న్యూఢిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ సుజుకి మోటర్‌సైకిల్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌(ఎస్‌ఎంఐపీఎల్‌).. భారతీయ వినియోగదారుల ఆకాంక్షలను ప్రతిబింబించే మోటార్ సైకిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ‘హయబూస 2019’ అనే పేరుతో రూపొందించిన సరికొత్త మోటార్ సైకిల్ ఎడిషన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.13.74లక్షలుగా నిర్ణయించారు. ఈ సరికొత్త బైక్ 1,340 సీసీ సామర్థ్యంతో కూడిన ఇంజిన్‌ను కలిగి ఉంది. దేశీయ భారతీయ పరిస్థితులకు అనుగుణంగా దీనిలో సైడ్‌ రిఫ్లెక్టర్లను అమర్చారు. అత్యాధునిక గ్రాఫిక్స్‌తో సరికొత్త రంగులతో దీన్ని తీర్చిదిద్దారు. మెటాలిక్‌ వూర్ట్‌ గ్రే, గ్లాస్‌ స్పార్కిల్‌ బ్లాక్‌ రంగుల్లో ఇది లభ్యం కానున్నది.

హయబూసకు భారత్‌లో ఉన్న అభిమానులను దృష్టిలో పెట్టుకుని సరికొత్త హంగులతో ద్విచక్రవాహనాన్ని తీసుకొచ్చినట్లు ఎస్‌ఎంఐపీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంతోషి తెలిపారు. ‘గత 20ఏళ్లుగా సుజుకీ హయబూసకు భారత్‌లో విశేషమైన ఆదరణ ఉంది. అందుకు అనుగుణంగానే ఈ సరికొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చాం’ అని అన్నారు. ఇండియాలోని బైక్‌ లవర్స్‌కోసం 2019 ఎడిషన్‌ను రెండు కొత్త రంగుల్లో,మరింత ఆకర్షణీయంగా తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. తమ అన్ని డీలర్‌షిప్‌ల ద్వారా ఈ  బైక్‌ అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది.దాదాపు రెండు దశాబ్దాలుగా  స్పోర్ట్స్‌ బైక్‌ల్లో ‘సుజుకి హయాబూసా’కు మనదేశ మార్కెట్‌లో అద్భుతమైన స్పందన లభించిందనీ కంపెనీ ఎండీ సతోషి ఉచిడా వెల్లడించారు.