హైదరాబాద్: దేశవ్యాప్తంగా మోటారు సైకిళ్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని జపాన్‌ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మోటర్‌సైకిల్ భారత్‌లో మరో ఉత్పాదక కేంద్రం ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. రాష్ట్ర మార్కెట్లోకి 250 సీసీ సామర్థ్యం కల గిక్సర్ ఎస్‌ఎఫ్ మోడల్‌ను విడుదల చేసింది.

ఈ సందర్భంగా సుజుకీ మోటార్‌ సైకిల్ ఇండియా హెడ్ కోయిచిరో హిరా మాట్లాడుతూ భారత్‌లో మరో యూనిట్ నెలకొల్పే అంశంపై చర్చిస్తున్నామని పేర్కొన్నారు. ఉత్పాదక కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయమై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. 

ఇందుకు సంబంధించి పలు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్న విషయం వాస్తవమేనని సుజుకి మోటార్ సైకిల్స్ తెలిపింది. దీనిపై మరింత సమాచారం ఇవ్వడానికి సుజుకీ మోటార్‌ సైకిల్ ఇండియా హెడ్ కోయిచిరో హిరా నిరాకరించారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి 9.5 లక్షల నుంచి 10 లక్షల వరకు వాహనాలను విక్రయించే అవకాశం ఉందని సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా హెడ్ కోయిచిరో హిరా అన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో మొత్తం విక్రయాలు 7.5 లక్షల యూనిట్లుగా ఉన్నాయని, ఇందులో 6.7 లక్షల యూనిట్లు దేశీయ మార్కెట్లో విక్రయించగా మిగిలిన వాటా ఎగుమతులదని అన్నారు.
 
దేశీయ మార్కెట్లో ఈ ఏడాది మొత్తం 8.6 లక్షల యూనిట్లను దేశీయంగా విక్రయుంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సుజుకి మోటార్ సైకిల్స్ తెలిపింది.  అలాగే ఎగుమతులు 1.1 లక్షలకు చేర్చాలని చూస్తున్నామని, దీంతో నిర్ధేశిత 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకోవచ్చని భావిస్తున్నట్లు కొచిరో తెలిపారు. 

ఈ ఏడాది అమ్మకాల్లో 23 శాతం వృద్ధిని సాధిస్తే 10 లక్షల మార్కును చేరుకోవటం సాధ్యమేనని సుజుకీ మోటార్‌సైకిల్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ దేవాశిష్‌ హండా అన్నారు. నిర్ధేశిత లక్ష్యాలను చేరుకుంటే భవిష్యత్‌ వ్యాపార అవసరాల కోసం కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు దేవాశిష్‌ తెలిపారు. 

ప్రస్తుతం సుజుకి మోటారు సైకిల్స్ గుర్గావ్ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యం 10 లక్షల యూనిట్లు. గురుగ్రామ్‌ ప్లాంట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచటంతోపాటు రెండో ప్లాంట్‌ను నెలకొల్పే అంశంపై కసరత్తు చేస్తున్నట్లు సుజుకి వైస్‌ ప్రెసిడెంట్‌ దేవాశిష్‌ హండాచెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో దేశీయ మార్కెట్లో మొత్తం 7.5 లక్షల వాహనాలను విక్రయించగా అందులో 6 లక్షలు విక్రయాలు స్కూటర్లవేనని  తెలిపారు.

విపణిలోకి జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌
సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా 250 సీసీ ప్రీమియం బైక్స్‌ విభాగంలోకి ప్రవేశించింది. జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ పేరిట రెండు స్పోర్ట్స్‌ బైక్స్‌ను విడుదల చేసింది. జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250  ధర రూ.1,70,655. జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ ధర రూ.1,09,870 కంపెనీ నిర్ణయించింది.  ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌ సామర్ధ్యం విస్తరణతో పాటూ కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.