రీడ్ వాహనాల ఉత్పత్తిపై కేంద్రీకరిస్తామని పేర్కొంది. టాటా సన్స్ నుంచి బిర్లా గ్రూప్, టొరెంటో తదితర సంస్థలు భారీగా పెట్టుబడి ప్రణాళికలు వెల్లడించాయి.

Suzuki to commission 3rd plant at Gujarat by 2020; introduce new hybrid vehicles
Author
Gujarat, First Published Jan 19, 2019, 11:23 AM IST

గాంధీనగర్: జపాన్‌ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌ తన మూడో ప్లాంట్‌నూ గుజరాత్‌లోనే ఏర్పాటు చేయనున్నది. తొలి ప్లాంట్‌ను 2017లో ప్రారంభించామని,  త్వరలో రెండో ప్లాంట్‌ అందుబాటులోకి తేనున్నదని సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ తొషిహిరో సుజుకీ తెలిపారు. 2020లో మూడో ప్లాంట్‌ను కూడా గుజరాత్‌లోనే ఏర్పాటు చేస్తామని సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ తొషిహిరో సుజుకీ చెప్పారు.

‘గుజరాత్ వైబ్రంట్’ సమ్మిట్‌లో సుజుకి మోటార్‌ కార్పొరేషన్‌ ప్రెసిడెంట్‌ తొషిహిరో సుజుకీ మాట్లాడతూ టయోటా కంపెనీ సాంకేతిక సహకారంతో కొత్త హైబ్రిడ్, ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రవేశపెడతామని తెలిపారు. నయార ఎనర్జీ (రష్యాకు రాస్‌నెఫ్ట్‌ సంస్థ) వాదినార్‌లోని రిఫైనరీ విస్తరణ నిమిత్తం 85 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నది.  

గుజరాత్ వైబ్రంట్ తొలిరోజు ఒప్పందాల విలువ రూ.56 వేల కోట్లుమాంగనీస్‌ తయారు చేసే ఎమ్‌ఓఐఎల్‌ గుజరాత్‌కు చెందిన జీఎమ్‌డీసీ కంపెనీతో కలిసి రూ.250 కోట్ల పెట్టుబడులతో ఒక ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది.  సదస్సు తొలి రోజున గుజరాత్‌ ప్రభుత్వం వివిధ రంగాల సంస్థలతో 130 ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకుంది. వీటి పెట్టుబడుల విలువ రూ. 56,000 కోట్లపైగా ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. చైనాకు చెందిన సింగ్‌షాన్‌ గ్రూప్‌ రూ. 21,000 కోట్లతో ఉక్కు, కార్ల బ్యాటరీల ప్లాంటు ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకుంది.

గుజరాత్‌కు రానున్న టాటాల లిథియం అయాన్‌ ప్లాంట్‌
టాటా గ్రూప్‌ గుజరాత్‌లో లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నది. గ్రూప్‌ కంపెనీల్లో ఒకటైన టాటా కెమికల్స్‌ సోడాయాష్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచుకునే ప్రయత్నాలు చేస్తోందని టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ చెప్పారు. టాటా మోటార్స్, టాటా కెమికల్స్‌ వంటి తమ గ్రూప్‌ కంపెనీలు గుజరాత్‌లోనే చెప్పుకోదగ్గ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, తమ పెట్టుబడులను మరింతగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.  

మూడేళ్లలో 15,000 కోట్ల పెట్టుబడులు పెడతామన్న బిర్లా
మూడేళ్లలో రూ.15వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని ఆదిత్య బిర్లా గ్రూప్‌ తెలిపింది. ఇప్పటికే గుజరాత్‌లో రూ.30వేల కోట్లకు మించి పెట్టుబడులు పెట్టామని ఈ గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా తెలిపారు. టెక్స్‌టైల్స్, రసాయనాలు, గనులు ఇలా విభిన్న రంగాల్లో మూడేళ్లలో రూ.15,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తామని పేర్కొన్నారు.

టొరెంట్‌ గ్రూప్‌ పెట్టుబడులు రూ.10,000  కోట్లు  
గుజరాత్‌లో ఇప్పటికే రూ.30,000 కోట్ల పెట్టుబడులు పెట్టామని, మరో రూ.10,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని టొరెంట్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుధీర్‌ మెహతా చెప్పారు. పునరుత్పాదన ఇంధన, విద్యుత్, గ్యాస్‌ పంపిణీ రంగాల్లో ఈ పెట్టుబడులు పెడతామని వివరించారు.    

Follow Us:
Download App:
  • android
  • ios