న్యూఢిల్లీ: విలాసవంతమైన కార్లను ప్రభుత్వం ‘సిన్‌గూడ్స్‌’ కింద పరిగణించడం ఆపాలని జాగ్వార్‌ లాండ్‌రోవర్‌ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ రోహత్‌సూరి విజ్ఞప్తి చేశారు. వీటిపై విధిస్తున్న పన్నుల భారం అధికంగా ఉందని, వాటిని తగ్గిస్తే ఉత్పాదకత పెరిగి ఆర్థికవృద్ధికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. ధరను బట్టే వస్తువుల వర్గీకరణ చేస్తే స్టార్‌ హోటల్స్‌కు వెళ్లటం, ఖరీదైన దుస్తులు, బూట్లు ధరించడం కూడా సిన్‌గూడ్స్‌ కిందే పరిగణించాలన్నారు. ప్రస్తుత జీఎస్‌టీ శ్లాబ్‌లో విలాసవంతమైన కార్లపై 28% పన్నుతో పాటు అదనంగా 20 శాతం సెస్ మొత్తం కలిపి 48% పన్నులను వసూలు చేస్తున్నారు. 

సిగరెట్లు ఇతరత్రా మత్తు పదార్థాలు మనుషుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వాటిని ‘సిన్‌’ వస్తువుల కింద పరిగణించడం తప్పు లేదని, కానీ కారు డ్రైవింగ్‌తో వచ్చే ముప్పు ఏముందని జాగ్వార్ లాండ్ రోవర్ ఎండీ రోహిత్‌సూరి ప్రశ్నించారు. ప్రభుత్వం ఈ తరహా కార్లను ‘సిన్‌’ వస్తువులుగా పరిగణించడంతో మార్కెట్లో వాటి వృద్ధిపై ప్రభావం చూపుతుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ వ్రుద్ధిలో తమ భాగస్వామ్యాన్ని గుర్తించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో విలాసవంతమైన కార్లు సంవత్సరానికి 40వేల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. భారతదేశంలో ని జాగ్వార్ లాండ్ రోవర్ సంస్థలో 2400 మంది నేరుగా, పరోక్షంలో భారీగా ఉద్యోగాలు లభిస్తున్నాయని తెలిపారు. 

ఈ రంగంలో ఎంతోమంది ఉపాధి పొందుతున్నారని ప్రభుత్వం ఇదే రీతిగా వ్యవహరిస్తే ఈ రంగం నిస్సహాయ స్థితిలోకి వెళ్తుందనే అభిప్రాయాన్ని జాగ్వార్ లాండ్ రోవర్ ఎండీ రోహిత్ సూరీ  వ్యక్తం చేశారు. అసలే మార్కెట్ సైజ్ చిన్నగా ఉంటే భారీగా జీఎస్టీ విధించడం వల్ల ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయని తెలిపారు.